బెంగళూరులో పాఠశాలలకు బాంబు బెదిరింపులు

ABN , First Publish Date - 2022-04-08T20:12:42+05:30 IST

నగరంలో కొన్ని పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు

బెంగళూరులో పాఠశాలలకు బాంబు బెదిరింపులు

బెంగళూరు : నగరంలో కొన్ని పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. శక్తిమంతమైన బాంబును అమర్చామని, ప్రాణాలను కాపాడుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు ఉన్నట్లు కనిపించలేదని, ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులని తెలిపారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గోపాలన్ ఇంటర్నేషనల్ స్కూల్, న్యూ అకాడమీ స్కూల్, సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్, ఇండియన్ పబ్లిక్ స్కూల్, ఎబెనెజెర్ ఇంటర్నేషనల్ స్కూల్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘‘మీ పాఠశాలలో చాలా శక్తిమంతమైన బాంబును పెట్టాం. ఇది జోక్ కాదు. వెంటనే పోలీసులను పిలవండి. మీతో సహా వందలాది ప్రాణాలు ఇబ్బందుల్లో పడవచ్చు. ఆలస్యం చేయొద్దు. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది’’ అని శుక్రవారం ఉదయం 11 గంటలకు  ఈ-మెయిల్ ద్వారా బెదిరించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ బెదిరింపులు వచ్చాయి. బాంబు నిర్వీర్య దళాలతోపాటు పోలీసులు ఈ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులను బయటకు పంపించి తనిఖీలు చేశారు. తమకు బాంబు కనిపించలేదని, ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని పోలీసులు చెప్పారు . 


కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాతో మాట్లాడుతూ, బాంబు బెదిరింపులపై ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. 


Updated Date - 2022-04-08T20:12:42+05:30 IST