బుల్డోజర్ జాన్సన్‌పై ఆమ్నెస్టీ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-04-23T02:11:30+05:30 IST

న్యూఢిల్లీ: భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్‌లోని హలోల్‌లో జేసీబీ ఫ్యాక్టరీ సందర్శించి బుల్డోజర్ ఎక్కడంపై ఆమ్నెస్టీ ఇండియా విమర్శలు గుప్పించింది.

బుల్డోజర్ జాన్సన్‌పై ఆమ్నెస్టీ ఆగ్రహం

న్యూఢిల్లీ: భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్‌లోని హలోల్‌లో జేసీబీ ఫ్యాక్టరీ సందర్శించి బుల్డోజర్ ఎక్కడంపై ఆమ్నెస్టీ ఇండియా విమర్శలు గుప్పించింది. బుల్డోజర్ ఎక్కి ఫొటోలకు ఫోజులివ్వడం ద్వారా ఆయన తెలివితక్కువగా వ్యవహరించారని విమర్శించింది. ఓ పక్క ఢిల్లీ జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు బుల్డోజర్లు ఉపయోగిస్తున్న సమయంలోనే బ్రిటన్ ప్రధాని గుజరాత్‌లో బుల్డోజర్ ఎక్కడం సరైన సంకేతాలు ఇవ్వలేదని ఆమ్నెస్టీ అభిప్రాయపడింది. బ్రిటన్‌కు చెందిన జేసీబీ ఫ్యాక్టరీ గుజరాత్‌లో బుల్డోజర్లు తయారు చేస్తోంది. 


భారత్‌లో ఇటీవల అక్రమ కట్టడాలను కూల్చేందుకు బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారు. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో శ్రీరామనవమి శోభాయాత్రలపై రాళ్లదాడి చేసిన వారి ఇళ్లను కూడా బుల్డోజర్లతో కూల్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బుల్డోజర్ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఎస్పీ అధినేత అఖిలేష్... యోగి ఆదిత్యనాథ్‌ను బుల్డోజర్ బాబా అని పిలిచినప్పటినుంచీ ప్రచారం ఊపందుకుంది. చివరకు ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కమలం పార్టీ బుల్డోజర్ల వినియోగాన్ని పెంచేసింది. దేశవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లను వినియోగించాలని కమలనాథులు యోచిస్తున్నారు.   




Updated Date - 2022-04-23T02:11:30+05:30 IST