అప్పుచేసి వంట

ABN , First Publish Date - 2021-12-12T04:28:52+05:30 IST

నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆచరణలో అబాసుపాలవుతోంది. పెరిగిన ధరలకు, ప్రభు త్వం చెల్లించే బిల్లులకు ఏ మాత్రం పొంతన లేదు.

అప్పుచేసి వంట

ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలు

మూడు నెలలుగా బకాయి

ఉమ్మడి జిల్లాలో రూ.9.76కోట్ల బకాయి


(ఆంరఽధజ్యోతి ప్రతినిధి,నల్లగొండ):  నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆచరణలో అబాసుపాలవుతోంది. పెరిగిన ధరలకు, ప్రభు త్వం చెల్లించే బిల్లులకు ఏ మాత్రం పొంతన లేదు. దీనికి తోడు నెలల కొద్దీ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోతున్నా రు. బిల్లులు రావడం లేదన్న కారణంతో ఏజెన్సీలు కారం మెతుకులు, నీళ్ల చా రు పెడుతుండగా, పేద విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉమ్మడి జిల్లా లో ఇప్పటికే 300 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచింది.


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఖర్చుగా ప్రభుత్వం రూ.7.45 చొప్పున చెల్లిస్తోంది. కూర, చారు, గుడ్డుతో మెనూ ప్రకారం భోజనం వండిపెట్టాలంటే, తాజాగా పెరిగి న ధరల మేరకు రూ.15వరకు ఖర్చు వస్తోంది. దీంతో చేసేది లేక ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు గుడ్డు పెట్టడం మానేశారు. కూరకు, చారుకు మధ్య తేడా లేకుండాపోయింది. నీళ్ల కూరలతో భోజనమే నిరుపేద విద్యార్థులకు దిక్కవుతోంది.వంటగదులు నిర్మించి గ్యాస్‌ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విషయాన్ని మధ్యలోనే వదిలేయడంతో కట్టెలపొయ్యి మీదనే వంట చేస్తూ నిర్వాహకులు అనారోగ్యం పాలవుతున్నారు. వీటన్నింటికీ తోడు నెలవారీగా బిల్లులు రావడం లేదు. కనీసంగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు బిల్లులు మంజూరు కాని పరిస్థితి ఉంది. బిల్లులు రాకపోవడంతో కిరాణా దుకాణాల యజమానుల కాళ్లావేళ్లాపడి నిర్వాహకులు అరువుకు కిరాణా సరుకులు తెస్తున్నారు. ఒక్కోసారి వ్యాపారులు సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మూడు నెలలుగా ఒక్క మునుగోడు ఉన్నత పాఠశాల ఏజెన్సీ రూ.1లక్ష వరకు అప్పు చేసింది.


మంజూరుకాని బిల్లులు

ఉమ్మడి జిల్లాలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు 2,384 ఉన్నాయి. ఏజెన్సీ నిర్వాహకులకు ప్రభుత్వం నుంచి మూడు నెలలకు గాను రూ.9.76కోట్ల బ కాయిలు రావల్సి ఉంది. నల్లగొండ జిల్లాలోని సంబంధించి 800 ఏజెన్సీల కు వంటసామాగ్రి నిమిత్తం రూ.3,31,82,291లు, సహాయకులకు రూ.32. 47లక్షలు, సూర్యాపేట జిల్లాలో 891 ఏజెన్సీలకు రూ.3కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 693 ఏజెన్సీలకు గానూ రూ3,14,13,000వేలు మంజూ రు చేయాల్సి ఉంది. గత మూడు నెలల బిల్లులతో పాటు కరోనాకు ముం దు జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించిన కోడిగుడ్డు బిల్లు కూడా రావాల్సి ఉంది. అదేవిధంగా ఏజెన్సీ నిర్వాహకులకు చెల్లించే గౌరవ వేతనం సైతం పెండింగ్‌లో ఉంది. నిర్వాహకులకు అప్పు భరించే స్థాయి లేకపోవడం, పాఠశాల్లో ప్రధానోపాధ్యాయులు వారికి నచ్చిన వారినే పని లో ఉంచుకోవాలన్న ధోరణితో ఉండటం, కొన్నిచోట్ల వారికి ప్రత్యేకంగా వం డిపెట్టాలని ఉపాధ్యాయులు ఆంక్షలు పెడుతుండటంతో ఏజెన్సీలు క్రమం గా పాఠశాలలకు దూరమవుతున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 300 పాఠశాల్లో మధ్యాహ్న భోజనం నిలిచింది. దీంతో విద్యార్థులు ఇంటి నుంచే మధ్యాహ్న భోజనం తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 7,152 మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీల్లో పనిచేస్తున్నారు. కొన్నిచోట్ల ఇద్దరికి బదులు ఒకరు విధులు నిర్వహిస్తున్నారు.



