బీఓఐ లాభం రూ.561 కోట్లు

ABN , First Publish Date - 2022-08-03T09:37:44+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 22 శాతం తగ్గి రూ.561 కోట్లుగా..

బీఓఐ లాభం రూ.561 కోట్లు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 22 శాతం తగ్గి రూ.561 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.720 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొండి పద్దుల (ఎన్‌పీఏ)  కోసం  కేటాయింపులు ఎక్కువగా చేయాల్సి రావటంతో లాభం తగ్గిందని బ్యాంక్‌ పేర్కొంది. ఈ కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం కూడా రూ.11,641.37 కోట్ల నుంచి రూ.11,124.36 కోట్లకు తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో వడ్డీయేతర ఆదాయం తగ్గటంతో నిర్వహణ లాభం రూ.2,749 కోట్ల నుంచి రూ.2,183 కోట్లకు పడిపోయిందని బీఓఐ ఎండీ, సీఈఓ ఏకే దాస్‌ తెలిపారు. మరోవైపు జూన్‌ త్రైమాసికంలో రెండు పెద్ద ఖాతాలకు సంబంధించి రూ.500 కోట్ల మేర కేటాయింపులు చేపట్టడం పనితీరుపై ప్రభావం చూపించిందని పేర్కొన్నారు.


కాగా వడ్డీయేతర ఆదాయం రూ.2,320 కోట్ల నుంచి రూ.1,152 కోట్లకు తగ్గగా నికర వడ్డీ మార్జిన్లు మాత్రం 29.51 శాతం వృద్ధితో రూ.4,072 కోట్లకు చేరుకుందని దాస్‌ తెలిపారు. త్రైమాసిక కాలంలో స్థూల ఎన్‌పీఏలు 13.51 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గగా నికర ఎన్‌పీఏలు 3.35 శాతం నుంచి 2.21 శాతానికి తగ్గినట్లు చెప్పారు. కాగా మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు రూ.873 కోట్ల నుంచి రూ.1,304 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ తెలిపింది. 

Updated Date - 2022-08-03T09:37:44+05:30 IST