సరి‘హద్దు’ ల్లేవు

ABN , First Publish Date - 2020-07-02T11:40:30+05:30 IST

ఉమ్మడి పాలమూరు నుంచి రేషన్‌ బియ్యం జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా సరిహద్దులు దాటుతోంది

సరి‘హద్దు’ ల్లేవు

బార్డర్‌ దాటుతున్న రేషన్‌ బియ్యం..

జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా అక్రమ రవాణా


గద్వాల, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు నుంచి రేషన్‌ బియ్యం జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా సరిహద్దులు దాటుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు అయిన గద్వాల జిల్లాకు ఒక వైపు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌, మరో వైపు కర్ణాటకకు చెందిన రాయిచూరు ఉన్నాయి. కర్నూల్‌ వైపు పుల్లూరు, రాయిచూరు వైపు గట్టు మండలం బల్గెర, కేటీదొడ్డి మండలం నందిన్నె వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. రాయచూరు వైపు మార్కెటింగ్‌, ఎక్సైజ్‌, పోలీస్‌ విభాగాలు తనిఖీలు నిర్వహిస్తాయి. అయినా ప్రతి రోజూ ట్రాలీలు, ఆటోలు, లారీలలో రేషన్‌ బియ్యం తరలిపోతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9,30,054 రేషన్‌ కార్డులు ఉన్నాయి.


ప్రతి నెల 1.79 లక్షల క్వింటాళ్ల బియ్యం పేదలకు పంపిణీ అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో రెట్టింపుగా దాదాపు 3.59 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఎక్కువ మంది రేషన్‌ బియ్యాన్ని వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. పది శాతం మంది మాత్రమే వండుకుంటున్నారని, మరో పది శాతం మంది ఇతర అవసరాలకు వాడుకుంటారని సమాచారం. మిగిలిన 80 శాతం బియ్యంలో ఎక్కువ శాతం అక్రమంగా రవాణా అవుతున్నట్లు విమర్శలున్నాయి. అందులో లిక్కర్‌ ఫ్యాక్టరీలకు కూడా రేషన్‌ బియ్యం తరలుతున్నట్లు ఆరోపణలున్నాయి.


పది రూపాయలకు కొని..

లబ్ధిదారుల్లో చాలా మంది రేషన్‌ బియ్యం తీసుకోవడం లేదు. వారి నుంచి డీలర్లే కిలోకు రూ.10 చొప్పున కొనుగోలు చేసి, రూ.15 చొప్పున రైస్‌మిల్లర్లకు, అక్రమ రవాణాదారులకు విక్రయిస్తారు. రైస్‌మిల్లర్లు బియ్యాన్ని రీ సైకిలింగ్‌ చేస్తారు. వాటిని లేవీగా రూ.27 చొప్పున ప్రభుత్వానికి ఇస్తారు. కాదంటే ఇతర ప్రాంతాల్లో అవసరమున్న వారికి రూ.18 నుంచి రూ.20 కి అమ్ముతారు. గద్వాలతో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల నుంచి కర్ణాటకలోని రాయచూరు, ఏపీలోని కర్నూల్‌ మీదుగా ఇతర జిల్లాలకు తరలుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి కర్ణాటక ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-07-02T11:40:30+05:30 IST