‘బేబీ’ హడల్‌!

ABN , First Publish Date - 2020-03-22T05:41:02+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేగుతున్న వేళ... ప్రజలంతా ఆ మహమ్మరిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ... బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌ నిర్ల్యక్షం ఒక్కసారిగా యావత్తు సమాజాన్ని బెంబేలెత్తిచ్చింది.

‘బేబీ’ హడల్‌!

దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేగుతున్న వేళ... ప్రజలంతా ఆ మహమ్మరిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ... బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌ నిర్ల్యక్షం ఒక్కసారిగా యావత్తు సమాజాన్ని బెంబేలెత్తిచ్చింది. ఈనెల 10న లండన్‌ నుంచి ముంబయికి తిరిగొచ్చి, ఆ మరుసటి రోజు ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పలువురు రాజకీయనాయకులు, ప్రముఖులు హాజరైన పార్టీలో పాల్గొన్నది కనిక. ఆ తర్వాత కూడా పలు పార్టీలకు వెళ్లింది. నాలుగురోజుల క్రితం ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. ఆమె చేసిన తప్పునకు భారీమూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరీ కనికా కపూర్‌?


‘బేబీ డాల్‌’, ‘చిటియ కలయ్యా’ వంటి పాటలు వినగానే కనికా కపూర్‌ స్వీట్‌ వాయిస్‌ గుర్తుకొస్తుందెవరికైనా. ‘బేబీడాల్‌’ సింగర్‌గా పేరున్న 41 ఏళ్ల కనికా లఖ్‌నవూలోని వ్యాపార, సంగీత నేపథ్యమున్న కుటుంబంలో పుట్టారు. దాంతో సహజంగానే ఆమెకు సంగీతం మీద అభిరుచి ఏర్పడింది. ఆమె తండ్రి రాజీవ్‌ కపూర్‌ వ్యాపారస్తుడు. తల్లి పూనమ్‌ కపూర్‌ బొటిక్‌ నడిపేవారు. 12ఏళ్ల వయసులోనే కనికా వారణాసికి చెందిన పండిట్‌ గణేశ్‌ ప్రసాద్‌ మిశ్రా వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. స్థానికంగా ఉన్న ‘లొరెటో కాన్వెంట్‌’ స్కూల్లో చదువుతున్న రోజుల్లో సంగీత పోటీల్లో ఎక్కువగా పాల్గొనేవారు. తరువాత భత్ఖండే మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీఏ, ఎంఏ మ్యూజిక్‌ తరగతుల్లో చేరారు. సంగీతంతో ఆమె కథక్‌ డాన్స్‌లో కూడా శిక్షణ పొందారు. సినిమాల్లో పాడాలన్నది ఆమె కల. సొంత ఊళ్లోనే ఉండిపోతే అవకాశాలు రావు అని గ్రహించి ముంబయి వెళ్లి తన కెరీర్‌ను నిర్మించుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే తన కజిన్‌ వివాహ వేడుకలో పరిచయమైన వ్యాపారవేత్త రాజ్‌ చందోక్‌ను 1997లో పెళ్లి చేసుకొని లండన్‌లో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అయితే 12 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పి, భర్త నుంచి విడాకులు తీసుకొంది. 2012లో ఆమె ఇండియాకు వచ్చారు. తిరిగి తన అభిరుచిని కొనసాగించాలనుకున్నారు.


బాలీవుడ్‌లో ఎంట్రీ ఇలా...

సినిమాలో పాడాలన్న తన కలను కనికా ఒక మ్యూజిక్‌ వీడియోతో మొదలెట్టింది. 2012లో ‘జుగ్ని జి’ పాటతో ఆమె పాటల ప్రస్థానం మొదలైంది. పాకిస్థానీ సూఫీ గీతమైన ‘అలిఫ్‌ అల్లాహ్‌’కు రీమిక్స్‌ వెర్షన్‌ అయిన ఈ పాట పెద్ద హిట్‌ అవడంతో ఆమెకు ఎంతో పేరు వచ్చింది. దాంతో కనికాకు బాలీవుడ్‌లో సింగర్‌గా అవకాశం దొరికింది. అలా రెండేళ్ల తరువాత (2014) బాలీవుడ్‌లో ప్లేబ్యాక్‌ సింగర్‌గా కెరీర్‌ మొదలెట్టారు కనికా. ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌2’ లో పాడిన ‘బేబీ డాల్‌’ పాట సూపర్‌ హిట్‌ అయ్యింది. దాంతో కనికా ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యారు. ఈ పాటకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు కూడా. తరువాత షారుక్‌ఖాన్‌ సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్‌’లో ‘లవ్లీ’ పాటకు కనికా గ్లోబల్‌ ఇండియన్‌ మ్యూజిక్‌ అకాడమీ అవార్ట్స్‌ (2016)లో బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా నామినేట్‌ అయ్యారు. ఆ తర్వాత పలు బాలీవుడ్‌ పాటలు ఆమె ఖాతాలో చేరాయి. అంతేకాదు లైవ్‌ షోలతో సంగీత ప్రియుల్ని అలరించడంతో పాటు సొంతంగా ‘కనికా కపూర్‌: హౌజ్‌ ఆఫ్‌ చికన్‌కారీ’ పేరుతో  ఫ్యాషన్‌ బ్రాండ్‌ నిర్వహిస్తున్నారీ సింగర్‌. 


ఆమె నిర్లక్ష్యం ఖరీదు?

మార్చి 10న కనికా లండన్‌ నుంచి ముంబయికి వచ్చారు. ఆ మరుసటి రోజే ఆమె లఖ్‌నవూలో జరిగిన పార్టీల్లో పాల్గొన్నారు. ఒక పార్టీలో రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో పాటు ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్‌, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీ తర్వాతే ఆమెకు కోవిడ్‌-19 వైరస్‌ ఉన్నట్లు తేలింది. దాంతో ఆమె మీద సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదయ్యింది. అయితే కనికా మాత్రం ‘‘నేను ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసుకొని వచ్చాను. ఇంటికి వచ్చిన నాలుగు రోజుల తరువాత జలుబు లక్షణాలు కనిపించాయి. వెంటనే కరోనా టెస్ట్‌ చేయించుకున్నా. పాజిటివ్‌ వచ్చింది. ఇప్పుడు నేను, మా కుటుంబసభ్యులు స్వీయ నిర్బంధంలో ఉన్నాం. ఎయిర్‌పోర్ట్‌లో స్కానింగ్‌ పరీక్ష తప్పించుకున్నాను అంటూ నా గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదు. నేనేమీ అక్కడి బాత్‌రూమ్‌లో దాక్కోలేదు’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే పార్టీలో కనికాతో ఉన్న ప్రముఖులంతా ప్రస్తుతం ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉన్నామని ప్రకటించారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందా? అనే ఆందోళన అందర్నీ కలవరపెడుతోంది.

Updated Date - 2020-03-22T05:41:02+05:30 IST