బోరుబావిలో బాలుడు.. రక్షించిన యువకుడు

ABN , First Publish Date - 2022-07-08T02:21:12+05:30 IST

బోరుబావి కబంధ హస్తాలకు చిక్కుకుని ఎందరు చిన్నారులు బలైనా అదే నిర్లక్ష్యం.. వెంటాడుతూనే ఉన్నాయి.

బోరుబావిలో బాలుడు.. రక్షించిన యువకుడు

ద్వారకా తిరుమల: బోరుబావి కబంధ హస్తాలకు చిక్కుకుని ఎందరు చిన్నారులు బలైనా అదే నిర్లక్ష్యం.. వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ బాలుడు బోరుబావికి చిక్కి సురక్షితంగా బయటపడిన అరుదైన ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంటలో జరిగింది. గ్రామానికి చెందిన మనెల్లి జస్వంత్‌ అనే తొమ్మిదేళ్ల బాలుడు బుధవారం రాత్రి ఆడుకుంటూ స్ధానిక కమ్యూనిటీ హాలువైపునకు వెళ్లాడు. అక్కడ వాడుకలో లేని చెత్తచెదారంతో నిండిన బోరుబావి గుంతలో కాలుజారి పడిపోయాడు. 400 అడుగుల లోతున్న బోరుబావిలో 30 అడుగుల వద్ద ఓ రాయికి చిక్కుకుని ఆగిపోయాడు. చిమ్మచీకటిలో దాదాపు ఆరు గంటలపాటు భయాందోళనలతో అరుస్తూ అందులో నరకాన్ని చూశాడు. రాత్రి 8 గంటలు దాటినా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వర్రావు, శ్యామల కంగారుపడుతూ పరిసరప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా కన్పించకపోయేసరికి కమ్యూనిటీ హాలు వైపునకు వెళ్లగా కేకలు వినిపించడంతో స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని బాలుడిని బయటకు తీసేందుకు ఆలోచన చేశారు. ఈక్రమంలో బాలుడి బంధువైన యువకుడు కోడెల్లి సురేష్‌ సాహసం చేసి నడుముకు తాళ్లుకట్టుకుని బోరుబావిలోకి దిగి బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం బోరుబావి గుంతను స్ధానికులు మట్టితో పూడ్చివేశారు.

Updated Date - 2022-07-08T02:21:12+05:30 IST