తాగునీటి కోసం బేజారు!

ABN , First Publish Date - 2021-05-12T06:49:42+05:30 IST

మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల లో ప్రజలు మంచినీటి కోసం బేజారు అవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మంచినీటి కోసం బోరుబావు ల వద్ద బిందెలు పెట్టుకోని వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని మహిళలు వాపోతున్నారు. లక్కారం

తాగునీటి కోసం బేజారు!
చేతిపంపు వద్ద ఖాళీ బిందెలు, బకెట్లతో మహిళలు

ఉదయం నుంచి రాత్రి వరకు బోర్ల వద్ద బిందెలతో వేచిచూడాల్సిందే.. 

ఆందోళన చేసినా.. పట్టించుకోని అధికారులు

ఉట్నూర్‌, మే 11: మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల లో ప్రజలు మంచినీటి కోసం బేజారు అవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మంచినీటి కోసం బోరుబావు ల వద్ద బిందెలు పెట్టుకోని వేచి చూడాల్సిన పరిస్థితి  వచ్చిందని మహిళలు వాపోతున్నారు. లక్కారం పంచాయతీ పరిధిలో ఉన్న కుమ్రం భీం నగర్‌, నవోదయ నగర్‌, దేవుషాగూడ, రాంజీగోండ్‌నగర్‌, వేణునగర్‌,  అంబేద్కర్‌ నగర్‌ ప్రాంతాలలో మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. రెండు నెలల క్రితమే లక్కారం గ్రామ పంచాయతీ ముందు తాగునీటి కోసం ఆందోళన చేసి తాగునీరు అందించాలని ప్రజాప్రతినిధులను, సర్పంచ్‌ను కోరినా.. ఫలితం లేకుండా పోయిందని స్థానిక మహిళలు పేర్కొంటున్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా నీరు ఇస్తున్నామని చెప్పుకుంటున్న ఆర్‌డబ్లూఎస్‌ అధికారులు బోరులకు మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, పంచాయతీల నుంచి కూడా మరమ్మతులు చేస్తే రికార్డు చేయమని, నిధులు రావని ఖరాకండిగా చెబుతుండడంతో పంచాయతీ అధికారులు సైతం బోర్లకు మరమ్మతులు చేయించడం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. లక్కారం పంచాయతీ పరిదిలోని బోరుబావులకు కరెంట్‌  మోటార్లు పెట్టి గతంలో నీళ్లు అందించి తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకున్నప్పటికీ కరెంట్‌ అధికారులు బోరుబావులకు మోటార్లు తొలగించడంతో ఉన్న మంచినీటి వ్యవస్థ మంటకలిసిందని మహిళలు పేర్కొంటున్నారు. పంచాయతీ కార్యాలయం ముందు బిందెలు పట్టుకోని ఆందోళన చేయగా జిల్లా అధికారులు కలెక్టర్‌ ఆదేశాల మేరకు వచ్చినప్పటికీ ఇదిగో, అదిగో.. అంటూ పరిష్కరిస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారని,  సర్పంచ్‌ రాథోడ్‌ జనార్థన్‌తో పాటు ఎంపీటీసీ సభ్యుడు సాయికృష్ణగౌడ్‌, గ్రామస్తులు లింగాగౌడ్‌, తదితరులు తెలిపారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కలెక్టర్‌ వెంటనే చొరవ తీసుకోవాలని పలువురు మహిళలు, గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-12T06:49:42+05:30 IST