Kuwait లో బూస్టర్ డోస్ నమోదు ప్రక్రియ ప్రారంభం.. విదేశీ ప్రయాణికుల ఎంట్రీపై కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-10-10T18:47:56+05:30 IST

కువైత్ సర్కార్ తాజాగా బూస్టర్ డోస్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది.

Kuwait లో బూస్టర్ డోస్ నమోదు ప్రక్రియ ప్రారంభం.. విదేశీ ప్రయాణికుల ఎంట్రీపై కీలక ప్రకటన!

కువైత్ సిటీ: కువైత్ సర్కార్ తాజాగా బూస్టర్ డోస్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. కరోనా టీకా రెండు మోతాదులు తీసుకున్నప్పటికీ కొంతమందికి మళ్లీ పాజిటివ్ వస్తుండడంతో బూస్టర్ డోసు ఇవ్వాలన్న వైద్య నిపుణుల సూచన మేరకు అక్కడి సర్కార్ ఈ చర్యలు చేపట్టింది. మొదట 60ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన నమోదు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించారు. కాగా, రెండో డోసు తీసుకున్న వారు ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాలని మంత్రి సూచించారు.


ఇదిలాఉంటే.. విదేశీ ప్రయాణికుల ఎంట్రీపై ఈ సందర్భంగా కువైత్ కీలక ప్రకటన చేసింది. ఫైజర్, ఆక్స్‌ఫర్డ్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్‌లలో ఏదో ఒక టీకాను రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు కువైత్‌కు రావచ్చని వెల్లడించింది. ఇక కువైత్‌లో ఆమోదం పొందని సినోఫార్మ్, సినోవాక్, స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులు మాత్రం అక్కడికి వెళ్లిన తర్వాత వారి వద్ద ఆమోదం పొందిన టీకాను ఒక డోసు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. విదేశీ ప్రయాణికులకు బూస్టర్ డోస్ తప్పనిసరేమి కాదని స్పష్టం చేశారు.   


Updated Date - 2021-10-10T18:47:56+05:30 IST