Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు మంగళం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మూతపడనున్న 120 మిల్లులు
కష్టాల్లో రైస్‌ మిల్లర్లు.. రోడ్డున పడనున్న కూలీలు..
కేంద్రం నిర్ణయంతో దిక్కుతోచని స్థితి
చేతులేత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం


హనుమకొండ, నవంబరు 29 (ఆంరఽధజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులన్నీ మూతపడనున్నాయి. ఫలితంగా మిల్లలర్లతో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనబోమంటూ కేంద్రం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు బాయిల్డ్‌ రైస్‌ మిల్లులను మూసివేయాల్సిన పరిస్థితులు రాబోతున్నట్టు సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన మిల్లుల యజమానుల్లో కలకలం రేపుతోంది.

కూలీలు రోడ్డు పాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 300 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు 120 వరకు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ప్రభుత్వ కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)పైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఒక్క వరంగల్‌, హనుమకొండ జిల్లాలోనే 80 బాయిల్డ్‌రైస్‌ మిల్లులు ఉండగా, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మరో 40వరకు పనిచేస్తున్నాయి. ఇందులో చాలామిల్లులు ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయకపోతే ఆ మిల్లులకు పని లేకుండా పోయి వీటిలో పనిచేస్తున్న వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే దయనీయ స్థితి ఏర్పడనున్నది.

సబ్సిడీతో చేయూత
రాష్ట్రం నుంచి గతంలో ఒక్క కేరళకు మాత్రమే బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతి కాగా, ప్రస్తుతం అక్కడి ప్రజలు సైతం సన్నరకం బియ్యానికి అలవాటు పడ్డారు. దీంతో బాయిల్డ్‌ రైస్‌ను కాకినాడ, కృష్టపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ మిల్లర్లకు క్వింటాలుకు రూ.2400 పడుతోంది. ఈ ధర ప్రకారం మిల్లర్లకు గిట్టుబాటు అయ్యేలా కొనుగోలు చేయాలంటే క్వింటా వరి ధాన్యాన్ని రూ. 1400లోపు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో కనీస మద్దతు ధర లభించదు. ఎక్స్‌పోర్టు మీద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే రైతులకు మద్దతు ధర దక్కే అవకాశం ఉంది. గతేడాది దొడ్డు రకం కాకుండా సన్నాలు సాగు చేస్తే కనీస మద్దతు ధర దక్కక పోగా ధాన్యం అమ్ముకునేందుకు నానా అవస్థలు పడ్డారు. దీంతో రైతులు దొడ్డురకం ధాన్యంపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్రం నిర్ణయం వల్ల అదీ పోయింది.

ఆర్థిక భారం
పారాబాయిల్డ్‌ మిల్లులను రా రైస్‌ మిల్లులుగా మార్చాలంటే మిల్లులో కొన్ని భాగాలను మార్చాల్సి ఉంటుంది. దానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చవుతుంది. ఇప్పటికే మిల్లులు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక్కో మిల్లుకు రూ.5కోట్ల నుంచి రూ.10కోట్లు వెచ్చించారు. ఈ దశలో కొందరు మిల్లులను మూసి వేసుకునే పరిస్థితులు నెలకొననున్నాయి. బాయిల్డ్‌ రైస్‌ తీసుకోకపోతే మిల్లర్లు తీవ్రంగా నష్ట పోతారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ధాన్యం తడిసి నూక శాతం పెరిగి 30 నుంచి 40 శాతమే రైస్‌ వస్తుంది. బాయిల్డ్‌ అయితే నూక శాతం తగ్గుతుంది. ఆ అవకాశం లేకపోతే తీవ్ర నష్టం తప్పదంటున్నారు రైస్‌ మిల్లర్లు.

నష్టపోయే ప్రమాదం
వానాకాలంలో సాగుచేసే సన్న రకం ధాన్యాన్ని రైతులు కొంత మేర తినడానికి ఉంచుకోగా మిగతా వాటిని మిల్లర్లు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. యాసంగిలో మాత్రం రైతులు దొడ్డు ధాన్యాన్ని అధికంగా సాగు చేస్తారు. ఈయాసంగిలో పండే వరిధాన్యం మిల్లులో ఆడిస్తే నూకల శాతం అధికంగా ఉంటుంది. కనుక మిల్లర్లు యాసంగిలో వచ్చే ధాన్యాన్ని బాయిల్డ్‌  చేసి ఉప్పుడు బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్‌ కింద ఇస్తే ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం సీఎంఆర్‌ కోసం ధాన్యం కొనుగోలు చేసి ఇస్తేనే బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు నడుస్తాయి. ఇప్పుడు కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని చెప్పడంతో మిల్లర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

ఎగుమతే దిక్కు
ప్రభుత్వ బాయిల్డ్‌ రైస్‌ కొనకపోతే ఆ మిల్లుల యజమానులకు ఇక ఎగుమతే దిక్కు. ప్రైవేటు మార్కెట్‌లో దొడ్డు బియ్యం ధాన్యం కొనుగోలు చేసి మరాడించి ఎగుమతిచేస్తే తప్ప ఈమిల్లులకు మనుగడ లేదు. కానీ ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సీఎంఆర్‌ వల్ల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేనందు వల్ల ఇప్పటివరకు మిల్లర్లపై ప్రత్యక్షంగా ఆర్ధిక భారం పడలేదు. కానీ ఇప్పుడు ధాన్యం కొనుగోలు, మిల్లింగ్‌, ఎగుమతి తదితర వాటికి మిల్లర్లు ముందుగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అసలే రైస్‌మిల్లులు నష్టాల్లో నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత భారాన్ని మోసే పరిస్థితుల్లో లేరు. అందువల్ల బాయిల్డ్‌ రైస్‌ మిల్లులను కాపాడేందుకు ప్రభుత్వం ఉదారంగా ముందుకు రావాలనీ, రాయితీలు ఇవ్వాలని మిల్లర్లు కోరుతున్నారు.

Advertisement
Advertisement