ముంబై: రంజాన్ వస్తుందనగానే చాలా బాలీవుడ్ వేడెక్కుతుంది. స్టార్ హీరోల సినిమాల విడుదలతో పోటాపోటీగా ఉంటుంది. ఇక, ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. అయితే, కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి మాత్రం ఎటువంటి సందడి లేదు. సినిమా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడిన నేపథ్యంలో బాలీవుడ్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. సల్మాన్‌ఖాన్ నటించిన ‘రాధే’, అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీబాంబ్’లు ఈ ఈద్ నాడు విడుదల కావాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు తొలి రోజున ఏకంగా రూ. 45-రూ. 50 కోట్లు వసూలు చేస్తాయని భావించారు. కానీ రూపాయి బిజినెస్ కూడా జరగలేదు.
గత 11 ఏళ్లుగా సల్మాన్ సినిమాలు ఈద్ రోజున సందడి చేస్తూనే ఉన్నాయి. 2009లో సల్మాన్ ఖాన్ సినిమా ‘వాంటెడ్’ విడుదలైంది. తొలుత ఈ సినిమాపై అంచనాలు లేకున్నా, ఆ తర్వాత ఏకంగా రూ.60.24 కోట్లు వసూలు చేసింది. 2010లో వచ్చిన ‘దబాంగ్’ ఏకంగా రూ. 141.24 కోట్లు కొల్లగొట్టింది. 2011లో ‘బాడీగార్డ్’ (రూ.144.78 కోట్లు), 2012లో ‘ఏక్ థా టైగర్’ (రూ.186.14 కోట్లు) బాక్సాఫీసును కొల్లగొట్టాయి.
2013లో వచ్చిన షారూక్ ఖాన్ సినిమా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్ రూ. 207.69 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. 2014లో సల్మాన్ యాక్షన్ కామెడీ సినిమా ‘కిక్’ రూ.211.63 కోట్లు కొల్లగొట్టింది. 2015, 2016లో వచ్చిన సల్మాన్ ‘బజరంగీ భాయ్‌జాన్’ (రూ.315.49 కోట్లు), ‘సుల్తాన్’ (రూ.300.67 కోట్లు) సినిమాలు బాక్సీఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి.
అయితే, 2017లో సల్మాన్ ప్రభ కొంత తగ్గింది. అతడి సినిమాలు ‘ట్యూబ్‌లైట్’ (రూ.114.57 కోట్లు), ‘రేస్ 3’ (రూ.166.15), ‘భారత్’ (రూ.197.34 కోట్లు) పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. నిజానికి సల్మాన్ ఖాన్ సినిమాలు తొలి రోజు కలెక్షన్లు రూ. 25-35 కోట్ల మధ్య ఉంటాయి.
దీపావళి, రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం లాంటి సందర్భాల్లో బాలీవుడ్లో కొంత పోటీ వాతావరణం ఉంటున్నా, ‘ఈద్’ సమయంలో మాత్రం సల్మాన్‌కు తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం సల్మాన్ ‘రాధే’, అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’ విడుదలై ఉంటే మొదటి రోజున రూ. 35 కోట్ల వరకు సులభంగా వసూలై ఉండేవని ట్రేడ్ మేగజైన్ ‘కంప్లీట్ సినిమా’ ఎడిటర్ అతుల్ మోహన్ తెలిపాడు.
కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రంగాల్లాగే సినీ పరిశ్రమ కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే, ఈ ఏడాది రెండో అర్ధభాగం తర్వాత చిత్ర పరిశ్రమ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని, స్వాతంత్ర్య దినోత్సవం, దసరా, దీపావళి, ఇతర పండుగల సమయంలో చిత్ర పరిశ్రమ కొంత ఊపిరి తీసుకుంటుందని సినీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘రాధే’ కాకుండా రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సూర్యవంశీ’, కబీర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా '83’ వరుణ్ ధావన్ నటించిన ‘కూలీ నెం.1’ వంటి టెంట్‌పోల్ సినిమాలు ‘డైరెక్ట్ టు డిజిటల్’ వైపు మళ్లకుండా నేరుగా థియేటర్లలో రిలీజ్‌కే మొగ్గుచూపుతున్నాయి. డైరెక్ట్ టు డిజిటల్ వల్ల వచ్చే ఆదాయం సినిమా ఖర్చులకు కూడా సరిపోదన్న భావనే ఇందుకు కారణం కావొచ్చని అంటున్నారు. అయితే, ఒకసారి పెద్ద సినిమాలు లైన్లో పడితే మిగతా అంతా దానంతట అదే సర్దుకుంటుందని పీవీఆర్ పిక్చర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమల్ గియాన్చందాని ఆశాభావం వ్యక్తం చేశారు.