పట్టింపు లేని పర్యాటకం

ABN , First Publish Date - 2021-06-13T05:57:02+05:30 IST

బొగత.. తెలంగాణ నయాగారా. ప్రకృతి సిద్ధ ఈ జలపాతం గురించి తెలియని వారుండరు. 2014 నుంచి టూరిస్టులకు ఇది ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు దీన్ని లక్షలాది మంది సందర్శించి ఉంటారు. ఇంతగా ఆదరణ పొందిన ఈ పర్యాటక ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంగా ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు భద్ర త లేకుండాపోయింది.

పట్టింపు లేని పర్యాటకం

బొగత వద్ద భద్రత కరువు

రక్షణ చర్యలు లేకుండానే టూరిస్టులకు అనుమతి

అభివృద్ధిని మరచిన యంత్రాంగం

రెస్క్యూటీం నిర్వీర్యం

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తొలగింపు


వాజేడు, జూన్‌ 12: బొగత.. తెలంగాణ నయాగారా. ప్రకృతి సిద్ధ ఈ జలపాతం గురించి తెలియని వారుండరు. 2014 నుంచి టూరిస్టులకు ఇది ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు దీన్ని లక్షలాది మంది సందర్శించి ఉంటారు. ఇంతగా ఆదరణ పొందిన ఈ పర్యాటక ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంగా ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు భద్ర త లేకుండాపోయింది. ఇప్పటి వరకు అనేక మంది ఇక్కడ నీటమునిగినా రక్షణ చర్యలు చేపట్టడం లేదు. అటవీ శాఖ ఆధీనంలో ఉన్న బొగతను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌తో మూతపడిన ఈ జలపాతాన్ని అధికారులు శనివారం పునఃప్రారంభించారు. 

బొగత అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నా యి. సమృద్ధిగా వర్షాలు పడితే దీని  సౌం దర్యం మరింత రెట్టింపువుతుంది. దీన్ని సందర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి అనేక మంది నిత్యం వస్తుంటారు. సహజంగా వీరిలో తెలుగు రాష్ట్రాల నుం చి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. అయి తే.. ఇక్కడ సౌకర్యాలు సరిగా లేక పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. అంతేకాదు.. ఇక్కడ నిత్యం ప్ర మాదాలు చోటుచేసుకోవడం భ యాందోళన కలిగిస్తోంది. ఏడేళ్ల కాలంలో జలపాతం వద్ద సు మారు 18 మందికి పైగా నీట మునిగి మృతి చెందారు. దీంతో అధికారులు జలపాతం ముందు, ఈత కొలను చుట్టూ ఇనుప కం చెను ఏర్పాటు చేశారు. అయితే.. గత ఏడాది జలపాతం వరద ఉధృతి కంచె కొట్టుకుపోయింది.  ఆ తర్వా త అధికారులు రక్షణ చర్యలు చేపట్టనేలేదు. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ప్రమాదం ముంచు కొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇదేమీ పట్టించుకోకుండా పర్యాటకులను సందర్శనకు ఎలా అనుమతిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మరిన్ని సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. మహిళలు బట్టలు మార్చుకునేందుకే నిర్మిస్తున్న  గదులు ఇప్పటి వరకు పూర్తికాలేదు. చిల్డ్రన్స్‌పార్క్‌ సైతం అస్తవ్యస్తంగా మారింది. 

‘ఔట్‌సోర్సింగ్‌’ లేక..

జలపాతం వద్ద విధులు నిర్వహిస్తున్న సుమారు 15 ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ప్రస్తుతం పక్కన పెట్టారు. కరోనా విజృంభిస్తున్న నేపఽథ్యంలో పర్యాటకుల సందర్శన తగ్గిపోవడంతో జీతాలు చెల్లించలేమని సిబ్బందిని తొలగించినట్టు తెలుస్తోంది. బొగత టూరిజంగా మారినప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్న స్థానిక యువత ప్రస్తుతం ఉపాధి కోల్పోయారు. జలపాతం వద్ద ప్రమాదాలను నిలువరించేందుకు నాటి ములుగు సబ్‌కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ప్రత్యేక చొరవతో ఎనిమిది మందితో రెస్క్యూటీం ఏర్పాటు చేశారు. పర్యాటకులకు రక్షకులుగా ఉన్న వీరు సమర్థంగానే పనిచేశారనే పేరు ఉంది.  జలపాతం ఉధృతికి కొట్టుకుపోతున్న ఎంతోమంది పర్యాటకులను కాపాడగలిగారు. బొగత సందర్శనకు అనుమతులు ఇస్తున్న నేపఽథ్యంలో వీరి అవసరం ఎంతైనా ఉందని పర్యాటకులు అంటున్నారు.   

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా..

 బొగత వద్ద వచ్చే ఆదాయంతో చేపట్టిన పనులు పత్తాలేకుండా పోయాయి. జలపాతం పైభాగంలో మరో చెక్‌డ్యాం నిర్మాణానికి అటవీ శాఖ ఉన్నతాధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా నేటి వరకు ఆ పనులు పట్టాలెక్కలేదు. ఊగే వంతెన (సస్పెన్షన్‌ బ్రిడ్జి), మరుగుదొడ్లు నిర్మాణాలు ఊసే లేకుండా పోయాయి. బటర్‌ఫ్లై పార్కు, చిల్డ్రన్స్‌పార్కులో మరమ్మతులకు వచ్చిన పరికరాలు, బ్యాటరీ వాహనాలు నిరుపయోగంగానే ఉన్నాయి. 

పట్టించుకోని అధికారులు

బొగత అభివృద్ధిని అటవీ శాఖ అధికారులు గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారిపై అవినితి ఆరోపణలు  వచ్చాయి. దీంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం వచ్చిన అధికారి తమకేమీ పట్టనట్లు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.  ప్రస్తుతం ఆ అధికారి కూడా బదిలీ కావడంతో మరో అధికారి బాధ్యతలు తీసుకున్నారు. ఈ అధికారి అయినా జలపాతం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు రావాల్సి ఉంది..

- లక్ష్మీనారాయణ, ఎఫ్‌ఆర్‌వో (వాజేడు)

వారాంతాల్లో పర్యాటకుల సందర్శనకు అనుమతిని ఇచ్చాం. సందర్శకుల రద్దీని బట్టి ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. కరోనా వల్ల అభివృద్ధి పనులు నిలిచిన మాట వాస్తవమే. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం.

Updated Date - 2021-06-13T05:57:02+05:30 IST