Advertisement
Advertisement
Abn logo
Advertisement

షమీకి మద్దతు.... Kohliపై ప్రశంసల జల్లు

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అతడి వల్లే జట్టు ఓడిందని విమర్శించారు. మరికొందరైతే ఓ అడుగు ముందుకు వేసి భారత జట్టులోనూ ఓ పాకిస్థానీ ఉన్నాడంటూ షమీని ఉద్దేశించి తీవ్రంగా ట్రోల్ చేశారు.


షమీపై నెటిజన్ల వ్యాఖ్యల్ని పలువురు మాజీ క్రికెటర్లు అప్పుడే ఖండించారు. తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా ఈ ట్రోల్స్‌పై స్పందించాడు. షమీకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశాడు. మతం పేరుతో దూషించడం చాలా నీచమైన పని అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  


మతం పేరుతో దూషించేవాళ్లను చూస్తుంటే జాలి వేస్తోందని కోహ్లీ అన్నాడు. వెన్నెముక లేనివారే ఇలా మతాన్ని టార్గెట్ చేసుకుంటారని పేర్కొన్నాడు. దేశంపై షమీకి ఉన్న అంకితభావం ఏంటో అందరికీ తెలుసని, మరోమారు నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.


అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ దానికి మతాన్ని ఆపాదించడం మాత్రం సరైనది కాదని అన్నాడు. అసలు ఇలా చేయడాన్ని తాను ఎప్పుడు, ఎక్కడా చూడలేదన్నాడు. షమీ గురించి తెలియని వారే ఇలాంటివి చేస్తుంటారని, ఎవరెన్ని విమర్శలు చేసినా తమ సోదరభావాన్ని చెడగొట్టలేరని తేల్చి చెప్పాడు. షమీకి 200 శాతం మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. 


కోహ్లీ తాజా వ్యాఖ్యలపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు ఫర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్, ఇషాన్ ఖట్టర్, అనంద్ అహూజా, షిబాని దండేకర్, హర్షవర్ధన్ కపూర్, స్వరభాస్కర్ తదితరులు షమీకి అండగా నిలవడమే కాకుండా.. షమీకి మద్దతు ప్రకటిస్తూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement