బోరుమంటున్న రైతులు

ABN , First Publish Date - 2020-07-06T10:44:56+05:30 IST

నియోజకవర్గంలో బోర్‌వెల్‌ యజమానుల సిండికేట్‌ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది.

బోరుమంటున్న రైతులు

బోరుబావుల తవ్వకంలో రిగ్‌ యజమానుల సిండికేట్‌

అధిక ధరలతో నిలువు దోపిడీ

బయటి రిగ్గులు రాకుండా చర్యలు 


బొమ్మనహాళ్‌, జూలై 5 : నియోజకవర్గంలో బోర్‌వెల్‌  యజమానుల సిండికేట్‌ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. వ్యవసాయ పొలాల్లో బోరుబావులు తవ్వించుకునేందుకు రైతులు తక్కువ ధరకు వచ్చే రిగ్గులను ఆశ్రయిస్తే వారికి మూడినట్లే. చెప్పిన రేటుకే, స్థానిక రిగ్గులతోనే బోరు బా వులు తవ్వించుకోవాలి. బయటి ప్రాంత రిగ్గులను ఆశ్రయిస్తే వారిని పోలీసుల ద్వారా బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.  


అడుగు రూ. 95 దాకా...

సాధారణంగా బోరు బావి తవ్వించుకోవడానికి  రిగ్గు యజమానిని ఆశ్రయించి రైతు బేరమాడతారు. ఎవరు తక్కువ ధరకు వస్తే వారితో బోరుబావి తవ్వించుకోవచ్చు. ఇక్కడ అలాంటి అవకాశాలు ఏమాత్రం లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రాంతానికో ఏజెంటు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న రిగ్గులనే ఆశ్రయించి బోర్లు తవ్వించుకోవాల్సిన పరిస్థితి. బయట ప్రాంతాల్లో అడుగుకు రూ. 80 నుంచి రూ. 90 వరకు వారి అనుకూలాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఇక్కడ బోర్‌వెల్‌ యజమానులు సిండికేట్‌గా ఏర్పడటంతో అడుగుకు రూ. 95  చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


కేసులతో బెదిరింపులు

ఇతర ప్రాంతాలకు చెందిన బోర్‌వెల్‌ యజమానులు అడుగుపెడితే వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బొమ్మనహాళ్‌ మండలంలో ఇటీ వల  కళ్యాణదుర్గం, బళ్లారి ప్రాంతాలకు చెందిన బోర్‌వెల్స్‌ వాహనాలు వచ్చి పొలాల్లో బోర్లు వేసేందుకు ప్రయత్నిస్తే వారిపై కేసులు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి బయటి ప్రాంతానికి సంబంధించిన రి గ్గులు రావడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా కొందరు అధికారులకు చెల్లించే మామూళ్ల కారణంగా సిండికేట్‌కు వంతపాడుతూ బయటి ప్రాంత రిగ్గులు రాకుండా అడ్డుకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు. 


వాల్టా చట్టానికి తూట్లు 

భూగర్భ జల వనరుల శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో వాల్టా చట్టం అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారులతో  అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా వాల్టా చట్టానికి తూట్లు పొడిచి బోర్లు వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.  మండలంలో  దాదాపు 600 అడుగుల లోతులో ఇష్టా రాజ్యంగా బోర్లు వేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఒక్కో రైతు మూడుకు పైగా బోర్లు వేసినా ఇంచు నీరు మాత్రమే వస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. గతంలో 50 లేదా వంద అడుగులలోపు బోరు వేస్తే నీరు వచ్చేవి. ప్రస్తుతం దాదాపు వెయ్యి అడుగులు వేసినా చుక్కనీరు పడటం లేదు.  అధికారులు స్థానికంగా ఉండే కొన్ని రిగ్గులు బోర్లు వేస్తే చూసీచూడనట్లు వ్యవహరిం చడం, బయట రిగ్గులు  వస్తే వెంటనే కేసులు పెడుతుం డటంతో సిండికేట్‌ మాఫియాతో రైతులు తీవ్రంగా నష్టపో తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 


చర్యలు తీసుకుంటాం... అనిల్‌ కుమార్‌, తహసీల్దార్‌, బొమ్మనహాళ్‌

పొలాల్లో అనుమతి లేకుండా రిగ్‌బోర్‌లు వేస్తున్నట్టు మా దృష్టికి వస్తే సత్వరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామాలలో రిగ్‌ బోర్‌లు వేయాలనుకుంటే రైతులు దరఖాస్తు చేసుకోవాలి. భూగర్భజల వనరుల శాఖ ద్వారా పరిశీలించి అనుమతులిస్తాం. అనుమతి లేకుండా రిగ్‌ బోర్లు వేస్తే బోర్లన్నింటినీ సీజ్‌ చేస్తాం. 

Updated Date - 2020-07-06T10:44:56+05:30 IST