బ్యాక్‌లాగ్‌లో బోగస్‌లు!

ABN , First Publish Date - 2022-05-18T06:20:00+05:30 IST

ఒకవైపు అధికారులు నిర్లక్ష్యం.. మరోవైపు అభ్యర్థులు అక్రమాలు వెరసి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ మళ్లీ మొదటికొచ్చేలా ఉంది.

బ్యాక్‌లాగ్‌లో బోగస్‌లు!
ఒంగోలులో వంట పరీక్షకు హాజరైన అభ్యర్థులు (ఫైల్‌)

600కు 599 మార్కులు వచ్చినట్లు సృష్టి

హెచ్‌ఎంలు, ప్రైవేటు స్కూళ్లను మాయజేసి..

పుట్టిన తేదీ.. లోకల్‌ సర్టిఫికెట్లు కూడా అంతే

 మెరిట్‌ జాబితాలపై ఫిర్యాదులు

 ఏడాదిగా సాగుతున్న నియామక ప్రక్రియ

 మళ్లీ మొదటికొచ్చిన  మెరిట్‌ జాబితా

ఒకవైపు  అధికారులు నిర్లక్ష్యం.. మరోవైపు అభ్యర్థులు అక్రమాలు వెరసి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ మళ్లీ మొదటికొచ్చేలా ఉంది. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లలో అత్యధికం బోగస్‌వని తేలుతున్నాయి. ఎక్కువ మంది  ఇచ్చిన మార్కుల జాబితాల్లో 600కు 599 వచ్చినట్లు ఉండటం అనేక అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది. వీటిపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టగా బోగస్‌లు వాస్తవమన్న విషయం బయటపడుతోంది.  అలాగే పుట్టిన తేదీ, పుట్టిన స్థలం సర్టిఫికెట్లు కూడా తప్పుడివి సమర్పించినట్లు తేలుతోంది. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి మెరిట్‌ జాబితా ప్రకటించిన తర్వాత అభ్యంతరాలు వెల్లువెత్తాయి.

ఒంగోలు నగరం, మే 17 : జిల్లాలోని 59 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఏడాది కాలంగా కొనసాగుతున్న ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది.  600 మార్కులకు 599, 598, 597 ఇలా 550పైగా మార్కులు సాధించినట్లు అభ్యర్థులు దరఖాస్తులు చూస్తేనే అడ్డదారులు తొక్కినట్లు తెలిసిపోతోంది. ఈ పోస్టుల భర్తీకి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఏడాది క్రితం నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇందులో ఆఫీస్‌ సబార్డినేట్‌, వాచ్‌మెన్‌, వంటమనిషి వంటి పోస్టులు ఉన్నాయి. ఆఫీసు సబార్డినేట్‌ పోస్టుకు ఏడో తరగతి, వాచ్‌మన్‌ పోస్టుకు ఐదో తరగతి విద్యార్హతగా పేర్కొన్నారు. 59పోస్టులకు పది వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వాచ్‌మన్‌ పోస్టుకు ఇంజనీరింగ్‌, ఎంబీఏ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఉన్నత విద్యను పరిగణనలోకి తీసుకోబోమని, కనీస విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాల నియామకం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అభ్యర్థులు పలువురు అడ్డదారులు తొక్కేశారు. 


మెరిట్‌ జాబితా మళ్లీ మొదటికి...

ఏడాది క్రితం నోటిఫికేషన్‌ విడుదలైంది. వాస్తవంగా నెల, రెండు నెలల్లో భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తిచేసే అవకాశం ఉంది. కానీ ఇంత వరకూ కొలిక్కిరాలేదు. ఈ పోస్టుల భర్తీకి తొలుత నోటిఫికేషన్‌ జారీ  చేసిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఒక ధర్మసందేహం వచ్చింది. ఏడు, ఐదు తరగతులు విద్యార్హతగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకు ఉన్నత చదువులు చదివిన వారు దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రాధాన్యం ఇవ్వాలా లేదా అనేది తేల్చలేకపోయారు. దీంతో ప్రభుత్వానికి లేఖ రాశారు. తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో ఉన్నతాధికారులను కోరారు. నెలలు గడుస్తున్నా ఆ లేఖకు ఉన్నతాధికారుల నుంచి సమాధానం లేదు. దీంతో సంక్షేమశాఖ అధికారులు కొంతకాలం ఆ ఫైలును పక్కన పడేశారు. ప్రవీణ్‌కుమార్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దీనిపై దృష్టిసారించారు. జిల్లాలో ఎలాంటి నియామకాలు జరిగినా జిల్లా ఎంపిక కమిటీ కన్వీనర్‌గా జడ్పీ సీఈవో ఉంటారు కాబట్టి.. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలును సీఈవోకు పంపించాలని ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. దీంతో ఈ ఫైలు సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం నుంచి జడ్పీకి మారింది. అయితే సీఈవో దీనిపై కొంత కదలిక తెచ్చారు. అన్నీ పూర్తి చేసి మెరిట్‌ జాబితా కూడా విడుదల చేశారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విచారణ చేపట్టారు. ఇప్పుడు మెరిట్‌లో ఉన్న 80శాతం మంది సర్టిఫికెట్లు బోగస్‌వే అని తేలే అవకాశం ఉంది. దీంతో మెరిట్‌ జాబితాను తాజాగా తయారుచేయాల్సి ఉంది.


