అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని వారెవరు ఉండరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భిన్న రకాల చిత్రాల్లో ఆమె నటించింది. బీ టౌన్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన బోనీ కపూర్‌ను ఆమె పెళ్లాడింది. ఈ దంపతులకు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2018లో శ్రీదేవి అకాల మరణం చెందింది. తన కూతురు జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రాన్ని కూడా ఆమె చూడలేక పోయింది. అతిలోక సుందరి లేని లోటును ఆమె కూతురు జాన్వీ కపూర్ కొంత వరకు పూడుస్తోంది.
తాజాగా బోనీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అతిలోక సుందరితో 34 ఏళ్ల క్రితం తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలోని నటరాజ్ స్టూడియోలో 1984లో ఈ ఫొటో తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. శ్రీదేవితో తీసుకున్న మొదటి ఫొటో ఇదేనని ఆయన పేర్కొన్నారు.
బోనీ కపూర్ టాలీవుడ్‌తో సహా బాలీవుడ్లో అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా కోలీవుడ్లోకి కూడా నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. అజిత్ హీరోగా నటించిన ‘‘ నెర్కొండ పారవై ’’ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ‘‘వాలిమై’’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుందని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.