రెండూ తప్పదు

ABN , First Publish Date - 2020-06-07T07:41:52+05:30 IST

కొవిడ్‌-19 వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు కరోనాతోపాటు రెగ్యులర్‌ విధులు నిర్వర్తించాల్సిందేనని

రెండూ తప్పదు

రెగ్యులర్‌, కొవిడ్‌ విధులు నిర్వర్తించాలి

అధికారులతో కలెక్టర్‌ వీర పాండియన్‌


కర్నూలు(అర్బన్‌), జూన్‌ 6: కొవిడ్‌-19 వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు కరోనాతోపాటు రెగ్యులర్‌ విధులు నిర్వర్తించాల్సిందేనని కలెక్టర్‌ వీరపాండియన్‌ అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. కొవిడ్‌-19, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌, ఉపాధి పథకం, రెవెన్యూ తదితర అంశాలపై ఆదోని డివిజన్‌ స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. అభవృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం క్యాలెండర్‌ ప్రకటించిందని, గడువులోగా ఆ పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఉపాధి పథకం కింద జిల్లాలో 5.50 లక్షల మంది జాబ్‌ కార్డులు తీసుకున్నా, కేవలం రెండు లక్షల మందే పనులకు వస్తున్నారని అన్నారు. అందరికీ పనులు కల్పించేందుకు అఽధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఇతర రాష్ట్రాల నుంచి లక్ష మంది వలస కార్మికులు జిల్లాకు వచ్చారని, ఇందులో 80 వేల మంది దాకా అదోని డివిజన్‌లో ఉన్నారని అన్నారు. వీరికి అడిగిన వెంటనే ఉపాధి హామీ పనులు చూపించాలని ఆదేశించారు. ఆగస్టు 3న అన్ని ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని, అప్పట్లోగా నాడు-నేడు కింద చేపట్టిన అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదోని డివిజన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, కట్టడి చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సమీక్షలో జేసీ-2 రామసుందరరెడ్డి, జేసీ-3 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నిధి మీనా, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, డ్వామా పీడీ మురళధర్‌, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T07:41:52+05:30 IST