హెచ్‌ఎంలను ప్రలోభపెట్టి..

కనీస విద్యార్హతగా ఆఫీసు సబార్డినేట్‌ పోస్టుకు అవసరమైన ఏడో తరగతిలో తమకు వచ్చిన మార్కుల జాబితాలను అభ్యర్థులు  తారుమారు చేసేశారు. ఇలా వాచ్‌మెన్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా తమ ఐదో తరగతి మార్కుల జాబితాలను సొంతంగా సృష్టించుకున్నారు. 600 మార్కులకుగాను తమకు 599 వచ్చినట్లుగా జాబితాలను కొంతమంది తమకు తామే తయారు చేసుకోగా, మరికొందరు ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను ప్రలోభపెట్టి ఎక్కువ మార్కులు వేయించుకుని తెచ్చారు. తీరా మెరిట్‌ జాబితా విడుదల చేశాక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదులందాయి. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ చేయిస్తుండగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 


పాఠశాలలకు వెళ్లి విచారణ

అత్యధికంగా ప్రైవేట్‌ పాఠశాలల నుంచి తెచ్చుకున్న సర్టిఫికెట్లలో అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వేసి ఉన్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ నుంచి అధికారుల బృందం ఆయా పాఠశాలలకు వెళ్లి సర్టిఫికెట్లను పరిశీలన చేస్తున్నారు. పాఠశాల రికార్డుల్లో ఉన్న మార్కులు 600లకు గాను సగానికి సగం అంటే 300ల కంటే తక్కువ ఉంటున్నాయి. అభ్యర్థి పోస్టుకు దరఖాస్తు చేసిన సమయంలో ఇచ్చిన మార్కుల జాబితాల్లో 500లకు పైగా   ఉన్నాయి. ఇలా విద్యాశాఖ జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలలకు వెళ్లి చేపట్టిన విచారణలో బోగస్‌ సర్టిఫికెట్లు వెలుగు చూస్తున్నాయి. 


బర్త్‌.. నేటివిటీ సర్టిఫికెట్లు కూడా బోగస్‌వే..

కొంతమంది అభ్యర్థులు పుట్టినతేదీని కూడా తప్పుగా చూపించారు. స్కూలు రికార్డుల్లో ఒక తేదీ ఉంటే వీరు ఇచ్చిన సర్టిఫికెట్లలో ఇంకో తేదీ ఉంది. జిల్లాకు చెందిన వారికి నియామకాల్లో లోకల్‌ అభ్యర్థులుగా పరిగణించి ప్రాధాన్యం ఇస్తారు. కానీ కొంతమంది స్థానికేతరులు కూడా ఇదే జిల్లాకు చెందిన వారుగా సర్టిఫికెట్లు పుట్టించి దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది ఏపాఠశాలలో కూడా చదవకపోయినా ఐదో తరగతి చదివి పాసైనట్లు ధ్రువపత్రం పెట్టి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. విద్యాశాఖ అధికారుల బృందం ఈ మేరకు ఇలాంటి సర్టిఫికెట్లు సమర్పించిన అందరిపై విచారణ పూర్తిచేసి బోగస్‌లను గుర్తించినట్లు సమాచారం. 


వంట మనిషి పోస్టులకు వందల మంది

ఈ నోటిఫికేషన్‌లో నాలుగు వంట మనిషి పోస్టులకు కూడా దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 506 దరఖాస్తులు అందాయి. చదవటం, రాయటం, వంట చేయటం తెలిసి ఉండాలని అర్హతగా పెట్టారు. అయితే ఈ 506 మందిలో అర్హులను గుర్తించేందుకు గత మార్చిలో రాతపరీక్ష, వంట చేసే పరీక్ష నిర్వహించారు. వీరి తుదిజాబితా కూడా ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే 33 మహిళా డ్రైవర్‌ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్‌లోనే పిలిచారు. అయితే 100 వరకు దరఖాస్తులు అందినా అందులో ఒక్కరికి కూడా అర్హత లేదు. డ్రైవర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి హెవీ వెహికల్‌ లైసెన్సు ఉండాలనే నిబంధన కారణంగా ఏ ఒక్కరూ అర్హత సాధించలేదు. దీంతో 33 డ్రైవర్‌ పోస్టులు ఈసారి కూడా భర్తీకాకుండా అలాగే మిగిలిపోనున్నాయి. మొత్తానికి ఇలా బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో జాప్యం అనివార్యంగా కొనసాగుతూనే ఉంది. 


Updated Date - 2022-05-18T06:20:00+05:30 IST