మలినాలు తొలగాలంటే..

ABN , First Publish Date - 2022-04-15T05:30:00+05:30 IST

ఇంద్రియాలు అనేక ఆకర్షణలకు లోనవుతాయి. కన్ను అందం వైపు మనసును మళ్ళిస్తుంది.

మలినాలు తొలగాలంటే..

ఇంద్రియాలు అనేక ఆకర్షణలకు లోనవుతాయి. కన్ను అందం వైపు మనసును మళ్ళిస్తుంది. దాంతో పదే పదే దాన్నే చూడాలనిపిస్తుంది. అది మోహంగా మారిపోతుంది. మోహం మనసును కలుషితం చేసే పెద్ద మలినం. 


మాలిన్యాలు, కళంకాలు, కలుషితాలు, మత్తు కలిగించేవి... వీటన్నిటినీ ‘ఆస్రవాలు’ అంటుంది బౌద్ధం. ఇవన్నీ మనల్నీ, మన మనసుల్నీ మలినం చేస్తాయి. ఇవి ప్రవాహంలా మనలోకి వచ్చిపడతాయి. చెడు మార్గంలోకి నెట్టేస్తాయి. ఈ దుర్గుణాలను మనసు నుంచీ తొలగించుకోవాలి. కొత్తగా వచ్చి మనసును ముంచేయకుండా చూసుకోవాలి. మనుసులో కోరికలను అదుపులో ఉంచుకుంటేనే ఇది సాధ్యం.


బౌద్ధ భిక్షువులు మూడు చీవరాలను (భిక్షువులు ధరించే వస్త్రం) మించి ఎక్కువగా తమ వద్ద ఉంచుకోకూడదు. ఉపయోగించే చీవరాలు పూర్తిగా చిరిగిపోయి, ఇక కట్టుకోడానికి ఎలాంటి అవకాశం లేనప్పుడు... ఆ భిక్షువు తను ఉంటున్న బౌద్ధ సంఘం పెద్దతో ఆ విషయం చెప్పాలి. ఆ పెద్ద అనుమతించిన తరువాత మాత్రమే కొత్త చీవరాలు ధరించాలి. ఏ భిక్షువుకైనా బహుమతిగా చీవరాలు లభిస్తే... వాటిని సంఘానికి అప్పగించాలి తప్ప తన సొంతానికి దాచుకోకూడదు.


బుద్ధుడి చీవరాలు ఇక కుట్టడానికి వీలులేనంతగా చిరుగులు పడి ఉండేవి. అయినా కొందరు భిక్షువులు కొత్త చీవరాలను దాచుకొనేవారు. అలాగే తమకు లభించిన మంచి ఆహార పదార్థాలను నిలువ చేసుకొనేవారు. ఇలాంటి వారి విషయం బుద్ధుని దగ్గరకు వచ్చింది. అప్పుడు బుద్ధుడు వారితో ‘‘ఆస్రవాలు మనల్ని మలినం చేస్తాయి’’ అంటూ వాటిని ఎలా వదిలించుకోవాలో చెప్పాడు. 


మనసును నిగ్రహించుకోవడం వల్ల ఆస్రవాలు దరిచేరవు. ముఖ్యంగా ఇంద్రియాలు అనేక ఆకర్షణలకు లోనవుతాయి. కన్ను అందం వైపు మనసును మళ్ళిస్తుంది. దాంతో పదే పదే దాన్నే చూడాలనిపిస్తుంది. అది మోహంగా మారిపోతుంది. మోహం మనసును కలుషితం చేసే పెద్ద మలినం. అలాగే రుచి, వినికిడి, స్పర్శ, వాననలు... వీటిపై వ్యామోహం మితిమీరినప్పుడు మనల్ని మలినపరుస్తాయి. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించుకుంటే మలినాలు మనలోకి ప్రవహించవు. అలాగే వస్తువులను వివేకంగా ఉపయోగించుకోవడం వల్ల మలినాలకు దూరం కాగలం. దుస్తులను కేవలం శీతోష్ణాల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికీ, ఈగలు, దోమలు, కీటకాలు, పాముల లాంటి పురుగుల నుంచి కాపాడుకోవడానికీ మాత్రమే ఉపయోగించాలి. అందుకోసమే వాటిని ధరించాలి. అలాగే, ఆహారం కూడా... శరీరం శుష్కించిపోకుండా ఉండడానికే. అంతే తప్ప, అతిగా తిని... మత్తును, సోమరితనాన్ని పెంచుకోవడానికి కాదు. తగినంతగా ఉపయోగించడం వల్ల కూడా ఆస్రవాలను దూరం పెట్టగలం. ఇంకా కొన్ని ఇబ్బందులను ఓర్పుతో భరించగలిగితే ఆస్రవాల సుడిలో పడిపోకుండా ఉంటాం. అతి చలి, అతి వేడి, ఆకలిదప్పులు, ఈగలు, దోమల బాధ, అనారోగ్యం... వీటినే కాకుండా పరుషమైన మాటల్ని భరించడం వల్ల  కూడా మన మనసులోకి మలినాలు ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయగలం. క్రూర జంతువులను, విష సర్పాలను, ఎండి కొనదేలిన మోడులను, ముళ్ళ కంపలను, మురికి గుంటలను, చెత్త కుప్పలను ఎలా దూరం పెడతామో... చెడ్డవారిని కూడా అలాగే దూరం పెట్టాలి. ఇలా దూరంగా పెట్టడం వల్ల కూడా మనం మలినాలకు దూరంగా ఉంటాం.


ఇవన్నీ చెప్పి ‘‘భిక్షువులారా! వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు చేయాల్సింది మరొకటి ఉంది. అదే తుడిచివేయడం. చెడు తలపులను వెంటనే తుడిచివేయాలి, ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, మోహం... ఇలాంటి దురాలోచలన్నిటినీ పుట్టీ పుట్టక ముందే మనలోనుంచి పంపేయాలి. వాటి జాడలు లేకుండా తుడిచెయ్యాలి. అప్పుడే మనం ‘కుశల కర్మలు’ (మంచి పనులు) చేస్తాం. మంచి ఆలోచనలు చేస్తాం. మన మనసు మలిన రహితం అవుతుంది. దురాశలకు దూరం అవుతుంది’’ అని చెప్పాడు.


ఆ ఆశపోతు భిక్షువులకు ఈ బోధతో జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి దాచి పెట్టుకొనే పనులు మానుకున్నారు.


బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-04-15T05:30:00+05:30 IST