బొగ్గుట్ట నెత్తుటి జ్ఞాపకం

ABN , First Publish Date - 2022-08-09T07:22:12+05:30 IST

బొగ్గుట్ట నెత్తుటి జ్ఞాపకం

బొగ్గుట్ట నెత్తుటి జ్ఞాపకం
ఇల్లెందులో ఏర్పాటు చేసిన స్మృతివనం

84ఏళ్ల క్రితం మొహర్రం రోజున పెను విషాదం

ఇల్లెందు సింగరేణి గనిలో 43మంది మృత్యువాత 

ఇల్లెందు, ఆగస్టు 8: ‘అసైదులా హారతి.. కాళ్లగజ్జెల గమ్మతి’ అంటూ త్యాగానికి ప్రతీకగా జరుపుకొనే మొహర్రం రోజున సింగరేణి కాలరీస్‌ చరిత్రలో చెరగని ఓ విషాద ఘట్టం జరిగింది. 84ఏళ్ల నాడు ఇల్లెందు బొగ్గు గనిలో పండుగ రోజున జరిగిన భారీ విస్ఫోటంలో 43మంది కార్మికులు, అధికారులు మృతువాత పడిన సంఘటనను ఇప్పటికీ తలచుకోని వారుండరు. బొగ్గుట్టగా పేరున్న ఇల్లెందులో 1938 మార్చి 12న అన్ని ప్రాంతాలతో పాటే మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్న వేళ.. స్ట్రట్‌ ఇంక్లైన బొగ్గుగనిలో రాత్రి షిప్టులో గ్యాస్‌ విస్ఫోటం జరిగి పెనుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆంగ్లేయులైన అప్పటి జనరల్‌ మేనేజర్‌ అండ్రూ్‌సతోపాటు హ్యాన్సన, యంగ్‌ అనే అధికారులు సహా 43 మంది కార్మికులు, కాంట్రాక్టర్లు మరణించారు. భూగర్భంలో జరిగిన ప్రమాదం కావడంతో వారి శరీర భాగాలు మాంసం ముద్దలుగా చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో 37 మంది పురుషులు, ఆరుగురు స్త్రీలున్నారు. ఇక నాడు వారి మాంసంముద్దలను స్థానిక 24 ఏరియాలోనే ఖననం చేశారు. అయితే ఈ ప్రమాద మృతులను సంస్మరించే కార్యక్రమానికి ఇల్లెందులో 2015నుంచే శ్రీకారం చుట్టారు. ఖననం చేసిన ప్రాంతం చుట్టూ ప్రహరీని నిర్మించి మృతుల పేర్లతో శిలాఫలకాలతో స్మృతివనం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా సింగరేణి అదికారులు,కార్మిక సంఘాల నాయకులు మొహర్రం రోజున అమరులకు నివాళులర్పిస్తున్నారు.


చీకటి సూర్యుల మరణాలకు లేని గుర్తింపు..

నిత్యం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మృత్యు గుహల లాంటి భూగర్భంలో బొగ్గు పొరల్లోకి వెళ్లి నల్ల బంగారాన్ని వెలకితీస్తూ ప్రభుత్వానికి రూ.కోట్ల లాభాలను తెచ్చి పెడుతున్న బొగ్గు గని కార్మికుల త్యాగాలకు,ఆత్మ బలిదానాలకు తగిన గుర్తింపు లభించడం లేదని కార్మిక వర్గం ఆవేదన చెందుతోంది. అన్ని రంగాల్లో మాదిరిగా ఓరోజును సంస్మరణదినంగా పాటించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం లండన స్టాక్‌ ఎక్సేంజ్‌లో సింగరేణి కాలరీస్‌ కంపెనీగా నమోదైన డిసెంబరు 23న మాత్రమే సింగరేణి డే గా వేడుకలు నిర్వహిస్తుండడం, ఈ వేడుకల్లోనూ మృతిచెందిన కార్మికులకు సంబంధించి సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించకపోవడం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. 



Updated Date - 2022-08-09T07:22:12+05:30 IST