బాలీవుడ్‌ భారతం

ABN , First Publish Date - 2021-03-21T05:54:14+05:30 IST

పౌరాణికాలైన రామాయణ, మహాభారతాల్లో అద్భుత ఘట్టాలు, ఆసక్తికలిగించే కథనాలు ఎన్నో ఉన్నాయి. వాటి ఆధారంగా ఎన్నో సినిమాలు తీయవచ్చు. ఈ పౌరాణిక కథల ఆధారంగా భారతీయ సినీ పరిశ్రమలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి

బాలీవుడ్‌ భారతం

పౌరాణికాలైన రామాయణ, మహాభారతాల్లో అద్భుత ఘట్టాలు, ఆసక్తికలిగించే కథనాలు ఎన్నో ఉన్నాయి. వాటి ఆధారంగా ఎన్నో సినిమాలు తీయవచ్చు. ఈ పౌరాణిక కథల ఆధారంగా భారతీయ సినీ పరిశ్రమలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు తీయటానికి రామాయణ, మహాభారతాల కథలే మేలు అంటున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పౌరాణికాల మీద ఓ లుక్‌ వేద్దాం. 


సూర్యపుత్ర మహావీర్‌ కర్ణ

మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్ర కర్ణుడు. మలయాళ రచయిత, దర్శకుడు ఆర్‌.ఎస్‌. విమల్‌ కర్ణుడి కోణంలో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘సూర్యపుత్ర మహావీర్‌ కర్ణ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్‌మెంట్‌ బ్యానర్లో వషూ భగ్నానీ నిర్మిస్తున్నారు. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. తొలుత కర్ణుడి పాత్రలో విక్రమ్‌ నటిస్తున్నట్టు ప్రకటించారు. కానీ లాక్‌డౌన్‌ వల్ల ముందు అనుకున్న విధంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో డేట్లు అడ్జెస్ట్‌ చేయలేక ప్రధాన పాత్రధారి విక్రమ్‌ తప్పుకున్నారు. 


మూడు భాగాలుగా రామాయణం. 

‘దంగల్‌’ చిత్ర దర్శకుడు నితేష్‌ తివారీ  రామాయణం ఆధారంగా ఓ చిత్రం చేస్తున్నట్టు రెండేళ్ల క్రితం ప్రకటించాడు. మూడు భాగాలుగా నిర్మించేలా కథను సిద్ధం చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో  త్రీడీలో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అరవింద్‌, మధుమంతెన, నమిత్‌ మల్హోత్రా నిర్మాతలుగా రూ. 500 కోట్ల వ్యయంతో భారీ ఎత్తున తెరకెక్కుతోందని అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి కదలికా లేదు. ఇదిలా ఉంటే నిర్మాత పహ్లజ్‌ నిహ్లాని ‘అయోద్యాకి కథ’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 


ఆదిపురుష్‌

మాహిష్మతి యువరాజుగా ‘బాహుబలి’ ఇచ్చిన విజయంతో ప్రభా్‌సకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. ‘సాహో’ విజయం స్టార్‌డమ్‌ను మరింత పెంచింది. ఈసారి ‘ఆదిపురుష్‌’ చిత్రంతో పురుషోత్తముడైన శ్రీరాముడి పాత్రతో బాలీవుడ్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రభాస్‌ సిద్ధమవుతున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకుడు. త్రీడీలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రావణుడిలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుందంటూ ఆ మధ్య సైఫ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో వివాదం మొదలైంది. వెంటనే సైఫ్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. 


మహాభారత్‌

ద్రౌపది దృక్కోణంలోంచి మహాభారతం ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో తెరకెక్కుతోన్న చిత్రంలో ద్రౌపదిగా దీపిక పడుకోణ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత మధు మంతెనతో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో ద్రౌపది పాత్రను పోషించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం లాంటిది ఇది’’ అని దీపికా అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఇంకా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. 


పౌరాణిక గాథలే ఎందుకు?

