Abn logo
Feb 26 2021 @ 23:45PM

డ్రైవరే దొంగ

· పట్టుకున్న పోలీసులు

· బొలెరో వాహనం స్వాధీనం


నెల్లూరు(క్రైం), ఫిబ్రవరి 26:  ఇటీవల నెల్లూరులో బొలెరో గూడ్స్‌ కారియర్‌ ట్రక్‌ను దొంగలించింది ఆ వాహనం డ్రైవరే అని పోలీసులు గుర్తించి నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. నెల్లూరులోని నవాబుపేట పోలీసు స్టేషన్‌లో నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెసల రూపేష్‌ కుమార్‌ తన బంధువు సోమిశెట్టి శ్రీనివాసులుతో కలిసి నగరంలోని శెట్టిగుంట రోడ్డులో గోడౌన్‌ తీసుకుని తెల్లసున్నము హోల్‌సేల్‌ వ్యాపారము చేస్తున్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం కంపెనీ పేరు మీద మహీంద్రా బొలెరో గూడ్స్‌ పికప్‌ కారియర్‌ ట్రక్‌ను కొనుగోలు చేశారు. ఎప్పటిలాగే ఈ నెల 24వ తేదీ రాత్రి గోడౌన్‌ వద్ద వాహనాన్ని పార్కింగ్‌ చేసి వెళ్లారు. 25వ తేదీ తెల్లవారు జామున వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. బాధితుల ఫిర్యాదుతో నవాబుపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టోల్‌ప్లాజాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా బుచ్చిరెడ్డిపాళెం వద్ద టోల్‌ప్లాజా నుంచి వాహనం వెళ్లడాన్ని గుర్తించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన నిందితుడు వాహనాన్ని తమిళనాడుకు తీసుకెళ్లి విడిభాగాలుగా విడగొట్టి అమ్మేసేందుకు పథకం పన్నాడు. దీంతో శుక్రవారం ఉదయం చెన్నైకు వెళుతుండగా జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. ఆ ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసిన చలంచర్ల శివ అనే వ్యక్తే నిందితుడని తెలుసుకున్నారు. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లికి చెందిన శివ ఆ ట్రక్‌కు డ్రైవర్‌గా ఆరు నెలల క్రితం చేరాడు. కొన్నాళ్ల క్రితం ఆ వాహనానికి చెందిన ఒక తాళం పోయిందని యజమానులను నమ్మించాడు. ఆ తర్వాత అదే తాళంతో వాహనాన్ని అపహరించాడు.  ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ కే వేమారెడ్డి, ఎస్‌ఐలు బీ రమేష్‌బాబు, బీ శివప్రకాష్‌, సిబ్బంది తురకా శ్రీనివాసులు, ఎస్‌ సురేంద్రబాబు, బీ మోహన్‌బాబు, టీ పవన్‌, పీ వెంకటేశ్వర్లును డీఎస్పీ అభినందించారు.

Advertisement
Advertisement
Advertisement