పుస్తకాల్లేకుండా.. పాఠాలెలా?

ABN , First Publish Date - 2022-08-06T05:02:13+05:30 IST

జూన్‌లో తెరుచుకోవాల్సిన బడులు.. జూలైలో తెరుచుకున్నాయి. నెల రోజులు ఆలస్యంగా విద్యా సంవత్సరం ఆరంభమైంది కాబట్టి విద్యార్థులకు సంబంధించి పాఠశాలల్లో సకల సౌకర్యాలు సమకూరుతాయని అందరూ భావించారు.

పుస్తకాల్లేకుండా.. పాఠాలెలా?

బడులు తెరిచి నెలైనా నాన్చుడే

ప్రైవేట్‌ పాఠశాలలకు అందని పుస్తకాలు 

పుస్తకాలు సరఫరాలో విద్యాశాఖ విఫలం

ముందస్తుగా డబ్బు కట్టించుకున్న అధికారులు 

జిల్లాలో 60 వేల మంది విద్యార్థుల ఎదురుచూపు


నరసరావుపేట, ఆగస్టు 5: జూన్‌లో తెరుచుకోవాల్సిన బడులు.. జూలైలో తెరుచుకున్నాయి. నెల రోజులు ఆలస్యంగా విద్యా సంవత్సరం ఆరంభమైంది కాబట్టి విద్యార్థులకు సంబంధించి పాఠశాలల్లో సకల సౌకర్యాలు సమకూరుతాయని అందరూ భావించారు. అయితే మిగిలిన సౌకర్యాలు మాట ఎలా ఉన్నా ఇంకా అనేక పాఠశాలలకు పాఠ్య పుస్తకాలే అందలేదు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా ప్రభుత్వం సరఫరా చేసే పుస్తకాలే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ పుస్తకాలు సరఫరా అందాయా లేదా అనే అంశం గురించి పట్టించుకునే వారే లేరు. పుస్తకాలు లేకుండా పాఠాలు ఎలా బోధించాలో ఉపాధ్యాయులకు అర్థం కాక అయోమయంలో ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరచి నెలరోజులు అవుతుంది. అయితే ఇంతవరకు ప్రైవేట్‌ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందలేదు. పుస్తకాల సరఫరాలో ఈ ఏడాది అమలులోకి వచ్చిన నూతన విధానాన్ని అమలు చేయడంలో విద్యాశాఖ ఘోరంగా విఫలమైంది. జిల్లాలో 60 వేల మంది ప్రైవేట్‌ స్కూల్స్‌ విద్యార్థులకు పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఇంతవరకు పుస్తకాలు అందక వారి చదువులు సాగడంలేదు. పుస్తకాలకు సంబంధించి ముందస్తుగానే విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల నుంచి నగదు వసూలు చేసింది. నగదు వసూళ్లలో చూపిన శ్రద్ధ పుస్తకాలు సరఫరా చేయడంలో అధికారులు చూపడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. పుస్తకాల కోసం విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరుగుతుంటే.. అదుగో ఇదుగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారన్న ఆరోపణలున్నాయి.


అత్యధికంగా అడ్మిషన్లు..

గతానికి భిన్నంగా ఈ ఏడాది జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగిపోయాయి. ఇందుకు పాఠశాలల విలీనం ఒక కారణమని సమాచారం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధికంగా ప్రైవేట్‌ స్కూల్స్‌కు విద్యార్థులు వలస వచ్చారు. దీంతో జిల్లాలోని పలు ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థులతో నిండిపోయాయి. ఏటా ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను ప్రైవేట్‌ దుకాణాల ద్వారా విక్రయించేది. అయితే ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌ పాఠశాలలకు కూడా ప్రభుత్వ పాఠశాలలకు మాదిరిగా విద్యా శాఖ ద్వారా  పుస్తకాలను అందించేలా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం ఒకటి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల  కోసం పాఠశాలల వారీగా విద్యాశాఖ ఇండెంట్‌ తీసుకుంది. అయితే పుస్తకాలను సరఫరా చేయడాన్ని విద్యాశాఖ విస్మరించింది. అటు బహిరంగ మార్కెట్లో పాఠ్య పుస్తకాలు లభించిక ఇటు విద్యాశాఖ సరఫరా చేయకపోవడంతో ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం విద్యార్థుల నుంచి పాఠ్య పుస్తకాలు కోసం నగదు వసూలు చేసింది. ఈ మొత్తాన్ని యాజమాన్యాలు విద్యా శాఖకు చలానా రూపంలో చెల్లించాయి. అయినా నెల రోజుల గడిచినా పుస్తకాలు అందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పుస్తకాలు సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. ప్రైవేట్‌ స్కూల్స్‌కు పుస్తకాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జి డీఈవో వెంకటప్పయ్య ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Updated Date - 2022-08-06T05:02:13+05:30 IST