United Kingdom : ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రాజీనామా... నూతన మంత్రివర్గం ఏర్పాటు...

ABN , First Publish Date - 2022-07-07T22:54:05+05:30 IST

బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు.

United Kingdom : ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రాజీనామా... నూతన మంత్రివర్గం ఏర్పాటు...

లండన్ : బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్దర్మ ప్రధానిగా ఆయన కొనసాగుతారు. దీని కోసం ఆయన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబరునాటికి నూతన ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు ఆ దేశ మీడియా చెప్తోంది. 


బోరిస్ జాన్సన్ దాదాపు మూడేళ్ళపాటు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తాను ప్రపంచంలో అత్యుత్తమ పదవిని వదులుకుంటున్నట్లు బోరిస్ చెప్పారు. ప్రధాన మంత్రిగా తన వైఫల్యాల పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నూతన ప్రధాని నియమితుడయ్యే వరకు తాను పదవిలో కొనసాగుతానని చెప్పారు. తన వైఫల్యాలకు విచారం వ్యక్తం చేస్తూ, తన విజయాల పట్ల తాను గర్వపడుతున్నానని తెలిపారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ట్రజరీ చీఫ్ నధిమ్ జహవి సలహా మేరకు ఆయన రాజీనామా చేసినట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. 


జాతిని ఉద్దేశించి బోరిస్ మాట్లాడుతూ, ‘‘కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు, మంత్రివర్గ సహచరుల పిలుపును శిరసావహిస్తూ నేను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’’ అని చెప్పారు. 


బోరిస్ తర్వాత భారత సంతతికి చెందిన రుషి సునక్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న బోరిస్ ప్రభుత్వం నుంచి జూలై 5న ఆర్థిక మంత్రి రుషి సూనక్, ఆర్థిక శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ రాజీనామా చేశారు. దీంతో సహచరుల అవసరం అత్యధికంగా ఉన్న బోరిస్ ప్రభుత్వం బలహీనపడింది. మరోవైపు ఆయన నేతృత్వంలోని బృందంలో దాదాపు 50 మంది రాజీనామాలు సమర్పించడం ఆయనకు శరాఘాతంలా తగిలింది. అంతేకాకుండా ఆయన నిజాయితీపై చాలా కాలం నుంచి విపరీతమైన ప్రశ్నలు తలెత్తాయి. టోరీ లీడర్‌షిప్ (కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం) ఎంపిక కోసం టైమ్‌టేబుల్‌‌ను వచ్చే వారం ప్రకటించనున్నట్లు బోరిస్ తెలిపారు. 


రక్షణ మంత్రి బెన్ వాలేస్, ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన రుషి సూనక్ తదుపరి ప్రధాన మంత్రి పదవికి జరిగే పోటీలో ముందు వరుసలో ఉన్నట్లు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు నిర్వహించిన YouGov surveyలో వెల్లడైంది. 


బోరిస్ రాజీనామాపై భారత ప్రభుత్వం స్పందిస్తూ, ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. 

Updated Date - 2022-07-07T22:54:05+05:30 IST