India-UAE flights: దుబాయ్‌కు బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరల వివరాలివిగో!

ABN , First Publish Date - 2021-07-10T14:45:42+05:30 IST

కొన్ని విమానయాన సంస్థల వెబ్‌సైట్ల ప్రకారం జూలై 15 నుండి వివిధ భారతీయ నగరాల నుండి దుబాయ్‌కు విమాన బుకింగ్‌లు తిరిగి ఓపెన్ అవుతున్నాయి.

India-UAE flights: దుబాయ్‌కు బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరల వివరాలివిగో!

న్యూఢిల్లీ: కొన్ని విమానయాన సంస్థల వెబ్‌సైట్ల ప్రకారం జూలై 15 నుండి వివిధ భారతీయ నగరాల నుండి దుబాయ్‌కు విమాన బుకింగ్‌లు తిరిగి ఓపెన్ అవుతున్నాయి. అయితే, యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) మాత్రం భారత్‌కు తిరిగి ఇన్‌బౌండ్ విమాన సర్వీసులను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ మాత్రం తన వెబ్‌సైట్‌లో జూలై 15 వరకు ఆంక్షలు ఉంటాయని, ఆ తరువాతి రోజు నుంచి యధావిధిగా భారత్‌కు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎయిర్‌లైన్లు భారత్‌లోని వివిధ నగరాల నుంచి దుబాయ్‌కు విమాన టికెట్ల బుకింగ్స్‌ను ప్రారంభించడంతో పాటు వాటి ధరల వివరాలను కూడా వెల్లడించాయి. 


ఎమిరేట్స్ ఎయిర్‌లైన్: జూలై 16, 17 తేదీలకు గాను బిజినెస్, ఫస్ట్‌క్లాస్ టికెట్ల ధరలను వరుసగా 7,500 దిర్హమ్స్(రూ.1,48,900), 8,147 దిర్హమ్స్(రూ.1,65,353)గా ప్రకటించింది. 


విస్తారా ఎయిర్‌లైన్స్: జూలై 15, 16 తేదీల్లో ముంబై-దుబాయ్ విమానాల్లో కొన్ని సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. టికెట్ ధర 895 దిర్హమ్స్(రూ.18,206)గా నిర్ణయించింది. 


ఇండిగో ఎయిర్‌లైన్: జూలై 16వ తేదీకి గాను ముంబై నుంచి దుబాయ్‌కు కనెక్టింగ్ ఫ్లైట్‌కు టికెట్ ధర 850 దిర్హమ్స్(రూ.17,291), డైరెక్ట్ ఫ్లైట్‌కు 1100 దిర్హమ్స్(రూ.22,376)గా ప్రకటించింది. 


స్పైస్‌జెట్: భారత బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ కూడా కోజికోడ్, మంగళూరు నుంచి దుబాయ్‌కు విమాన టికెట్ బుకింగ్స్ ప్రారంభించింది. జూలై 16న కోజికోడ్-దుబాయ్ విమాన టికెట్ ధర 1,960 దిర్హమ్స్(రూ.39,871). అలాగే జూలై 17న మంగళూరు-దుబాయ్ విమాన టికెట్ ధర 2,092 దిర్హమ్స్(రూ.42,556)గా నిర్ణయించింది. 


ఇదిలాఉంటే.. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి భారత్‌కు విమాన రాకపోకలపై యూఏఈ నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధ ఆంక్షల నుంచి యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, సవరించిన కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక అనుమతి ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది.

Updated Date - 2021-07-10T14:45:42+05:30 IST