విజృంభిస్తున్న జ్వరాలు

ABN , First Publish Date - 2022-08-19T04:39:09+05:30 IST

రైల్వేకోడూరులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైరల్‌ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ విజృంభిస్తున్నాయి.

విజృంభిస్తున్న జ్వరాలు
రైల్వేకోడూరులో ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన జనాలు

వైరల్‌ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ

రోడ్లపైనే చెత్తా చెదారాలు, మురికికూపాలు

పందులు, దోమల స్వైరవిహారం

కిటకిటలాడుతున్న ఆస్పత్రులు


రైల్వేకోడూరు, ఆగస్టు 18: రైల్వేకోడూరులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైరల్‌ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ చూపించినా జ్వరాలు తగ్గకపోవడంతో కొందరు తిరుపతి, చెన్నై వంటి నగరాలకు చికిత్స కోసం వెళుతున్నారు. రైల్వేకోడూరుతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో చెత్తాచెదారాలు, మురికికూపాలు, పందుల స్వైరవిహారం, దోమలు దాడులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే రైల్వేకోడూరు అరుంఽథతివాడలో చందు అనే బాలుడు తీవ్ర జ్వరంతో మృతి చెందిన విషయం తెలిసిందే. పల్లెల్లో రోడ్ల పైనే మురికినీరు ప్రవహిస్తోంది. రైల్వేకోడూరు పంచాయతీ పరిధిలోని పగడాలపల్లె, ధర్మాపురం, రంగనాయకులపేట, చింతంనగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే మురికినీరు పారుతోంది. దీంతో రాత్రి వేళల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నారులు ఎక్కువగా జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఆస్పత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయి. మురికికూపాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌, దోమల నివారణ కోసం ఫాగింగ్‌ చేయడం లేదని, చెత్తాచెదారాలను సక్రమంగా తొలగించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంకమ్మనగర్‌, గాంధీనగర్‌ తదితర వీధుల్లో చెత్తాచెదారాలు పేరుకుని ఉన్నాయి. గాంధీనగర్‌లో మురికినీటితో ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో రంగనాయకులపేట, పగడాలపల్లెల్లో డెంగ్యూ వ్యాధితో ఇద్దరు మృతి చెందారు. పారిశుధ్య చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పెద్ద, పెద్ద మురికి కుంటలను పూడ్చేందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్యానికి ఉన్న నిధులతో చర్యలు తీసుకుని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వాలు చెబుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వారంలో ప్రతి శుక్రవారం డ్రైడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిన్నచిన్న మురికి కుంటలను ఆయా సర్పంచులకు చెప్పి ఆరోగ్య కార్యకర్తలు పూడ్చి వేస్తున్నారు. అయినా పారిశుధ్యలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


తీవ్ర జ్వరంతో బాలుడి మృతి

పంచాయతీ పరిధిలోని అరుంథతివాడకు చెందిన అరిగెల చందు (3) అనే బాలుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తల్లిదండ్రులు అరిగెల శ్రీనివాసులు, చామండిలు తెలిపారు. చందు తల్లిదండ్రుల కథనం మేరకు...చందుకు బుధవారం తీవ్రంగా జ్వరం వచ్చింది.  వెంటనే రైల్వేకోడూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చూపించినా జ్వరం తగ్గలేదు. మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. జ్వరం 107 ఉందని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించాలని ఇక్కడి వైద్యులు సూచించారు. దీంతో హుటాహుటిన రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య కార్యకర్త జమున అరుంథతివాడకు వెళ్లి ఆరా తీశారు. సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. అనంతరం అరుంథతివాడలో రక్త నమూనాలు సేకరించారు. శ్రీనివాసులు, చామండిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాలుడు చందు మృతి చెందడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. 


దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

- క్రిష్ణచైతన్య, ప్రధాన వైద్యులు, ప్రభుత్వ వైద్య విధాన పరిషత్‌, రైల్వేకోడూరు

దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇంటిలో కొబ్బరి చిప్పల్లోంచి దోమలు వస్తాయి. దీంతో జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి చిప్పలు పారవేయాలి. ఇంటిలో కూలర్స్‌ వేసవిలో ఉపయోగించి పక్కన పెట్టి ఉంటారు. దీంతో కూలర్స్‌లో నీరు ఉంటుంది. ఇందులోంచి దోమలు వస్తాయి. ఇంట్లో, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాచిన నీటిని తాగాలి. ప్రతి శుక్రవారం డ్రైడే ఆరోగ్య కార్యకర్తలు పాటిస్తున్నారు. మురికి కుంటలు ఉంటే వెంటనే పూడ్చి వేయాలి. వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలి.



Updated Date - 2022-08-19T04:39:09+05:30 IST