May 9 2021 @ 00:00AM

మళ్లీ ఓటీటీకి బాలీవుడ్‌ ఓటు!

గతేడాది కరోనా, ఆ తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని హిందీ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మాతలకు ఆదాయం ఆర్జించిపెట్టాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశతో గతేడాది పరిస్థితులు పునరావృతమవటంతో నిర్మాతల చూపు మరోసారి ఓటీటీపై పడింది. ఫలితంగా పలు బాలీవుడ్‌ చిత్రాలు ఓటీటీ  వేదికల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు విడుదల తేదీని ప్రకటించగా, మరికొన్నింటికి  ఓటీటీ వేదికలు ఖరారయ్యాయి. త్వరలోనే అధికారికంగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైన బాలీవుడ్‌ చిత్రాలు ఇవే. 


ఈద్‌కు సల్మాన్‌ ‘రాధే’

ఓటీటీలో విడుదలవుతున్న హిందీ సినిమాల్లో ముందు చెప్పుకోవాల్సింది సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడుగా నటించిన ‘రాధే: ద మోస్ట్‌ వాంటెడ్‌ బాయ్‌’ గురించే. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఏకకాలంలో విడుదలవుతూ ఓ కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేసిన చిత్రంగా దీనిని చెప్పవచ్చు. రంజాన్‌ (ఈద్‌) సందర్భంగా ఈ నెల 13న ‘జీ 5’, ‘జీ ప్లెక్స్‌’లో విడుదలవుతోంది. ఇందులో దిశా పటానీ కథానాయిక. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. కరోనా రెండో దశ కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూలు విధించిన కారణంగా చాలామంది ప్రేక్షకులు ఇంట్లోనే ఉండి ఓటీటీలో ‘రాధే’ను చూసే అవకాశమే ఎక్కువ. ‘దబాంగ్‌ 3’ ప్రభుదేవా, సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘రాధే’.అమెజాన్‌లో ‘తూఫాన్‌’

‘భాగ్‌ మిల్కా భాగ్‌’ తర్వాత దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా, హీరో ఫర్హాన్‌ అక్తర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘తూఫాన్‌’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సారి హీరో పోరాటం రన్నింగ్‌ ట్రాక్‌ నుంచి బాక్సింగ్‌ రింగ్‌కు మారింది. మే 21న ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది. మృణాల్‌ ఠాకూర్‌ ఈ చిత్రంలో కథానాయిక. 


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ‘భుజ్‌’

అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం ‘భుజ్‌: ద ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. ప్రస్తుతం ఓటీటీలో విడుదలకు సిద్ధమైన చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం త్వరలోనే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. 1971 ఇండియా, పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు. అజయ్‌ దేవగణ్‌ ఇందులో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ విజయ్‌ క ర్ణిక్‌ నిజజీవితపాత్రను పోషిస్తున్నారు. 


తాప్సీ‘హసీన్‌ దిల్‌రూబా’

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హసీన్‌ దిల్‌ రూబా’. వినిత్‌ మాథ్యూ దర్శకత్వంలో ఆనంద్‌ ఎల్‌. రాయ్‌, హిమాంశుశర్మ నిర్మించారు. భర్తను హత్య చేసి ఆ నేరాన్ని దాచటానికి ప్రయత్నించే భార్య పాత్రలో తాప్సీ కనిపిస్తారు. విక్రాంత్‌ మాసే, హర్షవర్దన్‌ రాణే ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్ల పాత్రల్లో నటించారు. గతేడాది అక్టోబర్‌లోనే చిత్రీకరణ పూర్తయింది. కొవిడ్‌ పరిస్థితుల వల్ల ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. 


నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెంట్‌హౌస్‌’

బాబీడియోల్‌, అర్జున్‌ రాంపాల్‌ ప్రఽధాన పాత్రల్లో దర్శకద్వయం అబ్బాస్‌, మస్తాన్‌ తెరకెక్కిన చిత్రం ‘పెంట్‌హౌస్‌’. ‘రేస్‌’, ‘రేస్‌ 2’ చిత్రాల తర్వాత వారి నుంచి వస్తున్న చిత్రం కావటంతో అంచనాలు పెరిగాయి. ఐదుగురు పెళ్లైన యువకులు ఓ పెంట్‌హౌస్‌ను అద్దెకు తీసుకొని అందులో నివసిస్తూ ఉంటారు. అనుకోకుండా ఆ ఇంట్లో ఓ మహిళ మృతదేహం లభ్యమవటం వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనేది కథ. 


కార్తీక్‌ ఆర్యన్‌ ‘ధమాకా’

బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ధమాకా’. 2014లో వచ్చిన దక్షి ణ కొరియా చిత్రం ‘ద టెర్రర్‌ లైవ్‌’ చిత్రానికి హిందీ రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడుగా. తొలిసారి ఆయన జర్నలిస్ట్‌గా సీరియస్‌ రోల్‌ చేస్తున్నారు. రామ్‌మద్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకరానుంది. 


ఓటీటీలోనే ‘మీనాక్షి సుందరేశ్వర్‌’ 

తమిళనాడు మధురైలో ఇద్దరు కొత్త దంపతుల మద్య జరిగే రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మీనాక్షి సుందరేశ్వర్‌’. అభిమన్యు దాసాని, సాన్యా మల్హోత్రా జంటగా నటించారు. వివేక్‌ సోనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవనుంది. 


సోనాక్షిసిన్హా ‘బుల్‌బుల్‌ తరంగ్‌’

మనదేశంలో వివాహ వ్యవస్థ లోపాలను చర్చిస్తూనే, పెద్దలు కాలంతో పాటు మారకపోతే యువత ఎదుర్కొనే ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్‌బుల్‌ తరంగ్‌’. ఇందులో సోనాక్షి సిన్హా, తాహిర్‌ రాజ్‌ భాసిన్‌ జంటగా నటించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవనుంది. తేదీ ప్రకటించాల్సి ఉంది. 


‘జాదూగర్‌’ డిజిటల్‌ రిలీజ్‌

జితేంద్రకుమార్‌, అరుషీ శర్మ జంటగా సమీర్‌ సక్సేనా 

దర ్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాదూగర్‌’. ఎలాంటి క్రీడా నైపుణ్యాలు లేని ఒక యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఫుట్‌బాల్‌ ట్రోఫీని గెలవటం అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులు ముందుకు రానుంది. 


‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ కూడా...

అర్జున్‌ కపూర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ ఈ నెల 18న  నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. కాశ్వీ నాయర్‌ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జాన్‌ అబ్రహమ్‌, అదితీరావ్‌ హైదరీ, నీనాగుప్తా కీలక పాత్రల్లో నటించారు. దేశ సరిహద్దు ప్రాంతాలకు చెందిన రెండు తరాలకు చెందిన వ్యక్తుల ప్రేమ, భావోద్వేగాల కలయికగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 


ఇటీవల ఓటీటీలో విడుదలైనవి..

సూరజ్‌ పంచోలి, ఇసబెల్లా కైఫ్‌ జంటగా నటించిన ‘టైమ్‌ టూ డ్యాన్స్‌’, జితేంద్ర కుమార్‌, అరుషి శర్మ ప్రధాన పాత్రలు పోషించిన ‘మైల్‌స్టోన్‌’ చిత్రాలు ఈ శుక్రవారమే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాయి.