Abn logo
Sep 21 2021 @ 23:30PM

రైతులకు బొప్పే

తోటల్లోనే మాగిపోతున్న బొప్పాయి కాయలు

పాతాళానికి పడిపోయిన బొప్పాయి ధరలు

సీజన్‌ మొదట్లో రూ.18 వేలు.. ప్రస్తుతం రూ.5500

తోటల్లోనే మాగి రాలిపోతున్న కాయలు


రైల్వేకోడూరు, సెప్టెంబరు 21: సీజన్‌ ప్రారంభంలో టన్ను 18 వేల రూపాయలు పలికాయి. పెట్టిన పెట్టుబడులతో పాటు కష్టాల నుంచి గట్టెక్కవచ్చని అనుకున్న బొప్పాయి రైతుల ఆశలు అడియాసలయ్యాయి. బొప్పాయి కాయల ధరలు ఒక్కసారిగా టన్ను 5500 రూపాయలకు పడిపోయాయి. దీంతో కొనేవారులేక తోటల్లోనే కాయలు మాగిపోయి రాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఢిల్లీ మార్కెట్‌లో డిమాండు ఉన్నా ఇక్కడి దళారులు, వ్యాపారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దళారులు తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బొప్పాయి రైతులు రోడ్ల పైకి వచ్చి ఆందోళనా కార్యక్రమాలు చేశారు. వారిపై అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదని రైతులు బహిరంగంగా చెబుతున్నారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు తదితర మండలాల్లో బొప్పాయి సాగు విపరీతంగా చేస్తున్నారు. కరోనా అని, ఢిల్లీలో డిమాండు లేదని, అక్కడ వర్షాలు కురుస్తున్నాయని, మార్కెట్‌లో ధరలు పడిపోయాయని దళారులు మోసం చేసి ధరలు తగ్గించి వేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్నామ్నాయంగా మార్కెటింగ్‌ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  బొప్పాయి సాగు కష్టాలను తీర్చుతుందని రైతులు అనుకున్న సమయంలో మొదట్లో కొంత మేరకు కుదుటపడినా తర్వాత రైతులు కష్టాలు, నష్టాలు చవిచూశారు. టన్ను రూ.5500 రైతులకు గిట్టుబాటు కాదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటల్లో కాయలు ఉన్న రైతులు కోతలు కోయలేక ఇబ్బందులు పడుతున్నారు. మొహర్రం, వినాయక చవితి పండుగలకు బొప్పాయి కూలీలు తమ తమ ఊర్లకు వెళ్లారని దీంతో కోతలు కోయలేదని వ్యాపారులు అంటున్నారు. ఏది ఏమైనా కాయలు మాగిపోతుండటంతో రైతులకు ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది. ఇప్పటికైనా తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ

బొప్పాయి తోట సాగులో ఖర్చులు ఎక్కువగా వస్తున్నాయి. ఆదాయం తక్కువగా ఉంటోంది. పెద్దగా ఆశించినా ఫలితాలు మిశ్రమంగా మారుతున్నాయి. రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గిట్టుబాటు ధరలు లేవు. దళారులు చెప్పిందే వేదంగా మారింది. ధరలు తగ్గించినా ఎక్కించినా వారే కీలకంగా మారారు. బొప్పాయి తోటల్లో కోతలు చేయకపోవడంతో కాయలు మాగి కిందపడిపోతున్నాయి. రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించాలని వినతులు చేసినా పట్టించుకోవడం లేదు.

- యద్దల రమణ, నేతివారిపల్లె, చిట్వేలి మండలం


గిట్టుబాటు ధరలు కల్పించాలి

బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఆరుగాలం కష్టించినా ఫలితాలు తీసుకునే సమయంలో ధరలు ఉండకపోవడంతో నష్టపోతున్నాము. ఢిల్లీలో డిమాండు ఉన్నా రైల్వేకోడూరు నియోజకవర్గంలో కాయల కోతలు కోయడం లేదు. తోటల్లోనే కాయలు మాగిపోతున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. బొప్పాయి ధరలు రోజురోజుకు పతనం అవుతున్నాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికైనా రైతులకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

- ఎ.నరసింహులు, నేతివారిపల్లె, చిట్వేలి మండలం