Abn logo
Sep 7 2020 @ 22:40PM

బాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు..

Kaakateeya

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి : సుశాంత్‌ ఆత్మహత్య కేసు డ్రగ్‌ టర్న్‌ తీసుకున్న తర్వాత నిత్యం ఆ కేసు వ్యవహారంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో అయితే ఓ రకంగా వార్‌ నడుస్తోంది. అయితే.. రియా తన విచారణలో పలువురు బాలీవుడ్‌ స్టార్ల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. 


సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య వ్యవహారంలో టర్న్‌ తీసుకున్న డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో బాలీవుడ్‌ స్టార్ల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తు సాగిస్తున్న ఎన్‌సీబీ ఇందులో ప్రమేయమున్నట్టుగా అనుమానిస్తున్న షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండా, దీపేష్ సావంత్‌లను ఇప్పటికే అరెస్టు చేసింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రబర్తిని రెండవరోజైన సోమవారంనాడు కూడా ప్రశ్నించింది. 


సోమవారం విచారణలో భాగంగా డ్రగ్స్ వ్యాపారి బాసిత్ పరిహార్‌ కనీసం ఐదు సందర్భాల్లో తమను కలిశాడని, అతనే తమ ఇంటికి వచ్చేవాడని రియా ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. కాగా, మరో సంచలన విషయాన్ని కూడా రియా వెల్లడించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌లో ప్రమేయమున్న పలువురు బాలీవుడ్ నటుల పేర్లను సైతం ఎన్‌సీబీకి రియా వెల్లడించిందని అంటున్నారు. ప్రస్తుతం 18 నుంచి 19 మంది స్టార్ల పేర్లు ఎన్‌సీబీ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఎవరెవరి పేర్లు రియా వెల్లించిందనేది మాత్రం ఇంకా బయటకు కాలేదు. సుశాంత్ సింగ్ 2016లో డ్రగ్స్‌ గాలానికి చిక్కాడని ఎన్‌సీబీ విచారణలో రియా చెప్పినట్టు తెలుస్తోంది.

అటు, సుశాంత్ మృతి, డ్రగ్స్‌ మాఫియా కేసులో మరో అరెస్ట్ చోటుచేసుకుంది. మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్ డీలర్ అనూజ్ కేశ్వానిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. సుశాంత్ మృతి కేసులో అరెస్ట్ అయిన డ్రగ్ పెడ్లర్ కైజెన్ ఇబ్రహీం అతడి పేరును వెల్లడించాడు. దీంతో అనూజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీం ఇంటరాగేషన్‌లో కేశ్వానీ పేరు బయటకు రావడంతో ముంబై బాంద్రా, శాంతాక్రజ్‌లో అతడి నివాసంలో ఎన్‌సీబీ తాజాగా దాడులు నిర్వహించింది.


కేశ్వానీ నివాసంలో దాడుల సందర్భంగా 590 గ్రాముల గంజాయి, 64 మిల్లీ గ్రాముల ఎల్‌ఎస్‌డీ షీట్లు, 304 గ్రాముల మరిజువానా, మరిజువానా జాయింట్లు, క్యాప్సుల్స్,  లక్షా 85వేల రూపాయల నగదు, 5 వేల ఇండోనేషియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్ తెలిపారు.


మరోవైపు.. దేశంలో మరో సమస్య లేనట్టుగా మీడియా దృష్టి మొత్తం రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యుల విచారణపైనే పెట్టిందంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాపై సెటైర్లు వేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, రైతుల సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘రియా కుటుంబం మొత్తం అరెస్ట్ కాలేదు’ అనే అంశంపై దృష్టి సారించిందని అన్నారు. దేశంలో రియా కుటుంబం మొత్తం అరెస్ట్ కాకపోవడం అనే ఒక్క సమస్య మాత్రమే ఉంది. దీనిపైనే కేంద్రం, మీడియా 24 గంటలూ పనిచేస్తోంది’ అంటూ మనీష్ సిసోడియా ట్విటర్‌లో సెటైర్లు వేశారు. 


శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ఉధృతమయ్యింది. కంగనా రనౌత్ తాజాగా మరో ట్వీట్‌ చేశారు. బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాలను ప్రస్తావిస్తూ సంజయ్ రౌత్ వారిని ఎందుకు ‘హరామ్‌కోర్’ అని విమర్శించలేదని కంగనా ఫైర్ అయ్యారు.


ముంబై పీవోకేను తలపిస్తోందని కంగనా చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. ఆమెను ముంబైకి రావద్దని సలహా ఇచ్చారు. ఇలా ఒకరిపై ఒకరు ప్రతివిమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో సంజయ్ రౌత్‌ను మీడియా ప్రశ్నించింది. ఆయన దానికి సమాధానం ఇస్తూ కంగనాను ‘హరామ్‌కోర్ లడ్కీ’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కంగనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంజయ్ రౌత్‌కు సమాధానంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. 


ప్రతి రోజు, ప్రతి గంటకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. పని చేసే చోట, ఇతర ప్రదేశాల్లో వాళ్లు ఎన్నో లైంగిక, మానసిక హింసలు ఎదుర్కొంటున్నారు. మరి దీనికి కారకులు ఎవరు? మనిషిలో ఉన్న మానసిక ప్రవృత్తే కదా అసలు కారణం. నేను ముంబై పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు మీరు నన్ను హరామ్‌కోర్ అన్నారు. ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాలు గతంలో ఈ దేశంలో రక్షణ లేదని అన్నారు. వారిని ఎందుకు హరామ్‌కోర్ అని అనలేదు?  నా అభిప్రాయాల్ని చెప్పే హక్కు నాకుంది. మీరు నన్ను కాదు ఈ దేశ మహిళల్ని అవమానించారు. వారు మిమ్మల్ని క్షమించరు.. అని తన వీడియోలో కంగనా చెప్పుకొచ్చారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది. బాలీవుడ్‌లో నెపోటిజం గురించి కంగనా చేసిన వ్యాఖ్యలపై అక్కడి సెలబ్రెటీలు చాలామంది అభ్యంతరం తెలిపారు. ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందని కంగనా చేసిన కామెంట్ పెను దుమారమే రేపింది. ఈ వ్యాఖ్యలపై అధికార శివసేన తీవ్రంగా మండిపడింది. మహారాష్ట్ర, ముంబై, మరాఠాల గురించి మితిమీరి మాట్లాడితే సహించేది లేదని, తాను చేసిన వ్యాఖ్యలపై కంగనా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. 


శివసేన కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా కంగనా క్షమాపణ చెప్పకుంటే ముంబైలో అడుగుపెట్టనిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. అయితే.. ఈ విమర్శలకూ కంగనా కౌంటర్ ఇచ్చింది. తాను ఈ నెల 9న ముంబైకి వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో.. కంగనాకు ప్రాణ హాని ఉందని, ఆమె భద్రతపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ భద్రత కల్పించేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు కేంద్రం కూడా ఆమెకు వై ప్లస్ భద్రత కల్పించేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో.. కంగనా ముంబై పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


మరోవైపు.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి శ్వేతాసింగ్‌ కీర్తి సోదరుడిని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్‌ తాను చిన్నప్పుడు కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్‌ చేశారు. మేం ఒకరిని ఒకరం ఎప్పుడూ కాపాడుకుంటాం అని వాగ్దానం చేశాము. కానీ భాయ్‌​ నేను నా మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాను. అయితే ఇప్పుడు నేను, దేశం మొత్తం నీకు మరో వాగ్ధానం చేస్తున్నాం. మేం నిజం కనుక్కుంటాం, నీకు న్యాయం చేస్తాం. అని శ్వేతాసింగ్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.- సప్తగిరి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి

Advertisement
Advertisement
Advertisement