తెలంగాణ సంస్కృతికి ప్రతీక-బోనాల ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-07-03T00:02:03+05:30 IST

బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలకు, సాంస్కృతిక సంబరాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక-బోనాల ఉత్సవాలు

హైదరాబాద్: బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలకు, సాంస్కృతిక సంబరాలకు  ప్రతీకగా నిలుస్తున్నాయి.తెలంగాణ ప్రాంతంలో జరిగే  ఉత్సవాలు, పండుగలు, వేడుకలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రాంతానికి  ప్రతీకగా నిలిచిన బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది.తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఆరంభం అయ్యాయంటే  విదేశీ, దేశీ యాత్రికులకు సందడే సందడి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల  ఉత్సవాలు  దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్ 30న గోల్కొండ జగదాంబికా ఆలయంలో బోనాలను ప్రభుత్వం ఘనంగా ప్రారంభించింది.ఉత్సవాలకు సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఒక  ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు  దిశా నిర్దేశనం చేశారు. 


బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు ఇప్పుడు విశ్వవ్యాప్తం అయ్యాయి. బోనాల ఉత్సవాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జులై 17 న సికింద్రాబాద్, 24 న హైదరాబాద్ బోనాలు జరుగుతాయి. బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారితో పాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని అధికారులు అన్నారు. బోనాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 


అదేవిధంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గోల్కొండ వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేశారు. 800 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మఫ్టీ పోలీసులు, షీ టీమ్ లను కూడా నియమిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం 8 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, 14 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నట్లు చెప్పారు.భక్తుల దాహార్తి తీర్చేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకేట్స్, 55 వేల వాటర్ బాటిల్స్ ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా 4 అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయని, 5 మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 



రోడ్ల మరమ్మతులు ఉంటే గుర్తించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రత్యేకంగా RTC బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణ అంటేనే  పండుగలకు, పబ్బాలకు, బోనాల ఉత్సవాలు, వినాయక చతుర్థి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ సంబరాలు,దసరా సంబరాలు, దీపావళి నవరాత్రి వేడుకలు తెలుగు ప్రజలకు గుర్తుకు వస్తాయి. గతంలో ఈ ఉత్సవాలు నామమాత్రంగానే జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో, తెలంగాణ కీర్తి ప్రతిష్టలు , తెలంగాణ ఆత్మ గౌరవం ప్రపంచానికి తెలియాలని ఒక సత్ సంకల్పంతో , బోనాలు, ఇతర వేడుకలను ఘనంగా  నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.


Updated Date - 2022-07-03T00:02:03+05:30 IST