రామాయాణం, మహాభారతం లాంటి పౌరాణిక గాథలు ఎంత కాలం గడిచినా కొత్తగానే ఉంటాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్థ్యం ఆ కథల్లో ఉంది. కథ పాతదే అయినా కొత్తగా చెప్పే వీలుండటం, విజువల్‌ ఎఫెక్ట్స్‌, టెక్నాలజీని ఉపయోగించి సినిమాను దృశ్యకావ్యంగా మలచే అవకాశం ఉండడం ఓ కారణం అయితే ఈ తరహా చిత్రాల్లో నటించటం, నిర్మించటాన్ని నటులు, నిర్మాత, దర్శకులు సవాల్‌గా భావిస్తున్నారు. వీటన్నింటితో పాటు ‘బాహుబలి’, ‘తానాజీ’ లాంటి చిత్రాలు వందల కోట్ల  రూపాయలను వసూలు చేయటం ఈ తరహా చిత్రాలను తీసేందుకు నిర్మాతలకు ధైర్యాన్నిస్తోంది.


సీత 

రామాయణం నేపథ్యంలో బాలీవుడ్‌లో వస్తున్న మరో సినిమా ‘సీత’. మనందరికీ తెలిసిన సీతారాముల కథ రామాయణం. కానీ ఈ చిత్రంలో సీతాదేవి కోణ ంలోంచి రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘సీత ద ఇన్‌కార్నేషన్‌’ పేరుతో తెరకెకక్కుతోన్న ఈ చిత్రానికి అలౌకికా దేశాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు. ‘మగధీర’, ‘బాహుబలి’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల రచయిత కె. విజయేంద్రప్రసాద్‌, అలౌకికా దేశాయ్‌తో కలసి కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎ హ్యూమన్‌ బీయింగ్‌ స్టూడియో ప్రొడక్షన్‌ ఇటీవల ప్రకటించింది. వీఎ్‌ఫఎక్స్‌ హంగులతో భారీఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర తారాగణం, ఇతర వివరాలను ప్రకటించాల్సి ఉంది. 


రామ్‌సేతు

కథానాయకుడి గుర్తింపు కాపాడుకుంటూనే విలక్షణమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నటుడు, నిర్మాత అక్షయ్‌కుమార్‌. ఈసారి ఆయన చూపు పౌరాణికాలపై పడింది. అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో ‘రామసేతు’ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. రామసేతు మానవ నిర్మాణమా, ప్రకృతి సహజంగా ఏర్పడిందా అనేది తేల్చే ఓ పురాతత్వ శాస్త్రవేత్త పాత్రలో అక్షయ్‌ కనిపించనున్నారు. గతేడాదే ఈ చిత్రాన్ని ప్రకటించారు అక్షయ్‌. అయోధ్యలో చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నుష్రత్‌ బరూచా కథానాయికలుగా నటిస్తున్నారు.  


ద ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ

మహాభారతంలో పాండవులు, కౌరవుల గురువు ద్రోణుడి కుమారుడు అశ్వథ్థామ. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వథ్థామ కౌరవుల తరపున పోరాడాడు. ఆయనకు మరణం లేదు అని పురాణ కథనం. అశ్వథ్థామ పాత్ర ప్రేరణతో ‘ద ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ’ను సూపర్‌ హిరో ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఆదిత్యా ధర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అశ్వథ్థామ పాత్రలో విక్కీ కౌశల్‌ నటిస్తున్నారు. ఆయన ఈ చిత్రం కోసం పలు యుద్ధ కళల్లో శిక్షణ పొందుతున్నాడు. 


బ్రహ్మాస్త్ర

ప్రపంచాన్ని నాశనం చేయగల అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా పురాణాల్లో బ్రహ్మాస్త్రాన్ని పేర్కొంటారు. ఆ  నేపథ్యంలో సాగే కథతో అయాన్‌ ముఖర్జీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, నాగార్జున, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే మూడు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్ర కథకు మహాభారతంతో, బ్రహ్మస్త్రంతో ఎలాంటి సంబంధం ఉందనేది గోప్యంగా ఉంచారు. 

Updated Date - 2021-03-21T05:54:14+05:30 IST