బొల్లినేని గాంధీకి మే 7 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ

ABN , First Publish Date - 2021-04-22T07:47:04+05:30 IST

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీకి సీబీఐ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

బొల్లినేని గాంధీకి మే 7 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీకి సీబీఐ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. 2019లో రూ.3 కోట్లు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణకు గాంధీ సహకరించలేదని, ఎలాంటి సమాచారం, పత్రాలు ఇవ్వలేదని సీబీఐ అధికారులు అభియోగాలు మోపారు. అంతే కాకుండా సాక్షులను ప్రభావితం చేసి దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తమ ఎదుట విచారణకు హాజరు కాకుండా కుటుంబ సభ్యుల పేర్లతో తప్పుడు కొవిడ్‌-19 నివేదికలు అందించారని వెల్లడించారు.  కేసు దర్యాప్తులో భాగంగా బొల్లినేని గాంధీని మంగళవారం హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి మే 7 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 2019 జూలై 8న బొల్లినేని శ్రీనివాస గాంధీ, ఆయన భార్యపై కేసు నమోదు చేశామని.. వారు దర్యాప్తునకు సహకరించలేదని, సరైన సమాచారం కూడా అందించలేదని పేర్కొంది.

Updated Date - 2021-04-22T07:47:04+05:30 IST