ఒళ్లునొప్పులు.. జ్వరం

ABN , First Publish Date - 2022-06-30T06:34:19+05:30 IST

నిన్న మొన్నటివరకు ఎండ, ఉక్కపోతలతో అల్లాడిన జనం ప్రస్తుత వాతావరణ మార్పుతో ఆందోళన చెందుతున్నారు. గత కొద్దిరోజులుగా చెదురుమదురు వానలు పడుతున్నాయి.

ఒళ్లునొప్పులు.. జ్వరం
రిమ్స్‌లోని ఓపీ విభాగం వద్ద బారులు తీరిన ప్రజలు

కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు

ఆసుపత్రులకు బారులు తీరుతున్న బాధితులు 

ఒంగోలు (కార్పొరేషన్‌) జూన్‌ 29 : నిన్న మొన్నటివరకు ఎండ, ఉక్కపోతలతో అల్లాడిన జనం ప్రస్తుత వాతావరణ మార్పుతో ఆందోళన చెందుతున్నారు. గత కొద్దిరోజులుగా చెదురుమదురు వానలు పడుతున్నాయి. దీంతో జనాల్లో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఎవరిని పలకరించినా ఒళ్లునొప్పులు.. జ్వరం అంటున్నారు. బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బారులు తీరుతుండగా, వర్షాకాలం ఆరంభంలో ఇవి సర్వసాధారణమేనని వైద్యులు అంటున్నారు. కాగా గడిచిన ఏడాదిన్నర కాలంగా కొవిడ్‌ నుంచి కోలుకున్నాం. వైరస్‌ ప్రభావం తగ్గిందన్నధీమాతో జనం ఉండగా, ఇటీవల నాల్గో విడత కేసులు పక్క జిల్లాల్లో కనిపిస్తుండటంతో జిల్లాలోనూ భయం మొదలైంది. దీంతో మామూలు జ్వరమా? కొవిడా అనే ఆందోళన వెంటాడుతోంది. అయితే ఈ సీజన్‌లో  ఇప్పటివరకు జిల్లాలో అధికారికంగా కొవిడ్‌ కేసులు నమోదు కాలేదు. మొత్తంగా వర్షాల కారణంగా అధికశాతం మంది జ్వరం, ఒళ్ళు నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. 


పారిశుధ్యంపై ముందస్తు చర్యలేవి ?

వానాకాలం మొదలైంది. దోమల దాడులు తీవ్రమయ్యాయి. పట్టించుకోవాల్సిన యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోంది.నగరంలో పలు స్థలాల్లో మురుగునీరు నిలిచి కంపుకొడుతోంది. అంతేకాకుండా ఎటువంటి వ్యాధులు రాకుండా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది, బ్లీచింగ్‌, ఫాగింగ్‌, ఖాళీస్థలాల్లో ఆయిల్‌ బాల్స్‌ వదలడం, మురుగు చెరువుల్లో గంభూషియా చేపల విడుదల చేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.


వైరల్‌ జ్వరం లక్షణాలు 

వైరల్‌ జ్వరం మూడు రోజుల్లో తగ్గుతుంది. కఫంతో కూడిన దగ్గు సాధారణంగా ఉంటుంది. గొంతునొప్పి ఉంటుంది కానీ ఛాతీనొప్పి ఉండదు. వాంతులు, విరేచనాలు ఉంటాయి. ముక్కు నుంచి జలుబు నీరులాగా కారుతుంది. 


కరోనా వైరస్‌ లక్షణాలు 

తీవ్రజ్వరం, కళ్ళు ఎర్రబడతాయి, చాతీలో నొప్పి ఉంటుంది. గొంతులో నొప్పి ఉంటుంది. వాంతులు, విరేచనాలు ఉంటాయి. జ్వరం మూడురోజులైనా తగ్గదు. జలుబు ఉన్నా, ముక్కులు కారవు, పొడిదగ్గు పదేపదే వస్తుంది. రుచి, వాసన తెలియదు. నొప్పులు తీవ్రంగా ఉంటాయి. గొంతునొప్పి ఉంటుంది. ఒక్కోసారి వీటిలో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా బయటకు తెలియని పరిస్థితి ఉంటుంది. 


Updated Date - 2022-06-30T06:34:19+05:30 IST