కలిసిన బంధాలు

ABN , First Publish Date - 2021-03-05T06:45:47+05:30 IST

పదిహేనేళ్ల క్రితం వెళ్లిపోయాడు. ఎక్కడికిపోయాడో తెలియదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆచూకీ దొరకలేదు.

కలిసిన బంధాలు
నెరణికి మల్లప్ప కుటుంబాన్ని సన్మానిస్తున్న కర్ణాటక వాసులు

  1. 15 ఏళ్ల తర్వాత కుటుంబంతో కలయిక 
  2. ఊరికి వచ్చిన మల్లప్ప.. బంధువుల్లో ఆనందం


హొళగుంద, మార్చి 4: పదిహేనేళ్ల క్రితం వెళ్లిపోయాడు. ఎక్కడికిపోయాడో తెలియదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆచూకీ దొరకలేదు. మతి స్థిమితింలేని మనిషి ఎక్కడెక్కడ తిరిగాడో. చివరికి గురువారం ఊరికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి పేరు నెరణికి మల్లప్ప. హొళగుంద మండలం హొన్నూర్‌ క్యాం్‌పలో ఈ ఘటన జరిగింది. 


55 ఏళ్ల నెరణికి మల్లప్ప మానసిక స్థితి సరిగా లేదు. ఈయనకు గాదెమ్మతో 35 ఏళ్ల కింద వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. ఈ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. మల్లప్పకు మతిస్థిమితం సరిగా లేక 2005లో కుటుంబ సభ్యులను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు.


ఆయన కోసం కుటుంబ సభ్యులు, బంధువులు అనేక ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆయన ఆచూకీ దొరకలేదు. దీంతో ఆశ వదులుకున్నారు. నెరణికి మల్లప్ప కర్ణాటకలోని గజేంద్రగడ తాలుకా కాళకాళేశ్వర గ్రామంలోని ఓ దేవాలయం వద్ద స్థానికులతో ఉండేవాడు. వారితో కలిసి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. మల్లప్ప సోదరుడు చిదానంద బతుకుతెరువు కోసం కంప్లికి వెళ్లాడు. అక్కడ వైద్యుడు చంద్రశేఖ ర్‌తో పరిచయ మైంది. తన సోదరుడు మల్లప్ప పదిహేనేళ్లుగా కనిపించడం లేదని చెప్పాడు. వైద్యుడు ఇటీవల కాళకాళేశ్వర గ్రామానికి వైద్యం చేసేందుకు వెళ్లినప్పుడు స్థానికులు మల్లప్ప గురించి చెప్పారు. ఆయన వెంటనే చిదానందకు వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్‌ చేసి ఈ సమాచారం ఇచ్చాడు. అట్లా మల్లప్ప గురించిన సమాచారం కుటుంబసభ్యులకు తెలిసింది. గత వారం కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి మల్లప్పను స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కాళకాళేశ్వర గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.  15 ఏళ్ల తర్వాత సొంతగూటికి చేరిన మల్లప్పను చూసి కుటుంబ సభ్యులు ఆనందించారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న నెరణికి మల్లప్పకు కూలీ పనిచేస్తే తప్ప కడుపు నిండని కుటుంబ సభ్యులు వైద్యం అందించలేని స్థితిలో ఉన్నారని, దాతలు ఆర్థికంగా ఆదుకో వాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2021-03-05T06:45:47+05:30 IST