బోనస్‌ బుస్‌!

ABN , First Publish Date - 2022-05-20T07:53:16+05:30 IST

అమూల్‌ బ్రాండ్‌తో గుజరాత్‌ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య పరిధిలోని మూడు మిల్క్‌ యూనియన్లు.... ఏపీలోని వివిధ జిల్లాలను పంచుకుని, పాల సేకరణ చేస్తున్నాయి. దీన్నే ‘జగనన్న

బోనస్‌ బుస్‌!

  • లీటర్‌కు రూ.4 ఇస్తామని మేనిఫెస్టోలో హామీ
  • తర్వాత గుజరాత్‌ డెయిరీ ఇస్తుందని వెల్లడి..
  • అర్ధ రూపాయే విదిలిస్తున్న అమూల్‌
  • అది కూడా.. ఆరు నెలలు పాలు పోస్తేనే
  • రూ. ఐదారు ఇస్తున్న ప్రైవేటు డెయిరీలు  
  • అమూల్‌తో అదనపు లబ్ధి ఒట్టిమాటే
  • ఆ సంస్థ ప్రచారానికి మాత్రం సర్కార్‌ సొమ్ము
  • జిల్లాల వారీగా మిల్క్‌ యూనియన్ల పాల సేకరణ
  • అధికార యంత్రాంగానికి అదనపు బాధ్యతలు
  • ‘జగనన్న పాల వెల్లువ’కు స్పందన కరువు


‘అధికారంలోకి వస్తే లీటరు పాలకు రూ.4 బోనస్‌ ఇస్తాం’ అని జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో... సహకార రంగంలోని డెయిరీలను బాగా అభివృద్ధిలోకి తెచ్చి, పాడి రైతులకు మేలు చేస్తారని అంతా భావించారు. కానీ... ఎవరినో దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని సహకార డెయిరీలకూ ముప్పు తెచ్చేలా.. ‘అమూల్‌’ను రంగంలోకి దించారు. తీరా చూస్తే.. అమూల్‌ సంస్థ అర్ధరూపాయి బోనస్‌ ఇస్తోంది. అది కూడా.. కనీసం ఆరునెలలపాటు క్రమం తప్పకుండా పాలు పోస్తేనే!


‘‘గతంలో పాడి రైతులను మోసం చేసేవాళ్లు. వారి దగ్గరి నుంచి ఎలా డబ్బులు రాబట్టుకోవాలా అని చూసేవాళ్లు. అమూల్‌ను రంగంలోకి దించిన తర్వాత లీటర్‌ పాల మీద అదనంగా రూ.5 నుంచి 10 రూపాయలు ఇస్తున్నాం. అమూల్‌ ఇస్తోంది కాబట్టి... మిగిలిన డెయిరీలన్నీ రైతులకు లీటరుకు రూ.5 నుంచి 10 అదనంగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది!’’


..ఇటీవల ఏలూరు జిల్లా 

గణపవరంలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటలు ఇవి!

పాల సేకరణ ధరలు ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంటారు. ఇది సహజంగా జరిగేదే. 

కానీ... లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌ ఇస్తామని పాడి రైతులను మోసం చేసింది ఎవరు? ఇదీ అసలు ప్రశ్న!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అమూల్‌ బ్రాండ్‌తో గుజరాత్‌ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య పరిధిలోని మూడు మిల్క్‌ యూనియన్లు.... ఏపీలోని వివిధ జిల్లాలను పంచుకుని, పాల సేకరణ చేస్తున్నాయి. దీన్నే ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం తలకెత్తుకుంది. ఈ విధంగా అమూల్‌  సేకరిస్తున్న పాలకు సదరు మిల్క్‌ యూనియన్లు రకరకాలుగా ధర చెల్లిస్తున్నాయి. ప్రైవేటు డెయిరీల కంటే లీటరుకు రూ.5నుంచి రూ.20 వరకు అదనంగా ధర చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. వాస్తవంగా డెయిరీలిచ్చే ధరకు, అమూల్‌ ధరకు పెద్దగా వ్యత్యాసం ఉండటం లేదన్న వాదన వినిపిస్తోంది. అందుకే అమూల్‌ పాల సేకరణ మొదట్లో ఉన్నంతగా ఇప్పుడు లేదని సమాచారం. అమూల్‌కు వచ్చే లాభాలను పాలు పోసే రైతులకే బోన్‌సగా ఇస్తారని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నా.. బోనస్‌ అందరికీ అందడం లేదు. అందే వారికి కూడా లీటరుకు అర్ధరూపాయి దాటడంలేదు. ఆరు నెలలు నిరంతరాయంగా పాలు పోస్తే.. లీటరుకు అర్ధ రూపాయి చొప్పున లెక్క కట్టి బోనస్‌ ఇస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో అమూల్‌ అడుగుపెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఒకటీ, రెండు జిల్లాల్లో మినహా చాలా మంది అక్కచెల్లెమ్మలకు బోనస్‌ అందిన దాఖలా లేదు. అది కూడా లీటరుకు అర్ధ రూపాయే! దీనికి భిన్నంగా ప్రైవేటు రంగంలోని ప్రధానమైన డెయిరీలు ఏటా ఠంఛనుగా బోనస్‌ పంపిణీ చేస్తున్నాయి. 


