గోల్కొండ కోటకు బోనాల శోభ

ABN , First Publish Date - 2022-06-27T17:57:46+05:30 IST

గోల్కొండ కోటలో ఆషాఢమాసం బోనాల శోభ సంతరించుకుంది. జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి ఈనెల 30న బోనాల ఉత్సవాలు

గోల్కొండ కోటకు బోనాల శోభ

చురుకుగా ఏర్పాట్లు 

సీసీ టీవీ కెమెరాలు, బారికేడ్లు, వేదికల ఏర్పాటు


హైదరాబాద్/లంగర్‌హౌజ్‌:  గోల్కొండ కోటలో ఆషాఢమాసం బోనాల శోభ సంతరించుకుంది. జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి ఈనెల 30న బోనాల ఉత్సవాలు ప్రారంభమై జూలై 28వ తేదీ వరకు సాగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేపట్టింది. అమ్మవారిని దర్శించుకొనేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు కలుగకుండా  ఆయా ప్రభుత్వ శాఖలు పనులను ప్రారంభించాయి. పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేస్తున్నామని గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అలాగే, గోల్కొండ ప్రధాన ద్వారం బాలహిస్సార్‌తో పాటు నగీనాబాగ్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కోసం వేదికలు ఏర్పాటు చేసే పనుల్లో ఆర్‌ అండ్‌బీ అధికారులు నిమగ్నం అయ్యారు. నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు జలమండలి ఆధ్వర్యంలో భారీ సైజు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి నల్లాలను బిగిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. కోట ప్రధాన గేటు నుంచి అమ్మవారి ఆలయం వరకు ఫ్లడ్‌లైట్లు  ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కోటలో బోనాల చరిత్రకు అద్దంపట్టే 3డీ షోలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు బయో టాయిలెట్‌, బారికేడ్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


 ముస్తాబవుతున్న అమ్మవారి ఆలయం 

 ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ఈ నెల 30నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిబోనం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించడంతో అంకురార్పణ జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. తొట్టెలు ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, లంగర్‌హౌజ్‌ నుంచి గోల్కొండ ఆలయం వరకు బోనాల శోభతోపాటు భక్తులతో కిటకిటలాడనుంది. కరోనాతో రెండేళ్లుగా బోసి పోయిన ఉత్సవాలకు ఈ ఏడాది లక్షలాది మంది తరలివచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 


ఏర్పాట్లు పరిశీలించిన ఆలయ చైర్మన్‌

లంగర్‌హౌజ్‌: గోల్కొండ కోటపై జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లను జగదాంబిక మహంకాళి ఆలయ చైర్మన్‌ వావిలాల మహేశ్వర్‌ గురువారం పరిశీలించారు. వచ్చే గురువారం అమ్మవారికి మొదటి బోనం సమర్పణ ఉండడంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివా్‌సరాజుతో కలిసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వినోద్‌, ప్రభాకర్‌ (చిరు), మోహన్‌, శ్రీకాంత్‌, పూజారి సర్వేశ్‌, టీఆర్‌ఎ్‌స నాయకుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T17:57:46+05:30 IST