కొత్తకుండల బోనం..నెత్తికెత్తిన నగరం

ABN , First Publish Date - 2022-07-25T16:32:02+05:30 IST

ఆషాఢ మాసం.. ఆదివారం.. నగరం శివాలెత్తింది. ఆలయాలు బోనాలతో కళకళలాడాయి. నగరంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లకు సాకపెట్టి మొక్కులు తీర్చుకున్నారు...

కొత్తకుండల బోనం..నెత్తికెత్తిన నగరం

అంగరంగ వైభవంగా సింహవాహిని బోనాల సంబురం

పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు

జనసంద్రంగా మారిన ఆలయ పరిసరాలు

నగరంలో ఆధ్యాత్మిక శోభ 


హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: ఆషాఢ మాసం.. ఆదివారం.. నగరం శివాలెత్తింది.  ఆలయాలు బోనాలతో కళకళలాడాయి. నగరంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లకు సాకపెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పాతబస్తీలో ఆషాడ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు  అమ్మవారి ఆలయాల్లో బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో నగరం భక్తిమయమైంది. ముఖ్యంగా పాతనగరంలోని చారిత్రక లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం లో, చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయంలో బోనాల వేడుకలు కనులపండువగా జరిగాయి. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే జానపద గీతాలు మార్మోగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో

హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఆవుల భరత్‌ప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజలలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ,  .ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు  అమ్మవారికి పూజలు నిర్వహించారు. 


పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి, హరిబౌలి అక్కన్నమాదన్న మహంకాళి ఆలయం, చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం, గౌలిపురా కోటమైసమ్మ, ఉప్పుగూడ, సుల్తాన్‌షాహి జగదాంబిక ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, మహమూద్‌ అలీలు పట్టువస్ర్తాలు సమర్పించారు. అంతకుముందు మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు సింహవాహిని మహంకాళి అమ్మవారికి మహాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి మొదటిబోనం సమర్పించారు. శాసన సభ్యులు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, దానం నాగేందర్‌ తదితరులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.  మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, మాజీ ఎంపీ విజయశాంతి, బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. లాల్‌దర్వాజ  ఆలయం వద్ద వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బంగారు బోనం ఎత్తుకున్నారు. ఆలయం లోపలికి వెళ్లిన ఆమె అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్లిపోయారు. అక్కన్నమాదన్న మహంకాళి ఆలయంలో టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. 


జనసందోహంగా రహదారులు

ఉదయం 7గంటల నుంచే లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయం రహదారులన్నీ జనసందోహంగా మారాయి. బోనం సమర్పించే వారికోసం బారికేడ్లతో క్యూ ఏర్పాటు చేశారు. స్వాగత వేదిక ద్వారా దేవాలయ ఫోర్‌మన్‌ కమిటీ ప్రతినిధులు ప్రముఖులకు స్వాగతం పలుకుతూ అమ్మవారి ఆలయ విశష్టతను తెలిపారు.


పోతరాజులపై దాడి

ఛత్రినాక చౌరస్తాలోని పోతలింగన్న దేవాలయం పోతరాజులపై కొందరు యువకులు దాడి చేశారు. ఊరేగింపుగా వెళ్తున్న క్రమంలో పోతరాజు తిప్పుతున్న చెర్నాకోల స్థానిక యువకులకు తగలింది. దీంతో పోతరాజులకు, యువకులకు వాగ్వాదం జరిగింది. అనంతరం ఊరేగింపు ముందుకు వెళ్లింది. అమ్మవారిని దర్శించుకుని తిరిగివస్తున్న పోతరాజులు బాబా బార్‌ వద్దకు రాగానే అప్పటికే వేచి ఉన్న యువకులు పోతరాజులపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో పోతరాజుతోపాటు ఎనిమిది మందికి గాయాలయ్యాయి.


వర్షాలు శాంతించాయి 

పాతబస్తీ బోనాలు ఎంతో ప్రసిద్ధి. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి. ప్రస్తుతం అమ్మవారి దయ వల్లనే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. త్వరలోనే లాల్‌దర్వాజ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం

- ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి

ప్రపంచానికి పండగ విశిష్టత 

తెలంగాణలో దేవాలయాల అభివృద్ధికి, పండగలు ఘనంగా నిర్వహించడానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారు. బోనాల జాతర కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించింది. బోనాల పండగ విశిష్టతను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడం సంతోషంగా ఉంది.  

- తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, సినీఫొటోగ్రఫీ శాఖ మంత్రి


సుఖసంతోషాలతో వర్ధిల్లాలి..

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ. పాతబస్తీ బోనాల పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లేలా చూడమని అమ్మవారిని కోరుకున్నా.

- వైఎస్‌ షర్మిల

నిఘా నడుమ ప్రశాంతంగా బోనాలు

పాతబస్తీ బోనాలు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. పాతనగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉత్సవాల నేపథ్యంలో స్థానిక పోలీసులు బందోబస్తు చేపట్టగా.. లాల్‌దర్వాజ, మీరాలంమండి బోనాలకు స్థానిక పోలీసులతో పాటు అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. శాలిబండ, మొగల్‌పురా, చార్మినార్‌, హుస్సేనిఆలం, ఛత్రినాక, బహదూర్‌పురా పోలీ్‌సస్టేషన్‌ల పరిధిలో అడుగడుగునా పోలీసులు నిఘా పెట్టారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలతో పాటు అదనంగా కెమెరాలు అమర్చి పరిస్థితిని సమీక్షించారు. సోమవారం అమ్మవారి ఊరేగింపు జరగనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.


బందోబస్తు పర్యవేక్షణ

బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బందోబస్తును అడిషనల్‌ సీపీ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ పర్యవేక్షించారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, అడిషనల్‌ డీసీపీ ఆనంద్‌లు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ బందోబస్తును పరిశీలించారు. 

Updated Date - 2022-07-25T16:32:02+05:30 IST