సాహస ప్రక్రియగా పుస్తక రచన, ముద్రణ

ABN , First Publish Date - 2021-10-18T06:39:53+05:30 IST

ప్రపంచీకరణ నేపథ్యంలో పుస్తక రచన, ముద్రణ అంటేనే సాహసంతో కూడిన ప్రక్రియగా తయారైందని ప్రముఖ రచయిత వీఆర్‌ రాసాని ఆవేదన వ్యక్తం చేశారు.

సాహస ప్రక్రియగా పుస్తక రచన, ముద్రణ
జిల్లేళ్ల బాలాజీ రచించిన పుస్తకాలను ఆవిష్కరిస్తున్న రచయితలు

ప్రముఖ రచయిత వీఆర్‌ రాసాని ఆవేదన


తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 17: ప్రపంచీకరణ నేపథ్యంలో పుస్తక రచన, ముద్రణ అంటేనే సాహసంతో కూడిన ప్రక్రియగా తయారైందని ప్రముఖ రచయిత వీఆర్‌ రాసాని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి సీకాం కళాశాలలో ఆదివారం విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత జిల్లేళ్ల బాలాజీ రచించిన ‘పగడాలు, పారిజాతాలు’ పుస్తకాలను ప్రముఖ రచయిత శిరంశెట్టి కాంతారావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలాజీ ఎంతో సునిశిత పరిశీలనతో కథలను రచించారని కొనియాడారు. ఎస్వీయూ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.సి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బాలాజీ కథల్లో హాస్యం మాటున.. ఆలోచన, ఆవేదనలు అంతర్లీనంగా కనిపిస్తాయన్నారు. తమిళంలో బవాచెల్లదొరై రచించిన కథల సంపుటిని ‘శిథిలం’పేరుతో బాలాజీ చేసిన అనువాద గ్రంథాన్ని గంగవరం శ్రీదేవి ఆవిష్కరించి, ప్రసంగించారు. అనువాదాలు లేకుంటే విశాల దృక్పథం వచ్చేది కాదన్నారు. అనువాదంతోనే ఠాకూర్‌, రాహుల్‌ సాంకృత్యాయన్‌, శరత్‌బాబు పరిచయమయ్యారని తెలిపారు. జీవితంలోని కష్టాలు, వేదనలు బాలాజీ కథల్లో కనిపిస్తాయని యువకవి మునివెంకటాచలపతి పేర్కొన్నారు. అనంతరం బాలాజీని విద్యా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వేడియం భాస్కర్‌, విశ్రాంతాచార్యుడు కృష్ణారెడ్డి సన్మానించారు. బాలాజీ మాట్లాడుతూ.. 1984 నుంచి రచనలు చేస్తున్నానని, కేవలం అనువాద రచయితగా మాత్రమే చూడటం ఆవేదనకు గురిచేస్తోందన్నారు. తెలుగు కవులు, రచయితలు ద్వేషభావం వీడి, కలసిమెలసి ఉంటే గొప్ప సాహిత్యం లభిస్తుందన్నారు. ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు, సాకం నాగరాజ, టి.నరసింహులు, తమటం రామచంద్రారెడ్డి, కంపల్లె రవిచంద్ర, స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక కన్వీనర్‌ శ్రీరాములు, మల్లేశ్వరరావు, శతావధాని ఆముదాల మురళి, కావలి రెడ్డెప్ప, మన్యం నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T06:39:53+05:30 IST