లక్ష దాటిన మరణాలు.. సంబరం చేసుకుంటున్న దేశాధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-08-10T06:35:34+05:30 IST

బ్రెజిల్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్ష దాటిందని బ్రెజిల్

లక్ష దాటిన మరణాలు.. సంబరం చేసుకుంటున్న దేశాధ్యక్షుడు

బ్రసిలియా: బ్రెజిల్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్ష దాటిందని బ్రెజిల్ ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అయితే ఇదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటో కరోనాకు సంబంధించింది అని అనుకుంటే పొరపాటే. బొల్సొనారోకు చెందిన పామిరాస్ అనే సాకర్ టీం సావో పాలో చాంపియన్‌షిప్‌లో గెలుపొందింది. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ పైన కనపడుతున్న ఫొటోను బొల్సొనారో పోస్ట్ చేశారు. కరోనా కేసులు, లక్ష మరణాలపై మాత్రం ఆయన ఎటువంటి పోస్ట్ కూడా పెట్టలేదు. గురువారం ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. కరోనా మరణాల లెక్కల్లో అనేక తప్పులు ఉన్నాయని.. అందుకనే సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. మరోపక్క బొల్సొనారో మొదటి నుంచి కరోనా లాక్‌డౌన్‌కు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. లాక్‌డౌన్ పేరిట ప్రజలను ఇళ్లలోనే ఉంచాలని అనుకోవడం మంచి నిర్ణయం కాదని ఆయన అంటూ వచ్చారు. ఇక జూలై ఏడో తేదీన ఆయన కూడా కరోనా బారిన పడగా.. రెండు వారాల తర్వాత ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది.

Updated Date - 2020-08-10T06:35:34+05:30 IST