కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడిగా ఇళయ దళపతి విజయ్‌కి పేరుంది. ‘‘తుపాకీ’’, ‘‘విజిల్’’,‘‘మాస్టర్’’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ మధ్య దగ్గరయ్యారు. అతడు తాజాగా హీరోగా నటించిన సినిమా ‘‘బీస్ట్ ’’. పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం 2022 ఏప్రిల్‌లో విడుదల కానుంది. ట్రేడ్ సర్కిల్స్‌లో ఆ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సినిమా రిలీజ్ కాకముందే రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారని తెలుస్తోంది.
‘‘బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం సన్ పిక్చర్స్‌తో చర్చలు జరుపుతున్నారు. భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నారు. ఒక బాలీవుడ్ నిర్మాతకు దక్షిణాది ఇండస్ట్రీకి చెందినవారితో మంచి పరిచయముంది. అతడు ఆ సినిమా హక్కులను పొందే అవకాశం ఉంది ’’ అంటూ బీ టౌన్‌కు చెందిన ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. ‘‘బీస్ట్’’ చిత్రం ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో కొనసాగబోతున్నట్టు కోలీవుడ్ మీడియా చెబుతోంది. విజయ్ ‘‘బీస్ట్’’ అనంతరం దిల్ రాజు సంస్థలో ఒక సినిమాను చేయనున్నారు. ఆ చిత్రానికి దళపతి-66 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. తెలుగు-తమిళంలో ఒకేసారి ఆ మూవీని తెరకెక్కిస్తారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే విజయ్ హీరోగా తెరకెక్కిన ‘‘మాస్టర్’’ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. ఆ రీమేక్ రైట్స్ మురాద్ ఖేతానీ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం స్క్రిఫ్ట్ వర్క్ కొనసాగుతోంది. అతి త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్ర బృందం చెప్పింది.