బ్లాక్‌లో బాండ్‌పేపర్స్‌

ABN , First Publish Date - 2021-07-30T04:36:34+05:30 IST

రిజిస్ర్టేషన్ల శాఖ ఆదాయానికి కొందరు గండి కొడుతున్నారు.

బ్లాక్‌లో బాండ్‌పేపర్స్‌
షాద్‌నగర్‌ సబ్‌రిజిస్ర్టేషన్‌ కార్యాలయం

  • కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయాలు 
  • ప్రభుత్వం నుంచి సరఫరా లేదంటున్న రిజిస్ర్టేషన్‌ శాఖ 
  • భారీగా పడిపోయిన రిజిస్ర్టేషన్ల ఆదాయం 

రిజిస్ర్టేషన్ల శాఖ ఆదాయానికి కొందరు గండి కొడుతున్నారు. కార్యాలయంలో బాండ్‌పేపర్లు లేవని సిబ్బంది చెప్పడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు బయటివ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. వారూ బాండ్‌పేపర్ల కొరత ఉందంటూ అదనంగా డబ్బులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. దీంతో రోజువారీగా జరిగే రిజిస్ర్టేషన్లపై ప్రభావం పడుతోంది.



షాద్‌నగర్‌ : ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించే కీలకమైన శాఖల్లో స్టాప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయం ఒకటి. కానీ, ఇక్కడ తమ స్వలాభం కోసం భారీగా జరగాల్సిన రిజిస్ర్టేషన్లను పాతా ళానికి తొక్కేస్తున్నారు. స్టాంప్‌ పేపర్ల కృత్రిమ కొరత సృష్టిస్తూ కొనుగోలు దారులపై అదనపు భారాన్ని మోపుతున్నారు. ఈ తంతు షాద్‌నగర్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయం సాక్షిగా జరుగుతుంది. రిజిస్ర్టార్లు, సబ్‌ రిజిస్ర్టార్లు కూడా ఈ విషయంపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండటంతో బయట వ్యక్తులు స్టాంప్‌ పేపర్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 


కృతిమ కొరత 

సాధారణంగా రిజిస్ర్టేషన్లకు సంబంధించిన బాండ్‌ పేపర్లను సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలోనే విక్రయించాలి. స్టాంప్‌ పేపర్లు ప్రభుత్వం నుంచి సరఫరా లేదని రిజిస్ర్టేషన్‌ కార్యాలయ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో రిజిస్ర్టేషన్ల కోసం వచ్చినవారు బయటి వ్యక్తులు అమ్మే బాండ్‌ పేపర్లను విక్రయిస్తున్నారు. వీరు కూడా తమ వద్ద స్టాంప్‌పేపర్లు ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ రూ.100 బాండ్‌పేపర్‌ను రూ.150 నుంచి  రూ.200 వరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో రూ.20, రూ.30, రూ.50 స్టాంప్‌పేపర్లు ఉండేవి. కానీ ఇటీవల కాలంలో రిజిస్ర్టేషన్లకు సంబంధించి రూ.100 బాండ్‌పేపర్‌నే వినియోగించాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదే క్రయ, విక్రయదారులకు నష్టం అనుకుంటే ఉన్న బాండ్‌పేపర్ల మీద రూ. 50 నుంచి రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తూ పెద్దఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. 


ఆదాయానికి గండి 

ఇదిలాఉంటే, బాండ్‌పేపర్ల కృత్రిమ కొరత సృష్టించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇంతకుముందు షాద్‌నగర్‌ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో రోజుకు 100 నుంచి 150 వరకు రిజిస్ర్టేషన్లు జరిగేవి. కానీ బాండ్‌పేపర్ల కొరత కారణంగా రోజుకు 15 నుంచి 20 లోపే రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయని సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. స్టాంప్‌పేపర్ల కొరత వల్ల రిజిస్ర్టేషన్ల శాఖ రోజుకు లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది. మరోవైపు ప్లాట్లు, భూములు, ఇళ్ల క్రయ, విక్రయదారులు సమయానుకూలంగా రిజిస్ర్టేషన్లు  చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి స్టాంప్‌ పేపర్లు అందుబాటులో లేక కొందరు తమ పనులన్నింటినీ మానుకుని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఇప్పటికే పెరిగిన భూముల ధరలు, రిజిస్ర్టేషన్‌ ఫీజు భారంగా మారిందనుకుంటే స్టాంప్‌పేపర్లను అధిక ధరలకు విక్రమించి మరింత దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. 


సరఫరా చేయని ప్రభుత్వం

స్టాంప్‌ పేపర్లను రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేయడం లేదని సబ్‌రిజిస్ర్టేషన్‌ కార్యాలయ సిబ్బంది, లైసెన్స్‌డ్‌ స్టాంప్‌వెండర్‌ యజమానులు చెబుతున్నారు. కరోనా కారణంగానే స్టాంప్‌పేపర్ల ముద్రణ జరగడం లేదని సమాధానం ఇస్తున్నారు. 


కావాలనే కృత్రిమ కొరత 

స్టాంప్‌ పేపర్ల కొరత లేదు. సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం వారే కావాలనే కృతిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వం ముద్రించకుంటే ప్రయివేటు వ్యక్తులు ఎలా విక్రయిస్తున్నారు. కేవలం డబ్బులు దండుకోవడానికే బాండ్‌ పేపర్ల కొరతను సృష్టిస్తున్నారు. అధికారుల అండతోనే ఇలా జరుగుతుంది. దీనిపై ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించాలి.

- డంగు శ్రీనివాస్‌ యాదవ్‌ 


బాండ్‌పేపర్ల కొరత వాస్తవమే..

బాండ్‌పేపర్ల కొరత ఉన్నది వాస్తవమే. వాటి కోసం ఇప్పటికే జిల్లా రిజిస్ర్టార్‌కు ఇండెంట్‌ పంపించాం. బాండ్‌ పేపర్ల కొరత ఉన్నందున క్రయ, విక్రయదారులు స్పెషల్‌ అడిసివ్‌ కింద ఇతర పేపర్లపై రిజిస్ర్టేషన్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించాం. ఇది కూడా నాన్‌ జ్యుడిషియల్‌ కిందకే వస్తుంది. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలకు ఉపక్రమించాం.  

 - సతీష్‌, సబ్‌రిజిస్ర్టార్‌, షాద్‌నగర్‌ 



Updated Date - 2021-07-30T04:36:34+05:30 IST