Abn logo
Jun 23 2021 @ 00:29AM

మత్తడి పోచమ్మకు ఘనంగా బోనాలు

లింగంపేట, జూన్‌ 22: వందల సంత్సరాల చరిత్ర కలిగిన కోరిన కోరికలు తీర్చే  మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మకు మంగళవారం గ్రామస్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రతీయేటా వర్షాకాలం ప్రారంభంలో ప్రత్యేక పూజలు చేసి, బోనాలు సమర్పించి అమ్మవారికి నైవేద్యాలు ఇవ్వడం ఆచారం అందులో బాగంగా అమ్మవారికి అన్ని కులాలకు చెందిన మహిళలు ఇంటికో బోనంతో పెద్దసంఖ్యలో అమ్మవారి వద్దకు శోభాయాత్రగా తరలివెళ్ళి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో కరోనా వ్యాది రాకుండా రక్షించాలని, మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో గ్రామం సస్యశామలంగా ఉండాలని వేడుకున్నారు. 

ఎల్లారెడ్డి: మండలంలోని అడవిలింగాల గ్రామంలో మంగళవారం గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలు తీశారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురువాలని, పంట లు బాగా పండాలని, కరోనా ఈ సంవత్సరం అయినా దూరం కావాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ సువర్ణరెడ్డి, యంపీటీసీ బత్తుల పార్వతి, శివగౌడ్‌, గ్రామస్తులు పోలీసు అంజయ్య, నారాయణ, మాజీ సర్పంచ్‌ కుటుంబసభ్యులు, దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

నస్రుల్లాబాద్‌: మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చెర మైసమ్మ ఆలయంలో మంగళవారం పలువురు గ్రామస్థులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ఆలయంలో నైవేద్యాలను సమర్పించి, ఆలయ ఆవరణలో సహ పంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే దేవత కొచ్చెర మైసమ్మ అన్నారు.