గ్రామాల్లో బోనాల సందడి

ABN , First Publish Date - 2021-07-27T06:16:30+05:30 IST

తెలంగాణ ప్రజలు తమ సంస్కృతిని ప్రతిభింభిస్తూ జరుపుకునే పండుగల్లో బోనాలకు విశిష్ట స్థానం ఉంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సర్వత్రా ప్రతియేటా బోనాల పండుగ జరుపుకుంటారు. గ్రామా ల్లో ఆయా కుల సంఘాలు, గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ

గ్రామాల్లో బోనాల సందడి
బోనాలపై గండ దీపాలను వెలిగిస్తున్న మహిళ

- తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ 

- ప్రతీ యేటా గ్రామ, వన దేవతలకు ప్రత్యేక పూజలు 

- అమ్మవారికి బోనాల సమర్పణ

మద్నూర్‌, జూలై 26: తెలంగాణ ప్రజలు తమ సంస్కృతిని ప్రతిభింభిస్తూ జరుపుకునే పండుగల్లో బోనాలకు విశిష్ట స్థానం ఉంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సర్వత్రా ప్రతియేటా బోనాల పండుగ జరుపుకుంటారు. గ్రామా ల్లో ఆయా కుల సంఘాలు, గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామ, వన దేవతలను పూజించే ప్రాశస్తం కలిగిన ఈ బోనాల ఉత్సవం ఆషాఢ మాసం నుంచి ప్రారంభమై శ్రావణ మాసం ప్రారంభం వరకు జరుపు కుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని, గ్రామాలు, కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుతూ స్థానిక ప్రజలు గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకుంటారు. 

బోనాలు ఎందుకు సమర్పిస్తారు?

గ్రామాల నుంచి పట్టణాల వరకు ఆషాఢం నుంచి శ్రావణ మాసం ప్రారంభం వరకు గ్రామ దేవతలంతా ప్రజల మధ్యనే సంచరిస్తారని, విశ్వాసం అంతేగాక వర్షాకాలం ఆరంభ దశలో డయేరియా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే కాలం కావడంతో ప్రజలు చీడపీడల నుంచి తమకు కాపాడుకుంటూ గ్రామ దేవతలైన మైసమ్మ, పెద్దమ్మతల్లి, మహంకాళి, కాళికా దేవి, పోచమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ అనే ఏడుగురు అక్కా చెల్లెళ్లకు తమ్ముడైన పోతరాజును పూజించడం సంప్రదాయంగా వస్తోంది. 

బోనం తయారీలో శాస్త్రీయం

బోనం తయారీలో శాస్ర్తీయ ప్రకృతి వైద్య విధానం కనిపిస్తుంది. అమ్మవార్లకు సమర్పించే బోనంలోని అన్నం పసుపుతో వండుతారు. అంతేకాకుండా పసుపులో రోగ నిరోధక శక్తి ఉండటం వల్ల ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఎన్నో రకాల రోగాలు నయం అవుతాయని ఎంతో మంది విశ్వసిస్తారు. 

కన్నులపండువగా బోనాల ఊరేగింపు

బోనాలు బయలెల్లినప్పుడు..  ‘అమ్మ బయలెల్లినదో..  తల్లీ బయలెల్లినదో’ అనే పాట అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. బోనం కుండకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వేపాకులను మాలలుగా చుట్టి తయారు చేఇన బోనం చూడటానికి ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది. మరో పాత్రలో బెల్లం నీళ్లు పెరుగుతో పాకను తీసుకెళతారు. బోనంపై భాగంలో మూత మాదిరిగా ఉండే మట్టి కంచుడులో నూనె పోసి గండ దీపం వెలిగిస్తారు. ఆ విధంగా తయార చేసిన బోనాలతో మహిళలు నడుస్తుండగా, ముందు భాగంలో డప్పుల మోతల తో, పోతరాజుల విన్యాసాలతో కొనసాగే ఊరేగింపు కన్నులపండువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో సైతం విద్యార్థులు, చిన్నారుల చేత బోనాల పండుగ నాటకాలు ప్రదర్శిస్తూ పండుగ మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకంగా గుర్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-27T06:16:30+05:30 IST