రూ.4 హుళక్కేనా?

‘‘లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.24 ఉంటే.. లీటరు పాలకు అంత రేటు కూడా రావట్లేదని నా పాద యాత్రలో పాడి రైతులు వాపోయారు. మేం అధికారంలోకి వస్తే లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌ ఇస్తాం’’ అని అధికారంలోకి రాకముందు జగన్‌ ప్రకటించారు. కానీ మూడేళ్లలో ఏ అక్కచెల్లెమ్మకూ రూపాయి కూడా అదనంగా దక్కలేదు. సంవత్సరంలో ఆరు నెలలు పాలు పోసిన పాడి రైతులకు ఏడాది చివరిలో ప్రతి లీటర్‌కు 50 పైసలు ’అమూల్‌’ బోన్‌సగా ఇస్తుందని ముఖ్యమంత్రి  చెప్పారు. కానీ... ప్రైవేటు డెయిరీలు లీటర్‌కు రూ.ఐదారు దాకా బోనస్‌ ఇస్తున్నాయి. అమూల్‌ సీఎం సొంత జిల్లాలో మినహా మిగతా ప్రాంతాల్లో బోనస్‌ ఇచ్చిన సమాచారం లేదు. వైసీపీ చెప్పిన నవరత్నాల్లో పాల రైతులకు బోనస్‌ అమలుకు నోచుకోలేదు. ‘జగనన్న పాల వెల్లువ’ పేరిట అమూల్‌ కోసం రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్నా... పాలు పోసిన రైతులకు మాత్రం నేరుగా పైసా కూడా బోనస్‌ ఇవ్వలేకపోతున్నారు.


అదనపు సేవలు ఏవీ..

సంగం డెయిరీతో పాటు పలు డెయిరీలు పాడి రైతులకు చెందిన పశువులకు పశువుల దాణా, ఖనిజ మిశ్రమం, సైలేజ్‌ వంటి పశుగ్రాసాలతో పాటు ఉచిత మందులు, వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను అమూల్‌ గుజరాత్‌లో అమలు చేస్తోంది. ఏపీలో మాత్రం అమలు చేయడం లేదు.  చేయూత పథకం కింద అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన సొమ్ముతో పాడి గేదెలు కొని, అమూల్‌కు పాలు పోస్తారని జగన్‌ సర్కార్‌ తలపోసింది. కానీ ఆచరణలో పాడి పశువుల కొనుగోలు అతి తక్కువగానే ఉందన్నది వాస్తవం. అందుకే అమూల్‌ ఆశించిన పాలు సేకరించలేకపోతోంది. అమూల్‌ ప్రాజెక్ట్‌ కోసం దాదాపు రూ.4వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలే అనేక సార్లు చెప్పారు. రూ.979కోట్లతో బీఎంసీయూలు, మరో రూ.1,600కోట్లతో 12,883 ఏఎంసీయూలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. చాలా చోట్ల వాటిని ఏర్పాటు చేయలేదు.  2022సెప్టెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 17,629గ్రామాల నుంచి పూర్తిగా పాల సేకరణ చేసేలా ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 9,899 మహిళా ఉత్పత్తి సహకార సంఘాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. చేయూత పథకం కింద గేదెలకు రుణాలు తీసుకున్న మహిళలు పాడి పశువుల పెంపకంపై ఆసక్తి చూపక పూర్తి స్థాయిలో అమలు కాలేదని సమాచారం. 


జిల్లాల్లో ఇదీ పరిస్థితి

  • ఉమ్మడి చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాలకు అమూల్‌ విస్తరించింది. ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోకి ఇంకా రాలేదు. 
  • శ్రీకాకుళం జిల్లాలో రోజుకు 35వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఎక్కువగా విశాఖ డెయిరీకే వెళ్తుంటాయి. 10శాతం వెన్న ఉంటే ఆవుపాలకు రూ.35, గేదె పాలకు రూ.75 ధర ఇస్తున్నారు. 
  • విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో పాడి రైతులంతా విశాఖ, హెరిటేజ్‌ డెయిరీలకే పాలు పోస్తున్నారు. 
  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ పాలు విశాఖ, హెరిటేజ్‌, ఇతర డెయిరీలకు వెళ్తున్నాయి. 
  • కృష్ణా జిల్లాలో అమూల్‌ సంస్థ పాల బిల్లులు చెల్లిస్తున్నా.. బోనస్‌ ఊసెత్తడం లేదు. బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయలేదు.
  • ప్రకాశం జిల్లాలో రోజుకు 22వేల లీటర్లకు మించి అమూల్‌కు పాలు రాలేదు. వేసవిలో 10వేల లీటర్లు కూడా రాని పరిస్థితి! ఆర్బీకేల్లో అమూల్‌ తరఫున పాల సేకరణ జరుగుతోంది. సకాలంలో సొమ్ము చెల్లించడం లేదని చెప్తున్నారు. 
  • బాపట్ల జిల్లాలో రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంటే.. అమూల్‌కు కేవలం 1,700లీటర్ల పాలే వెళ్తున్నాయి. 
  • అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో 300 గ్రామాలను అమూల్‌ పాల సేకరణకు గుర్తించగా, 215గ్రామాల్లో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. రూ.2కోట్లు వెచ్చించి, 85గ్రామాల్లో ఏఎంసీయూలు ఏర్పాటు చేసినా.. 60గ్రామాల నుంచి రోజుకు 7వేల లీటర్ల పాలే సేకరిస్తోంది. అమూల్‌ ఇచ్చే ధర తక్కువని రైతులు చెబుతున్నారు.


రాష్ట్రంలో ప్రైవేటు డెయిరీలు అనేకం ఉన్నాయి. వాటి సంగతి పక్కనపెడితే విజయ, విశాఖ వంటి పేరెన్నికగన్న డెయిరీలు సహకార రంగంలో విజయవంతంగా నడుస్తున్నాయి. వీటన్నింటినీ కాదని... జగన్‌ సర్కారు గుజరాత్‌కు చెందిన ‘అమూల్‌’ను నెతికెత్తుకుంది. ప్రభుత్వ ఆస్తులను ధారాధత్తం చేసింది. ‘అమూల్‌’ సేవలోకి అధికార యంత్రాంగాన్ని దించింది. ‘అమూల్‌’కే పాలు పోయాలని పాడి రైతులను బలవంతపెట్టింది. లీటరుకు రూ.4 బోనస్‌ లభిస్తుందని ఊరించింది. చివరికి... బోనస్‌ తుస్స్‌మంటోంది. పాడిరైతుల ఆదరణ లభించక ‘అమూల్‌’ మూలన పడుతోంది. జాతీయ స్థాయిలో పేరుపొందిన అమూల్‌ సంస్థకు రాష్ట్రంలో భంగపాటు ఎదురవుతోంది. 




అమూల్‌ సేవలో యంత్రాంగం

అమూల్‌కు మాత్రమే పాలు పోసేలా చూడాలంటూ జిల్లా అధికార యంత్రాంగానికి జగన్‌ సర్కారు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ డెయిరీ ఫెడరేషన్‌ అధికారులతో పాటు పశుసంవర్ధక, సహకార, పంచాయతీరాజ్‌ వంటి పలు శాఖల పరిధిలోని అనేక విభాగాల సిబ్బందిని రంగంలోకి దించింది. గ్రామీణ పశు వైద్యాధికారులు ఈ అదనపు బాధ్యతలతో సతమతమౌతున్నారు.

Updated Date - 2022-05-20T07:53:16+05:30 IST