 కొండమల్లేపల్లిలో గుడ్డు బంద్‌

 కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండల కేంద్రం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో సుమారు 1500మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతంలో మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు రోజులు గుడ్డు ఇచ్చేవారు. ఈ ఏడాది పాఠశాల ప్రారంభం నుంచే ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు గుడ్డు ఇవ్వడం బంద్‌ చేశారు. ప్రభుత్వం ఒక గుడ్డుకు రూ.4 చెల్లిస్తుండగా, మార్కెట్‌లో రూ.6కు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అధికంగా పెరిగాయని, బిల్లులు రాకపోవడంతో అప్పు చేసి అవస్థలుపడుతున్నామని అంటున్నారు. పాఠశాల ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.3లక్షల వరకు బిల్లులతోపాటు గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయ ని నిర్వాహకులు తెలిపారు. ఒక్క ఏజెన్సీకి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే జీవనం గడిచేదెలా అని ప్రశ్నిస్తున్నా రు. పెండింగ్‌ బిల్లులు, వేతనాలు చెల్లించాలని స్థానిక తహసీల్దార్‌కు ఇటీవల వినతిపత్రం అందజేశారు. లేదంటే వంట బంద్‌ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.


మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

మిర్యాలగూడ, డిసెంబరు 11: మధ్యాహ్న భోజన పెండింగ్‌ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్ర శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేద విద్యార్ధులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తోందన్నారు. పాఠశాలలో సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడం, కనీస మౌలిక  సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడంలేదన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ కొరవడిందన్నారు. ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులను చెల్లించకపోవడంతో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచకపోవడంతో అరకొరగా వడ్డిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.280 కోట్లకు పైగా మెస్‌బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు అప్పు చేసి మధ్యాహ్న భోజనం వండుతున్నారని, ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎప్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యుడు మూడావత్‌ జగన్‌ నాయక్‌, దామరచర్ల మండల కార్యదర్శి ధరావత్‌ నవీన్‌ నాయక్‌, నాయకులు ఎండి వధూద్‌, సమ్మద్‌, ధీరావత్‌ వీరన్న, సోహెల్‌ పాల్గొన్నారు.



సమస్యల పరిష్కారానికి దశల వారి ఆందోళన : పోలె సత్యనారాయణ, మధ్యాహ్న భోజన ఏజెన్సీల సంఘం రాష్ట్ర కార్యదర్శి

మధ్యాహ్న భోజన ఏజెన్సీల సమస్యల పరిష్కారానికి దశలవారీ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయిం చాం. ఈనెల 15 నుంచి డివిజన్ల వారీగా, జనవరి 3న జిల్లా కేంద్రంలో, జనవరి 8, 9న ఇందిరా పార్కువద్ద 48 గంటల దీక్ష చేయనున్నాం. ప్రతీనెల బిల్లులు చెల్లించాలి. ఏజెన్సీ నిర్వాహకులకు కనీస వేతనం రూ.19వేలు ఉండాలి. ఈఎ్‌సఐ, పీఎఫ్‌ వంటి సౌకర్యా లు కల్పించి డ్రెస్‌ కోడ్‌ అమలుచేయాలి. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇస్తున్నట్లే కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలి. ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించాలి.


ఆరు నెలల బిల్లులు రావాలి : పద్మ, ఏజెన్సీ నిర్వాహకురాలు, నల్లగొండ

కరోనాకు ముందు మూడు నెలలు, తాజాగా మూడు నెలల బిల్లు పెండింగ్‌లో ఉంది. నల్లగొం డ టౌన్‌లో ఇప్పటికే నాలుగు చోట్ల ఏజెన్సీలు బంద్‌ కాగా, టీచర్ల ఒత్తిడితో మిగిలిన సభ్యులతో అక్కడ కూడా వంటచేస్తున్నాం. నల్లగొండ బా య్స్‌ హైస్కూల్‌లో 360 మంది ఉంటే నెలకు వచ్చే ఖర్చు రూ.30వేలు. ప్రభుత్వం మంజూరు చేసేది రూ.35వేలు. మిగిలే రూ.5వేలను ముగ్గు రం పంచుకుంటున్నాం. సరుకులు తెచ్చేందుకు బండి పెట్రోల్‌, ఇతర ఖర్చు సైతం ఈ 5వేల్లోనే వెళ్లదీయాలి. విద్యార్థులకు గుడ్డు పెట్టాలని ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తున్నారు. గుడ్డుకోసం ప్రభుత్వం ఇచ్చేది రూ.4 కాగా, మార్కెట్‌లో రూ.5.50గా ఉంది. గుడ్లు పెట్టలేక అరటి పండు ఇస్తున్నాం. దానికి రూ.2వేల వరకు అవుతోంది. టమాటా ధర కిలో రూ.90 ఉన్నా కొనుగోలు చేయక తప్పడంలేదు. నూనె ధరలు కూడా పెరిగాయి. వంట చేసి పెట్టడం కష్టమవుతోంది.


Updated Date - 2021-12-12T04:28:52+05:30 IST