చీరాలలో హైటెన్షన్‌

ABN , First Publish Date - 2020-03-29T10:36:17+05:30 IST

చీరాలలో కరోనా హైటెన్షన్‌ నెలకొంది..

చీరాలలో హైటెన్షన్‌

సాల్మన్‌ సెంటర్‌ పంచాయితీకి చెందిన ఇరువురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ

తక్షణం స్పందించిన అధికారులు

అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్‌ 

యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై ఆదేశం


చీరాల(ప్రకాశం): చీరాలలో కరోనా హైటెన్షన్‌ నెలకొంది. చీరాల మండలం సాల్మన్‌సెంటర్‌ పంచాయితీ నవాబుపేటలో ఇరువురికి కరోనా పాజిటివ్‌గా శనివారం నిర్ధారణ కావటం అందుకు కారణం. దీంతో జిల్లా, స్థానిక అధికార యంత్రాంగం, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జెసీ షన్మోహన్‌, ఆర్డీఓ ప్రభాకరరెడి వెంటనే స్పందించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి సంబంధించిన పూర్తివివరాలు, ఎవరెవరితో వారు కలిశారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నారు. తదితర అంశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణను నిర్ధేశించారు.


12న వెళ్లి.. 19న తిరిగొచ్చారు

చీరాల మండలం సాల్మన్‌సెంటర్‌ పంచాయతీకి చెందిన తొమ్మిదిమంది, ఒంగోలు నుంచి ఇద్దరు, కారంచేడు నుంచి ఒకరు, పేరాల నుంచి ఇద్దరు, కొత్తపేట నుంచి ఒకరు మొత్తం 15 మంది ఈ నెల 12న ఢిల్లీ సమీపంలోని నిజాముద్దీన్‌కు వెళ్ళారు. అక్కడ జరిగిన మతపరమైన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల అనంతరం ఈనెల 17వ తేదీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. వారిలో కొందరు జీటీ ఎక్స్‌ప్రెస్‌లోనూ, మరికొందరు దురంతో ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారు. ఈ నేపథ్యంలో చీరాల మండలం సాల్మన్‌సెంటర్‌కి చెందిన 60ఏళ్లకు పైబడిన ఓ వ్యక్తి జలుబు, జ్వరంతో 19న ఇంటికి చేరాడు. ఇంటికి చేరిన తర్వాత ఆమె భార్య కూడా జలుబు, జ్వరంతో ఇబ్బందిపడింది. ఈ నేపథ్యంలో వారు స్థానికంగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు. అయితే వారికి తగ్గకపోవటంతో ఈనెల 26న ఇరువురు చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్సకోసం వెళ్లారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి కరోనా అనుమానంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పరీక్షల అనంతరం శనివారం ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.


ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగం, ప్రజలు

కరోనా వైరస్‌కు సంబంధించి పాజిటివ్‌ కేసులు స్థానికంగా రెండు నిర్ధారణ కావటం పట్ల ప్రజలు, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో చీరాల ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో స్థానికంగా ప్రజల్లో కలకలం రేగుతోంది. వైరస్‌ ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏరియా వైద్యశాలలో చికిత్సకు ముందు ఆ దంపతులు స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. ఆ క్రమంలో వారు ఎందరిని కలిశారు. చుట్టుపక్కల ఇళ్ళవారు, బంధువులు, స్నేహితులు ఎంతమందితో కలిసి ఉంటారనే అంశంపై తహసీల్దార్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి, వన్‌టౌన్‌ సీఐ నాగమల్లేశ్వరరావు తదితర అధికారులు, సిబ్బంది ఆ దంపతుల ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. యుద్ధప్రాతిపదికన ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఢిల్లీ నుంచి వచ్చాక అతను స్థానికంగా జరిగిన ఓ వ్యక్తి అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్లు స్థానికులు చెప్తున్నారు.


అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం రాత్రి కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆ భార్యాభర్తలు తిరిగిన ప్రదేశాలు గుర్తించాలన్నారు. వారందరిని క్వారంటైన్‌కు పంపించాలని పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ప్రాథమికంగా చికిత్స చేసిన ఆర్‌ఎంపీని, వారు కలిసిన వారిని క్వారంటైన్‌కు పంపించేందుకు చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. ఇప్పటికి ఎంతమందిని క్వారంటైన్‌కు పంపింది వివరాలు తెలుసుకున్నారు.


Updated Date - 2020-03-29T10:36:17+05:30 IST