Apr 23 2021 @ 17:36PM

బాలీవుడ్‌ తారలు... పుస్తక రచయితలు..

పుస్తక రూపంలో బాలీవుడ్‌ తారల విశేషాలు

(ప్రపంచ పుస్తక దినోత్సవం స్పెషల్‌)


తమ జీవితాన్ని పుస్తకంగా రాసుకోవాలని, ఎన్నో మధుర ఘట్టాలను పేజీలు తిరగేస్తూ చదువుకోవాలని చాలామంది కోరుకుంటారు. క్రియేటివ్‌, ఎంటర్‌టైర్‌మెంట్‌ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా ఈ ఆలోచనలుంటాయి. గతంలో దేవానంద్‌, నసీరుద్దీన్‌ షా, రిషీ కపూర్‌, కరణ్‌ జోహార్‌, ట్వింకిల్‌ ఖన్నా, ప్రేమ్‌ చోప్రాలాంటి స్టార్‌లు ఎందరో రచనలు,  ఆటోబయోగ్రఫీలు రాశారు. ఈ తరం తారలు కూడా తమ గురించి రాసుకునే ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పుడో చేద్దాంలే.. రాద్దాంలే అని కాకుండా బాలీవుడ్‌ యంగ్‌స్టర్స్‌ తమ జీవితాన్ని తెరచిన పుస్తకంగా చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, ఆయుష్మాన్‌ ఖురానా, సోహా అలీ ఖాన్‌ తదితరులు పుస్తకాలు రాసి ువీరు నటించగలరు. పుస్తకాలూ రాయగలరు’ అని నిరూపిస్తున్నారు. శుక్రవారం ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.


ప్రియాంక సక్సెస్‌ఫుల్‌ జర్నీ...

ఏ బ్యాగ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టి హాలీవుడ్‌లో సిరీస్‌లు, సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు ప్రియాంక చోప్రా. అందుకే ఇప్పుడు ప్రియాంకను గ్లోబల్‌ స్టార్‌ అని పిలుస్తున్నారు. ఈ పేరు అంత సులభంగా రాలేదు. సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం సులభంగానూ నడవలేదు. కెరీర్‌ బిగినింగ్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. నటిగా నిలదొక్కుకోవడానికి పోరాటాలు చేశారు. ఓ ప్రమాదంలో పెదవి తెగి రూపమే మారిపోయింది. ఇక తన జీవితం తారుమారు అయిందనుకున్నారంతా. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని విమర్శలకు గురయ్యారు. అయితే అవేమీ ప్రియాంక విజయానికి అడ్డుపడలేకపోయాయి. వాటన్నింటి ఆధారంగా ‘అన్‌ ఫినిష్డ్‌’ అనే పుస్తకం రాశారు. ప్రియాంక జోనస్‌ ఈ పుస్తకాన్ని పబ్లిష్‌ చేశారు. తన పుస్తకంలోని ‘నీలాంటి వ్యక్తివి నువ్వు మాత్రమే. నీ గురించి బాగా తెలిసిన వ్యక్తీ నువ్వే’’ వంటి మాటలు ఆకట్టుకుంటున్నాయి.

టికెట్‌ టు బాలీవుడ్‌.. ఖురానా

ఆయుష్మాన్‌ ఖురానా బాలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్స్‌ హిట్స్‌ అందుకున్న కథానాయకుడు. చండీగఢ్‌లో పుట్టిన ఈయన ముంబైకు వచ్చి జీరోతో కెరీర్‌ మొదలు పెట్టి  సక్సెస్‌ఫుల్‌ హీరోగా మారారు. జీరోకు హీరోకు మధ్య చెప్పలేనంత దూరం ఉందని ఆయన నమ్ముతారు. ఆ భయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. కలలు ఎప్పుడూ అందనంత    ఎత్తులో ఉంటాయని తెలుసుకుని తన కలలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ముంబైలో అడుగుపెట్టారు. ఛండీగఢ్‌ టు ముంబై, అక్కడి నుంచి హీరో.. ఎదురైన కష్టాలకు అక్షర రూపం ఇచ్చారు. అదే ‘క్రాకింగ్‌ ది కోడ్‌: మై జర్నీ ఇన్‌ బాలీవుడ్‌’ పుస్తకం. భార్య తహీర కష్యప్‌తో కలిసి ఈ పుస్తకం రాశారు. మై భీ హీరో, మైనే స్ట్రగులర్‌ హుమ్‌, టికెట్‌ టు బాలీవుడ్‌... తదితర అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కలలు కనేవాళ్లకు, కన్న కలలు నిజం చేసుకోవడానికి భయపడేవాళ్లకు ఈ పుస్తకం అంతులేని ధైర్యమిస్తుందని ఖురానా చెబుతారు.

ది పెరిల్స్‌ ఆఫ్‌ బీయింగ్‌ మోడరేట్లీ ఫేమస్‌

సోహా అలీఖాన్‌ చాలామంది దృష్టిలో పటౌడీ షర్మిలా ఠాగూర్‌ల కూతురు, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ సోదరిగా సుపరిచితమే! హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ సినిమాల్లో నటిగా ప్రతిభ చాటుకున్న ఆమె వినోదాత్మకంగా ‘ది పెరిల్స్‌ ఆఫ్‌ బీయింగ్‌ మోడరేట్లీ ఫేమస్‌’’ పుస్తకం రాసి పాఠకులకు ఆహ్లాదాన్ని అందించారు. తన స్కూల్‌, కాలేజ్‌, జీవిత జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో పాటు ఇప్పటి సోషల్‌ మీడియా కల్చర్‌పై కూడా ఆమె ఈ పుస్తకంలో తనదైన శైలిలో రాశారు. అయిదుసార్లు జీవితం కుప్పకూల్చితే, పదిసార్లు లేచి నిలబడాలన్నది ఈ పుస్తకంలో ముఖ్యాంశం.  

ఇషా డియోల్‌.. అమ్మ మియా.

మాతృత్వం గురించి ఇషా డియోల్‌ రాసిన పుస్తకం అమ్మ మియా. గర్భం దాల్చినప్పుడు తాను ఎదుర్కొన్న భయాలు, సందేహాలు వాటికి దొరికిన సమాధానాలు నేపథ్యంలో ఇద్దరు పిల్లలు రధ్య, మియరల పెంపకం సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదొక బెస్ట్‌ పేరెంటింగ్‌ పుస్తకంగా గుర్తింపు తెచ్చుకుంది.


టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ, శ్రుతీహాసన్‌, రాశీఖన్నా, అనుష్క వంటి అగ్ర నటీనటులు, దర్శకులు తమ జీవితం గురించి పుస్తకాలు రాసే ప్రయత్నాల్లో ఉన్నారు. అవన్నీ ఎప్పటికి కార్యరూపం దాల్చుతాయో చూడాలి.