Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ పాలనలో మద్యం ఏరులై పారుతోంది: బోండా ఉమ

విజయవాడ: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆనాడు జగన్ గొంతు చించుకున్నారని, సొంత మీడియాలో టీడీపీపై అక్కసు వెళ్లగక్కారని టీడీపీ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దశల వారీగా మద్యం రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, రెండున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. బ్రాండ్‌లను మార్చి మరీ.. ప్రధాన  ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. జె బ్రాండ్‌లు తెచ్చి డమ్మీ బ్రాండ్‌లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడైనా ఎవరైనా ఈ బ్రాండ్‌లు చూశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో అయినా వైసీపీ నేతల కనుసన్నల్లో మద్యం రవాణా అవుతుందన్నారు. నిబంధనలు పాటించకుండా... నాసి రకం మద్యం తయారు చేయించి అమ్ముతున్నారని, పాతికేళ్లకు  చనిపోయే వాళ్లు... పదేళ్ల ముందే చనిపోతున్నారని, ఈ పిచ్చి మందు వల్ల రెండేళ్లల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మరణాలను కరోనా మరణాల లెక్కల్లో వేసి... ప్రభుత్వం తప్పించుకుందన్నారు.


ఇరవై రూపాయల మందును రెండు వందలకు అమ్ముతున్నారని, ప్రభుత్వానికి దమ్ముంటే వాటి ఇన్ వాయిస్ వివరాలను బహిర్గతం చేయాలని బోండా ఉమ సవాల్ చేశారు. ఈ మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఎంత, వైసీపీ నేతల జేబుల్లోకి ఎంత వెళుతుందో ఆ లెక్కలు తమ దగ్గర ఉన్నాయన్నారు. కాయ కష్టం చేసి... జె బ్రాండ్ పిచ్చి మందు తాగితే... తెల్లారేసరికి ఆస్పత్రి పాలవుతున్నారన్నారు. దశల వారీ మద్య నిషేధం అంటే ఈ పిచ్చి మందులు అమ్మడమా? అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో మద్య నిషేధం ఎక్కడో సీఎం జగన్ చెప్పాలన్నారు.


దేశంలో ఎక్కడా లేని అక్రమ విధానాలు ఏపీలో చూస్తున్నామని బోండా ఉమ అన్నారు. మద్యపాన నిషేధంపై వైసీపీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగా జగనన్న మద్యం  డోర్ డెలివరీ పధకాన్ని అమలు చేయబోతున్నారని, రాష్ట్రంలో మహిళలు జగన్ మాటలు నమ్మి ఓట్లేస్తే.. మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం మాటలు నమ్మి రుణాలు ఇస్తే బ్యాంకులు కూడా బుక్ అయిపోతాయన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement