బూస్టర్‌ డోస్‌ ఉచితంగా వేయండి

ABN , First Publish Date - 2022-05-01T12:37:57+05:30 IST

రెండు విడతల కరోనా నిరోధక టీకాలు వేసుకున్న 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్‌ డోస్‌ టీకాలను ఉచితంగా వేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం

బూస్టర్‌ డోస్‌ ఉచితంగా వేయండి

                  - కేంద్రానికి మంత్రి సుబ్రమణ్యం వినతి


చెన్నై: రెండు విడతల కరోనా నిరోధక టీకాలు వేసుకున్న 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్‌ డోస్‌ టీకాలను ఉచితంగా వేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. స్థానిక సైదాపేటలో కార్పొరేషన్‌ మహోన్నత పాఠశాలలో కంప్యూటర్‌ సెంటర్‌ను శనివారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియా రాజన్‌, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం విలేఖరులతో మాట్లాడుతూ... నాలుగు రోజులకు ముందు 5నుంచి 12 ఏళ్ళ బాలబాలికలు కరోనా నిరోధక టీకాలు వేసే పథకం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందని, అయితే దానికి సంబంధించిన విధివిధానాలను తెలియజేయలేదని చెప్పారు. రాష్ట్రంలో బాలబాలికలకు కరోనా నిరోధక టీకాలు వేసేందుకు అనువైన పాఠశాలల ఎంపిక కూడా పూర్తయ్యిందని, కానీ ఆ టీకాలు వేయడాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న విషయంపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటన జారీ చేసిన వెంటనే బాలబాలికలకు టీకాలు వేసేందుకు ఆరోగ్యశాఖ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రెండు విడతల కరోనా నిరోధక టీకాలు వేసుకున్న 18 ఏళ్లు దాటినవారు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.382 చెల్లించి బూస్టర్‌ డోస్‌ టీకాల వేసుకోవాల్సి రావడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదన్నారు. బూస్టర్‌డోస్‌ టీకాను ఉచితంగా వేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇదివరకే ఈ విషయమై తాను కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాశానని తెలిపారు. మాధవరంలో కొత్త సిద్ధ వైద్యవిశ్వవిద్యాలయం 25 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్నదని, ఆ విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత సిద్ధ వైద్య నర్సులను కూడా నియమించనున్నామని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2022-05-01T12:37:57+05:30 IST