వరవరరావు కేసులో జైలు అధికారులకు హైకోర్టు నిర్దేశాలు

ABN , First Publish Date - 2022-04-23T21:53:32+05:30 IST

జైళ్ళలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని ఆ శాఖకు బోంబే

వరవరరావు కేసులో జైలు అధికారులకు హైకోర్టు నిర్దేశాలు

ముంబై : జైళ్ళలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని ఆ శాఖకు బోంబే హైకోర్టు సూచించింది. జైళ్ళలో ఉంటున్న ఖైదీలు తమకు తగిన వైద్య సదుపాయాలు లేవని చెప్తూ, తమకు బెయిలు మంజూరు చేయాలని కోరడానికి అవకాశం లేకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపింది. దీనివల్ల భీమా-కొరెగావ్ కేసులో నిందితుడు వరవరరావు, మరికొందరు ఖైదీల ఫిర్యాదులు పరిష్కారమవుతాయని పేర్కొంది. అలాంటపుడు భవిష్యత్తులో ఈ కారణాన్ని చూపుతూ బెయిలును కోరడానికి అవకాశం ఉండదని తెలిపింది. 


వరవరరావుకు శాశ్వత బెయిలును మంజూరు చేయడానికి బోంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే కంటిలోని శుక్లానికి శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం ఆయనకు బెయిలు గడువును మరో మూడు నెలలపాటు పొడిగించింది. మానవతావాద కారణాలతో ఈ ఉపశమనం కల్పించింది. జైళ్ళలో  వైద్య సదుపాయాల గురించి శ్రద్ధగా చూడకపోతే, లోపాలను సరిదిద్దడంపై తగిన ఆదేశాలను జారీ చేయకపోతే, విచారణ ఖైదీలంతా దీనినే సమస్యగా చూపించి, బెయిలు కోసం దరఖాస్తు చేస్తారని పేర్కొంది. బెయిలును మంజూరు చేయడం ద్వారా మరొక దృష్టాంతాన్ని సృష్టించడానికి బదులుగా, భవిష్యత్తులో లోపాలకు జవాబుదారీతనాన్ని నిర్ణయించడానికి తగిన నిర్దేశాలను జారీ చేయడం సముచితమవుతుందని అభిప్రాయపడింది. జస్టిస్ సునీల్ షుక్రే, జస్టిస్ జీఏ సనప్ ధర్మాసనం ఈ నిర్దేశాలను జారీ చేసింది. ఇకపై వైద్య సదుపాయాలు లేవని, సకాలంలో వైద్య సహాయం అందలేదని ఖైదీలు చెప్పడానికి అవకాశం ఉండకూడదని మహారాష్ట్ర జైళ్ళ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు తెలిపింది. 


వరవరరావుకు 2021 ఫిబ్రవరిలో ఆరు నెలల తాత్కాలిక బెయిలు మంజూరైంది. దీనిని పొడిగించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నివసించేందుకు అనుమతించాలని కోరారు. తలోజా జైలులో తాను జీవించే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2022-04-23T21:53:32+05:30 IST