ఉద్యోగులను శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందా?: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2022-02-04T21:26:44+05:30 IST

సీఎంవో కార్యాలయ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బలవంతంగా...

ఉద్యోగులను శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందా?: బొప్పరాజు వెంకటేశ్వర్లు

విజయవాడ: సీఎంవో కార్యాలయ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బలవంతంగా ఉద్యోగులను సమ్మెలోకి నేట్టేరని పీఆర్సీ సాధన సమితి నేత, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం స్టీరింగ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల ఛలో విజయవాడను బలప్రదర్శనగా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. మమ్మల్ని కుటుంబం సభ్యులుగా చూడటం లేదా?..  ఉద్యోగులను శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రసంగాలు ఉద్యోగులకు అవసరం లేదన్నారు. సమ్మె చేస్తే ఉద్యోగులకు ఆనందం ఎలా అవుతుందన్నారు. జీతాలు కూడా రావని, తమ బాధలు వినడానికి ఆఖరి అస్త్రంగా మాత్రమే తప్పనిసరై సమ్మెకు వెళ్తున్నామని బొప్పరాజు అన్నారు.


గత అక్టోబర్‌లోనే పీఆర్సీ ఇస్తామన్నారని, చర్చలు జరిగిన ప్రతీ సారీ అవమాన పరుస్తున్నారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 14 సార్లు చర్చలకు పిలిచినా ఏం ఉపయోగం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో బహిరంగ చర్చలకు సిద్ధమా? చెప్పాలన్నారు. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ఆ జీతాలు కూడా మిగుల్చుకోవదానికి ప్రభుత్వ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజలు కూడా ఉద్యోగులకు సహకారం అందించారన్నారు. వారు స్వచ్ఛందగానే ఛలో విజయవాడలో దారిపొడవున నీరు, మజ్జిగ ఇచ్చారన్నారు. ఇప్పటికి చర్చలకు తాము సిద్ధమే.. కానీ ప్రభుత్వం అందరినీ తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రుల కమిటీ ఇదే చేసిందన్నారు. ఐఏఎస్ అధికారుల జీతాలు వేసేది కూడా తమ ఉద్యోగులే అన్న విషయం అధికారులు తెలుసుకోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Updated Date - 2022-02-04T21:26:44+05:30 IST