విజృంభిస్తున్న వైరస్‌

ABN , First Publish Date - 2022-01-19T04:31:19+05:30 IST

కరోనా వైరస్‌ మూడో దశ తీవ్రత జిల్లాలో పెరుగుతోంది. రోజూ వందల్లో నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకూ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. పరిస్థితులు ఇంతతీవ్రంగా ఉన్నప్పటికీజాతర్లలో జనం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

విజృంభిస్తున్న వైరస్‌
ఎస్‌.కోట మండలంలోని ఓ గ్రామంలో తీర్థానికి వచ్చిన ప్రజలు

రోజూ వందల్లో కేసులు

 జాతర్లలో జాగ్రత్తలు తీసుకోని జనం

విజయనగరం(ఆంధ్రజ్యోతి)/, శృంగవరపుకోట, జనవరి 18: కరోనా వైరస్‌ మూడో దశ తీవ్రత జిల్లాలో పెరుగుతోంది. రోజూ వందల్లో నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకూ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. పరిస్థితులు ఇంతతీవ్రంగా ఉన్నప్పటికీజాతర్లలో జనం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. గుంపులుగా వస్తున్నారు. మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నారు. మరోవైపు సంక్రాంతి పండగ ముగియడంతో నగరాలు, పట్టణాల నుంచి వచ్చిన వారంతా తిరిగి వెళ్లిపోతున్నారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా నగరాలు, పట్టణాల్లోనే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో జిల్లాకు వచ్చిన వారితో గ్రామీణ ప్రాంత ప్రజలంతా మమేకమయ్యారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇక సంక్రాంతి నుంచి శ్రీరామ నవమి వరకు జిల్లాలోని పల్లెల్లో దేవతల తీర్థాలు జరుగుతాయి. ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు జాతర ఉంటుంది. అమ్మవార్లకు పూజలు పేరుతో మహిళలు ఆలయాలకు సమూహాలుగా వస్తున్నారు. ఆ సమయంలో జాగ్రత్తలు పాటించడం తక్షణ అవసరం. కానీ భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు ధరించడం లేదు. సాయంత్రం తీర్థాలు చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వచ్చే వారు కూడా గుంపులు, గుంపులుగా ఒకేచోటుకు చేరుతున్నారు. అధికార పార్టీ నేతల సిఫారసులతో కోడి పందాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పోలీసుల కళ్లుగప్పి మరీ ఆడుతున్నారు. పోలీసులు కూడా మొక్కుబడిగానే పట్టుకుంటున్నారు. వందల సంఖ్యలో ఒకే చోట గుమిగూడటంతో వీరిలో ఒక్కరికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నా అనేక మందికి వ్యాపించే ప్రమాదం ఉంది. ఎక్కడా ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. అధికార యంత్రాంగం స్పందించి కఠినంగా వ్యవహరించకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

412 కేసులు నమోదు

కరోనా థర్డ్‌వేవ్‌ ప్రభావం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు ఒకేసారి వందల్లోకి చేరుకున్నాయి. ఎక్కడికక్కడే కొత్తవారికి వైరస్‌ ప్రబలుతోంది. ఈ ఏడాది మొదటి వారం నుంచీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం మరింతగా నమోదయ్యాయి. భోగి ముందురోజు 290 కేసులు రాగా.. జనవరి 14న 121, 15వ తేదీన 184, 16న 209, 17న 169 కేసులు నమోదయ్యాయి. 18వ తేదీన ఏకంగా 412 కేసులు వచ్చినట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో జిల్లా ప్రజల్లో కాస్త కలవరం మొదలైంది. ఇదిలా ఉండగా కరోనా నియంత్రణ,  బాధితులకు వైద్యం అందించేందుకు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. జేసీ మహేష్‌కుమార్‌ కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ బెడ్‌లను ఏర్పాటు చేసి అక్కడే కొవిడ్‌ వైద్యం అందేలా చర్యలు  తీసుకుంటామని చెబుతున్నారు. క్వారంటైన్‌ కేంద్రాలు, హోం ఐసోలేషనకు మార్గదర్శకాలు రూపొందించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బెడ్‌కు 2 ఆక్సిజన్‌ సిలిండర్లు కేటాయిస్తున్నట్లు జేసీ మహేష్‌కుమార్‌ చెప్పారు. జిల్లా కేంద్రంలో 104 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కొవిడ్‌ సోకినంత మాత్రాన ఎవరూ భయపడవద్దని, అన్ని విధాలుగా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టినట్లు జేసీ మంగళవారం తెలిపారు.

జిల్లా అంతటా జ్వరాలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లా ప్రజలు వణుకుతున్నారు. ఎక్కడికక్కడే జ్వరాల బాధితులు కనిపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటికొకరు మంచంపట్టారు. జిల్లావ్యాప్తంగా బాధితుల సంఖ్య వేలల్లో ఉంది. ఏ ఆసుపత్రిలో చూసినా వందలాది మంది జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు వంటి మునిసిపల్‌ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో రోజుకు 300 మందికి పైగా ఓపీ చూస్తున్నారు. బాధితుల్లో 90శాతం మంది జ్వరాలతో బాధపడుతున్నవారే కన్పిస్తున్నారు. మండల కేంద్రాల్లోని ఆసుపత్రులూ రోగులతో నిండిపోతున్నాయి. చలి జర్వం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, గొంతు, తలనొప్పి, జలుబుతో బాధపడుతూ ఆసుపత్రులకు వస్తున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. దీంతో డాక్టర్లు సాధారణ మందులు రాస్తున్నారు. వాటితో నయం కాకుంటే రక్త పరీక్షలు, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని చెబుతున్నారు. అకాల వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే జ్వరాలు జిల్లాను కుదిపేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 



Updated Date - 2022-01-19T04:31:19+05:30 IST