నెత్తిన బోనాలతో బద్దిపోచమ్మ ఆలయం వద్ద బారులుదీరిన భక్తులు
వేములవాడ టౌన్, జనవరి 25: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. ‘పాడిపంటలను, పిల్ల పాపలను చల్లంగా చూడమ్మ పోచమ్మ తల్లీ’ అంటూ భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారిని వేడుకున్నారు. డప్పు చప్పుళ్లు, నెత్తిన బోనాలు, శివసత్తుల పునకాలతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నెత్తిన బోనాలతో గంటలపాటు క్యూలైన్‌లో నిరీక్షించారు. అమ్మవారికి ఒడిబియ్యం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
మేడారం సమ్మకసారక్క జాతర సందర్భంగా వేములవాడ దేవస్థానానికి భక్తుల రద్దీ పెరగడంతో రాజన్న ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాజన్న ఆలయంలోని పలు విభాగాలతోపాటు పీఆర్వో కార్యాలయాన్ని మంగళవారం పరిశీలించారు. ఆలయంలోని ఏర్పాట్లపై పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా నేపథ్యంలో నిబంధనల అమలుపై దృష్టిసారించాలన్నారు. బద్దిపోచమ్మ ఆలయంలోకి ప్రవేశించే మార్గం వద్ద సానిటైజర్ స్టాండ్‌ను, ఆలయంలోని రికార్డులను పరిశీలించారు. భక్తులు మాస్కు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు.