సరిహద్దు వివాదం

ABN , First Publish Date - 2020-09-11T06:22:17+05:30 IST

ఇండియా-చైనా సరిహద్దు వివాదంపై ఏ ప్రకటన చేసినా చౌ ఎన్‌-లై ఎన్నెన్నో శ్రీరంగనీతులు ఏకరవు పెడుతున్నాడు. కాని, లోకం ఆయన భ్రమిస్తున్నంత గుడ్డిది కాదు...

సరిహద్దు వివాదం

తాత్కాలిక ప్రయోజనాలను సాధించుకోవడం కోసం తాను నమ్మిన న్యాయ సూత్రాలకు, ధర్మ సూత్రాలకు తిలోదకాలను వదిలే దుర్గతిలో భారత ప్రభుత్వం పడలేదు; పడబోదు; అందువల్లనే పంచశీలకు వ్యతిరేకంగా చైనా సంచరిస్తున్నంత మాత్రం చేత పంచశీల సూత్రాలకే స్వస్తి చెప్పవలెనన్న వాదాన్ని అది తిరస్కరిస్తున్నది.


ఇండియా-చైనా సరిహద్దు వివాదంపై ఏ ప్రకటన చేసినా చౌ ఎన్‌-లై ఎన్నెన్నో శ్రీరంగనీతులు ఏకరవు పెడుతున్నాడు. కాని, లోకం ఆయన భ్రమిస్తున్నంత గుడ్డిది కాదు. సరిహద్దు వివాదాన్ని గురించి కొత్తగా చేసిన ప్రకటనలో తగవును చంపుకొనడానికి తామెంతో తాపత్రయపడుతున్నా, దాన్ని సాగదీయడానికే ఇండియా ప్రయత్నిస్తున్నట్టు చైనా ప్రధాని ఆరోపించాడు. రెండు దురుద్దేశాలతో ఇండియా ఈ పని చేస్తున్నదట. మొదటిది- ఈ వివాదాన్ని అవకాశంగా తీసుకుని, దేశంలోని ప్రగతిశీల శక్తులను అణచివేయడం. రెండవది- దీన్ని అవకాశం చేసుకుని విదేశాల నుంచి సహాయం పొందడం. అసలు ఈ వివాదానికి కారకులెవరు? తామే కాదా? ఒకవైపున పంచశీలను వల్లె వేస్తూనే మరొక వైపున భారత భూభాగాలను అన్యాయంగా తాము ఆక్రమించుకొనలేదా? దురాక్రమణ చర్యలను తామే కొనసాగించిన పిమ్మట లడఖ్‌ ప్రాంతంలో తాము ఆక్రమించుకొన్న ప్రాంతాన్ని తమకు విడిచిపెడితే, తక్కిన సరిహద్దు ప్రాంతాల విషయమై పేచీ పెట్టమని చెప్పడమే తమ పరిష్కారేచ్ఛకు నిదర్శనమా? దానికి సమ్మతించకపోవడం తగవును సాగదీయాలనే పట్టుదలకు తార్కాణమా? తమతో వివాదాన్ని పెంచుకొనడం ద్వారా భారత ప్రభుత్వం ఏవో కొన్ని ప్రయోజనాలను సాధించగోరుతున్నదని చైనా ప్రధాని చేసిన ఆరోపణలు ఏవగింపుతో త్రోసివేయదగినట్టివి.


తాత్కాలిక ప్రయోజనాలను సాధించుకోవడం కోసం తాను నమ్మిన న్యాయ సూత్రాలకు, ధర్మ సూత్రాలకు తిలోదకాలను వదిలే దుర్గతిలో భారత ప్రభుత్వం పడలేదు; పడబోదు; అందువల్లనే పంచశీలకు వ్యతిరేకంగా చైనా సంచరిస్తున్నంత మాత్రం చేత పంచశీల సూత్రాలకే స్వస్తి చెప్పవలెనన్న వాదాన్ని అది తిరస్కరిస్తున్నది. చైనా తన పట్ల అన్యాయంగా ప్రవర్తించినంత మాత్రం చేత ఐక్యరాజ్య సమితిలో పెకింగ్‌ ప్రతినిధులకే స్థానమివ్వవలెనన్న తన పూర్వ వైఖరిని మార్చుకొనడానికి అది నిరాకరిస్తున్నది. చైనాపై పగసాధించాలని ఇండియా నడచిన వంకర నడక పేరుకైనా లేకపోగా, ఇండియాపై కక్షతో పెకింగ్‌ ప్రభుత్వం నడుస్తున్నవన్నీ వంకర నడకలే!

(1961 జనవరి 20 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘చౌ శ్రీరంగనీతులు’ నుంచి)

Updated Date - 2020-09-11T06:22:17+05:30 IST